close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

కారు కాల్వలో పడి దంపతుల దుర్మరణం

చేపలు కొనుగోలు చేసి వెళుతుండగా ఘటన
న్యూస్‌టుడే, తిమ్మాపూర్‌, కరీంనగర్‌ నేరవార్తలు

క్షణకాలంలో జరిగిన ఘోరం...ఆ దంపతుల ఆశల్ని నీట ముంచింది. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఘటన కన్నకొడుకులకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాజీవ్‌ రహదారిపై అల్గునూర్‌ సమీపంలోని కాకతీయ కాలువ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలో పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం కనుగులకు చెందిన మాచర్ల శ్రీనివాస్‌ (45), స్వరూప (40)లు మృత్యువాతపడ్డారు. చేపల్ని కొనేందుకు వచ్చి ఊహించని తరహాలో మృత్యుఒడిని చేరిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కారు వెనక్కి తీస్తూ.. కానరాని లోకాలకు
మాచర్ల శ్రీనివాస్‌, స్వరూపలు కరీంనగర్‌లోని ఆసుపత్రికి వైద్యం కోసం శనివారం వచ్చారు. వైద్యం చేయించుకుని బంధువుల ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఎప్పటిలాగే చేపలు తీసుకునేందుకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని అల్గునూర్‌ కాకతీయ కాలువ వద్దకు వెళ్లారు. కాలువ కట్ట పక్కనే కారును నిలిపారు. రోడ్డు పక్కనే ఉన్న వ్యాపారుల వద్ద చేపలు కొనుగోలు చేసి తిరుగు పయనమయ్యారు. అంతలో శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌కు వారి కుమారుడు ఫోన్‌ చేశాడు. స్వరూప ఫోన్‌ మాట్లాడుతుండగా శ్రీనివాస్‌ కారును వెనక్కి తీశారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు కాకతీయ కాలువలోకి దూసుకెళ్లింది. కొంతదూరం నీటిపై తేలి కొట్టుకుపోతూ ముగినిపోయింది. చుట్టూ నీరు చేరి ఊపిరాడకపోవడంతో దంపతులిద్దరూ కారులోనే తుదిశ్వాస విడిచారు.

30 నిమిషాల్లో మృతదేహాల వెలికితీత
కారు నీటిలో మునిగిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్‌ సీఐ టి.మహేష్‌గౌడ్‌, ఎల్‌ఎండీ ఎస్సై నరేష్‌రెడ్డి, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్ల సాయంతో కారును గుర్తించారు. శ్రీనివాస్‌-స్వరూపలను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు అరగంట పాటు శ్రమించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ సాయంతో కారును ఒడ్డుకు చేర్చారు. కారుడోర్‌ తెరిచి చూడగా అప్పటికే వారిద్దరూ తుదిశ్వాస విడిచారు. వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును కాలువ కట్టపైకి చేర్చారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయసారథి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

భారీగా తరలివచ్చిన జనం
రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న కాలువలో కారు పడిపోయిన విషయం నిమిషాల వ్యవధిలో సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లావాసులకు తెలిసింది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు, ఇతర వాహనదారులు కాలువ వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు, కాల్వ కట్టకు ఇరువైపులా భారీగా గుమిగూడారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటనను చూసి చలించిపోయారు.

ఒంటరైన ఇద్దరు కుమారులు
శ్రీనివాస్‌ - స్వరూప దంపతులకు అరుణ్‌, అఖిల్‌లు సంతానం. శ్రీనివాస్‌ సుల్తానాబాద్‌లో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. పెద్దకుమారుడు అరుణ్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు తండ్రికి సాయంగా దుకాణంలో ఉంటున్నాడు. తల్లిదండ్రులు దూరం కావడంతో ఇద్దరు కుమారులు ఒంటరివారయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న వారిద్దరూ  తల్లిదండ్రుల మృతదేహాలను చూసి రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.