భద్రతా వలయంలో కోమన్నూతల
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

భద్రతా వలయంలో కోమన్నూతల

మూడు బృందాలతో గాలింపు చర్యలు

గ్రామంలో పోలీసుల పహారా

కోమన్నూతల(లింగాల), న్యూస్‌టుడే: ప్రశాంతంగా ఉన్న కోమన్నూతలలో ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు నిప్పును రాజేశాయి. పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులైన మాజీ సర్పంచి లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీరెడ్డిలు సర్పంచి బరిలో తమ అభ్యర్థులను నిలిపి గెలుపును ప్రతిష్టగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇరువర్గాలను కౌన్సెలింగు పేరిట పోలీసుస్టేషన్‌ చుట్టూ తిప్పినా ఘర్షణలు ఆగలేదు. ఆధిపత్యం, అభద్రతాభావంతో సర్పంచిని మట్టుబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1994లో గ్రామంలో మొదలైన ఫ్యాక్షన్‌ కక్షలు ముగ్గురిని బలితీసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలను ఇరువర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా ఎన్నికల వరకు మాత్రమే ఉద్రిక్తత పరిస్థితులుండేవి. ఆ తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉండేది. తాజాగా జరిగిన హత్యతో మరోసారి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసు బలగాల నీడలో అంత్యక్రియలు...

సర్పంచి కనం చిన్న మునెప్ప మృతదేహానికి బుధవారం పులివెందుల ప్రాంతీయ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయిన అనంతరం స్వగ్రామంలో పోలీసు బలగాల నీడన అంత్యక్రియలు నిర్వహించారు. హత్య తర్వాత పరారైన నిందితులు అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామంలో తలదాచుకున్నారన్న సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి తర్వాత మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల రాకతో నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని