సమీకృతానికి.. సత్వర కార్యాచరణ
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

సమీకృతానికి.. సత్వర కార్యాచరణ

 రూ.14.50 కోట్ల మంజూరు
 నిర్మించనున్న 400 దుకాణాలు

తొలగనున్న గోదాంలు ఇవే

న్యూస్‌టుడే, తాండూరు: పట్టణంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి రూ.14.50 కోట్లు మంజూరయ్యాయి. వీటితో  దుకాణ సముదాయాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మార్కెట్‌ నిర్మాణానికి విశాలమైన స్థలం లేదు.
దీంతో ప్రస్తుతం రైతుబజారు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెందిన గోదాంలు ఉన్న స్థలం అనువైనదిగా గుర్తించారు. ఇక్కడే అవసరమైన దుకాణాలను నిర్మించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 400 దుకాణాలను నిర్మించబోతున్నారు. అన్ని వర్గాల వ్యాపారులకు దుకాణాలను అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు. వినియోగదారులకు అన్ని సరకులు, కూరగాయలు ఒకే చోట లభించేలా చేపట్టనున్నారు.

ప్రవేశద్వారానికి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌గా నామకరణం

రైతు బజారు తొలగింపు: పట్టణ ప్రజల అవసరానికి రూ.85 లక్షలతో నిర్మించిన రైతుబజారు కనుమరుగు కానుంది.  2017లో 4 షెడ్లు, 13 దుకాణాల్లో కూరగాయలు విక్రయించాలని దీనిని నిర్మించారు. శౌచాలయాలు, తాగునీటి వసతిని కల్పించారు. అయితే వివిధ కారణాలతో క్రయ,విక్రయాలు జరగలేదు. నాలుగేళ్ల పాటు నిరుపయోగంగానే మారింది. గత రెండు నెలలుగా వ్యాపారులపై ఒత్తిడి తేవడంతో అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఉదయం మాత్రమే కొందరు కూరగాయలు అమ్ముతున్నారు. ప్రస్తుతం షెడ్లు, దుకాణాలను తొలగించనున్నారు.

గోదాంలు కూడా..: ఇదే ఆవరణలో ఏడు గోదాంలున్నాయి. ఒక్కో దాంట్లో 500 టన్నుల నుంచి 2.000 టన్నుల సామర్థ్యంతో సరకులను నిల్వచేసేందుకు అవకాశం ఉంది. కందులు, పెసలు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటైన రోజుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో ఒకదానిని ప్రైవేటురంగానికి చెందిన ఎరువుల వ్యాపారికి అద్దెకు ఇచ్చారు. దశల వారీగా వీటి నిర్మాణానికి వ్యవసాయ విపణి రూ.50 లక్షలకు పైగానే వ్యయం చేసింది. పనులు ప్రారంభం కాగానే వీటిని కూల్చివేయనున్నారు.

తీరనున్న ఇబ్బందులు: తాండూరు పట్టణంలో ఇప్పటి వరకు వ్యాపారులు బస్వణ్ణకట్ట, రైల్వేస్టేషన్‌ రోడ్డు, వినాయకచౌక్‌ కూడలి, పాత కూరగాయల మార్కెట్‌, మున్సిపాల్‌ కార్యాలయం సమీపం రోడ్లకు ఇరువైపులా కూరగాయాలను విక్రయిస్తున్నారు. మాంసం దుకాణాలను అపరిశుభ్ర ప్రదేశంలోనే కొనసాగుతున్నాయి. కొనుగోలుకు వచ్చే వినియోగదారులు చాలా మంది వాహనాలపైనే వస్తున్నారు. దుకాణాలకు సమీపంలోనే వాటిని నిలువరిస్తున్నారు. దీంతో  మిగిలిన వచ్చిపోయే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. పోలీసులు జోక్యం చేసుకుని వ్యాపారులను రైతుబజారుకు తరలించినా..తిరిగి పాత స్థలాలకే వచ్చి కూరగాయాలను విక్రయిస్తున్నారు. సమీకృత మార్కెట్‌ ఏర్పాటయితే సమస్యలు తొలగిపోనున్నాయి.

టెండరు నిర్వహించాలి
విఠల్‌నాయక్‌, తాండూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌

ప్రభుత్వం టెండరు నిర్వహించాల్సి ఉంది. నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం రైతుబజారుతో పాటు వ్యవసాయ మార్కెట్‌కమిటీ గోదాంలను అధికారులు తొలగించనున్నారు. సమీకృత మార్కెట్‌ నిర్మాణం పూర్తయితే పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని