కాంస్య సింధూరం
eenadu telugu news
Updated : 02/08/2021 13:52 IST

కాంస్య సింధూరం

ఒలింపిక్స్‌లో గెలుపుతో మురిసిన భాగ్యనగరం

విశ్వ వేదికపై మార్మోగిన హైదరాబాద్‌ పేరు

బోనాల రోజునే గెలిచారంటూ సంబరాలు

2019 ఆగస్టులో లాల్‌దర్వాజ సింహవాహినీ మహాకాళి అమ్మవారికి

బోనం సమర్పించేందుకు వచ్చిన సింధు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘‘మన బిడ్డ గెలవాలి.. మన గడ్డ పేరు నిలపాలి.. నగరం బోనమెత్తిన ఈ రోజునే ఆడుతోంది.. ఏటా తల్లికి ఎత్తిన బోనమే తనను గెలిపిస్తుంది.’’ ఇదీ ఆదివారం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం పోరాడుతున్న సింధు విజయంపై నగరవాసులు పెట్టుకున్న నమ్మకం. సాయంత్రానికి అది నిజమైంది. అంతా కోరుకున్నట్లే హైదరాబాదీ బిడ్డ మరోసారి ప్రపంచ వేదికపై పురిటి గడ్డ కీర్తిని చాటింది. వరుసగా రెండోసారి పతకాన్ని గెలిచి నగర క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపింది. సికింద్రాబాద్‌లో మొదలై.. ఎన్నో సవాళ్లను దాటుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వవేదికపై నిలిచిన సింధు ప్రస్థానం భాగ్యనగర వీధుల్లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే.

ఇక్కడే పుట్టి.. ఇక్కడే ఎదిగి..!

వాలీబాల్‌ క్రీడాకారులు పూసర్ల రమణ, విజయ దంపతులకు 1995 జులై 5న హైదరాబాద్‌లో జన్మించింది సింధు. తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్‌ క్రీడాకారులైనా తెలుగు బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ వైపు అడుగులేసింది. తన తండ్రి దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కావడంతో ఇక్కడే తన తండ్రితో పాటు సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్‌ కేంద్రంలో తొలిసారి షటిల్‌ పట్టింది. కఠిన శ్రమ, దీక్ష, ఆటపై ప్రేమ, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తక్కువ కాలంలోనే అగ్ర క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

మిఠాయి తినిపిస్తూ ఆనందం పంచుకుంటున్న తల్లి విజయ

నగర ప్రేమిక!

తను పుట్టి పెరిగిన హైదరాబాద్‌ అంటే సింధుకు అమితమైన ప్రేమ. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ఆహారం అలవాట్లన్నా ఎంతో ఇష్టమని తరచూ అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తుంది. నగర అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో ఎప్పుడూ పాల్గొనే ఆమె ఇక్కడి కట్టుబొట్టుతోనే ప్రతిసారీ బోనమెత్తుకుంటోంది. క్రీడాకారిణిగా ఎదుగుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ చురుగ్గా పాల్గొంటోంది. కొవిడ్‌ వేళలోనూ సైబరాబాద్‌ పోలీసుల ‘ప్లాస్మా దానం’ ఉద్యమానికి మద్దతు తెలిపింది. చేనేతకు మద్దతుగా నేత మాస్కులు, వస్త్రధారణ ఉద్యమానికీ ముందుకు వచ్చింది.

ఈ నీళ్లలోనే ఏదో ఉంది..!

ఇటీవల మీకు నచ్చిన క్రీడాకారిణి ఎవరంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ సంస్థ పెట్టిన పోటీలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులను భాగం చేసింది. అయితే దేశానికి ఖ్యాతి తెచ్చిన ఈ ముగ్గురూ హైదరాబాదీలే కావడంతో ప్రముఖ క్రీడా విశ్లేషకులు హర్షా భోగ్లే ‘హైదరాబాద్‌ నీళ్లలోనే ఏదో మహిమ ఉంద’ంటూ ట్వీట్‌ చేశారు.

బాల్యంలో సాధన చేస్తూ..

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని