Ts News: ప్రాణం పోసిన పోలీస్‌
logo
Published : 23/06/2021 17:23 IST

Ts News: ప్రాణం పోసిన పోలీస్‌

కరీంనగర్‌: ఉదయం లేచామా.. అందరిలాగే విధులు నిర్వర్తించామా.. తిరిగి ఇంటికి వెళ్లిపోయామా అనేలా కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌. ద్విచక్రవాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. అంబులెన్స్‌ వచ్చే వరకు వేచి చూడకుండా బాధితుడి ప్రాణాలు కాపాడాలనే తాపత్రయంతో ప్రథమ చికిత్స చేసి యువకుడికి పునర్జన్మను ప్రసాదించాడు. ఆగిన గుండెకు ప్రాణం పోసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు కరీంనగర్‌ ఒకటో ఠాణా కానిస్టేబుల్‌ ఖలీల్‌.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ద్విచక్రవాహనం ఢీకొని బొమ్మకల్‌కు చెందిన యువకుడు అబ్దుల్‌ ఖాన్‌కు గాయాలయ్యాయి. దీంతో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఖలీల్‌ యువకుడికి సీపీఆర్‌ నిర్వహించారు. గుండెపై తన చేతులతో ఒత్తిడి పెంచి గుండె పనిచేసేలా చేశారు. యువకుడి గుండె కొట్టుకోవడం ప్రారంభించాక వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన ప్రయత్నానికి వైద్యులు అభినందించారు. ఖలీల్‌ వేగంగా స్పందించారని కొనియాడారు. ప్రస్తుతం ఆ యువకుడు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని అభినందించిన కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి లైఫ్‌ సేవింగ్‌ అవార్డుకు సిఫార్సు చేశారు. కానిస్టేబుల్‌ ఖలీల్‌ చేసిన మంచి పనిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని