గల్లీ గల్లీ.. తల్లికి ప్రణమిల్లి!
eenadu telugu news
Updated : 02/08/2021 12:28 IST

గల్లీ గల్లీ.. తల్లికి ప్రణమిల్లి!

నగరమంతటా ఒకేరోజు బోనాల ఉత్సవాలు

దర్శనానికి వస్తున్న బిగ్‌బాస్‌ ఫేం సుజాత

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రతి గడపా పసుపు రాసుకుందీ.. పచ్చని తోరణాలు కట్టుకుంది.. మైకుల్లో పాటలు, డప్పుళ్ల చప్పుళ్లతో ప్రతి బస్తీ మార్మోగింది. ఆలయాలన్నీ కిటకిటలాడాయి. అమ్మవార్ల నినాదాలు, వీధుల్లో విగ్రహాలు, పోతరాజుల ఆటలు, ఆడపడుచులు తలకెత్తిన బోనాలతో నగరం మురిసింది. వచ్చే ఆదివారం రోజున అమావాస్య వస్తుండటంతో తొలిసారి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ ఆదివారమే నగరవాసులు బోనమెత్తారు. సాధారణంగా గోల్కొండ, లష్కర్‌ బోనాల తర్వాత హైదరాబాద్‌ బస్తీలు బోనాల ఉత్సవాలు చేసుకుంటాయి. లాల్‌దర్వాజా సింహవాహినీ అమ్మవారు, చార్మినార్‌ భాగ్యలక్ష్మి, ఖైరతాబాద్‌ మహాకాళి, ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయాలు కిటకిటలాడాయి. లాల్‌దర్వాజా, గౌలిగూడ, ఛత్రినాక, అలియాబాద్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, శాలిబండ మార్కెట్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ కమిటీలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. తెల్లవారుజామున 4గంటల నుంచే బోనాలతో వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ రద్దీగా కనిపించాయి.

హోంగార్డు నుంచి కొత్వాల్‌ దాకా..

ఆదివారం నగరంలో బోనాల ఉత్సవాల నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 8వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. కమిషనర్‌ అంజనీకుమార్‌ నుంచి కింది స్థాయి హోంగార్డు దాకా ప్రతి ఒక్కరూ వీధుల్లో కనిపించారు. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి.. ట్రాఫిక్‌ మళ్లింపు తదితర విషయాలను కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా నియంత్రించారు. ప్రధాన ఆలయాల వద్ద దారుల్ని మూసి ట్రాఫిక్‌ తరలించడంతో చాలా రోడ్లు వాహనాలతో బారులు తీరాయి.

ప్రత్యేక అలంకరణలో సింహవాహినీ మహాకాళి

* సబ్జిమండి మహాకాళి ఆలయంలో ఉత్సవాల్లో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

* టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి లాల్‌దర్వాజాతోపాటు అక్కన్న మాదన్న ఆలయాలను సందర్శించారు.

కార్వాన్‌ సబ్జిమండి బస్తీలో అంబారిపై ఊరేగింపు

భక్తులతో కిటకిటలాడుతున్న లాల్‌దర్వాజ సింహవాహినీ మహాకాళి

అమ్మవారి ఆలయ పరిసరాలు

లాల్‌దర్వాజకు బోనాలతో భారీగా తరలివచ్చిన భక్తులు 

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని