Suicide: సోదరి వివాహానికి ముందు రోజు సోదరుడి బలవన్మరణం
eenadu telugu news
Updated : 24/10/2021 09:14 IST

Suicide: సోదరి వివాహానికి ముందు రోజు సోదరుడి బలవన్మరణం

తూప్రాన్‌, న్యూస్‌టుడే: కుమార్తె పెళ్లి పనుల్లో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. బంధువుల రాకతో ఆ ఇల్లు సందడిగా మారింది. చివరకు వారంతా పెళ్లికి కాకుండా అంత్యక్రియలకు హాజరుకావాల్సిన విషాదకర ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గుండ్రెడ్డిపల్లికి చెందిన మన్నె సుధాకర్‌, అరుణ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు నవీన్‌ (18) ఉన్నారు. సుధాకర్‌ ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుడగా, అరుణ పొలం సాగు చేసుకుంటూ ఆసరాగా నిలిచారు. నవీన్‌ ఐటీఐ చదువుతున్నాడు. ఆదివారం కూతురు అనూష వివాహం ఉండగా, ఏర్పాట్లలో అందరూ నిమగ్నమయ్యారు. నవీన్‌, తన మిత్రులతో కలిసి అక్క పెళ్లికి అన్నింటినీ చక్కబెడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఓ పని మీద వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, మిత్రులు అన్ని చోట్లా వెతికారు. ఈ క్రమంలో సొంత పొలంలో ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అప్పటివరకు పెళ్లి పనుల్లో చురగ్గా పాల్గొన్న కొడుకు మృతితో తల్లిదండ్రులు, అక్క రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. పెళ్లికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి రావడం బంధువులను కలచివేసింది. ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని