ప్లాస్టిక్‌ భూతంపై పోరు!
eenadu telugu news
Published : 23/10/2021 03:06 IST

ప్లాస్టిక్‌ భూతంపై పోరు!

వ్యర్థాల తగ్గింపు, పునర్వినియోగమే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ నివారణ చర్యలను ముమ్మరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ కవర్ల తయారీని అడ్డుకునేందుకు, వాటి వినియోగాన్ని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ ఛైర్మన్‌గా త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు కానున్నాయి. జీహెచ్‌ఎంసీలో భాగమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌, జోనల్‌ కమిషనర్లు, పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్లతోపాటు కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ, పురపాలకశాఖ, పరిపాలనశాఖ, ఉన్నత విద్య, యువత-సాంస్కృతిక విభాగం, జిల్లా కలెక్టర్లు అందులో భాగంగా ఉంటారు. కార్యాచరణను తయారు చేసి, అవగాహన, ప్రచార కార్యక్రమాలు, తనిఖీలు, జరిమానాలతో ఫలితాన్ని సాకారం చేయడం టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యమని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

కేంద్ర మార్గదర్శకాలతో.. కేంద్ర సర్కారు ప్లాస్టిక్‌ వ్యర్థాల యాజమాన్యంపై 2016లో పలు మార్గదర్శకాలు రూపొందించి, వాటిని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

దేశ రాజధానిలో ఇలా.. దిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఒకసారి మాత్రమే వినియోగించి పారవేసే తాగునీటి ప్లాస్టిక్‌ సీసాలు, శీతల పానియాల సీసాలు, ఇతరత్రా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుగొనాలని టాస్క్‌ఫోర్స్‌కు లక్ష్యం నిర్దేశించింది. ఆయా బృందాలు.. ప్లాస్టిక్‌ వినియోగానికి పౌరులను దూరం చేసే మార్గాలపై దృష్టి పెట్టాయి. చెత్తలో పడేసే సీసాలను 100శాతం సేకరించడం, వాటిని పునర్వినియోగానికి లేదా రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించడం రెండో ప్రాధాన్యంగా పెట్టుకున్నాయి.

బెంగళూరులోనూ.. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అక్కడి సర్కారు వేర్వేరు స్థాయిల్లో పనిచేసేలా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో, బెంగళూరులో నగరపాలక సంస్థ చీఫ్‌ కమిషనర్‌ కింద బృందాలు పనిచేయనున్నాయి. బెంగళూరు నగరంలో ఛైర్మన్‌తో కలిపి 16 మంది సభ్యులతో దళం ఏర్పాటైంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తయ్యే మార్గాలు, ఎంత మేరకు వస్తున్నాయి. వాటిలోని రకాలు, ఏ రకం వ్యర్థాలను ఏస్థాయికి తగ్గించవచ్చు, సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగానికి పంపించడం లక్ష్యాలుగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేయనున్నాయి. 

సర్కారుకు లేఖ రాసిన జీహెచ్‌ఎంసీ
గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ త్వరలో వేర్వేరు శాఖల భాగస్వామ్యంతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆమేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని, సర్కారు పరిశీలించి, తగు సూచనలతో త్వరలో పచ్చజెండా ఊపనుందని పారిశుద్ధ్య విభాగం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని