సేంద్రియ ఎరువు.. తయారీ బరువు
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

సేంద్రియ ఎరువు.. తయారీ బరువు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా ఉపాధి హామీలో ప్రతి గ్రామంలో కంపోస్టుషెడ్ల నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. ఎరువును హరితహారం మొక్కలకు అందివ్వాలి. కొన్ని గ్రామాల్లో ఎరువు తయారు చేస్తున్నా.. ఇంకా కొన్ని గ్రామాల్లో షెడ్లు నిరుపయోగంగా మారాయి. చెత్తను వేరు చేయడకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో కంపోస్టు షెడ్ల వినియోగంపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం..


అలంకార ప్రాయంగానే..

కోరుట్లగ్రామీణం: మండలంలో 15 గ్రామాల్లో కంపోస్టుషెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌, పేపర్లు, గాజుముక్కలు వేరు చేసి కంపోస్టు షెడ్డులో వాటికి కేటాయించిన వివిధ అరలో వేయాలి. సిబ్బంది కొరతతో చెత్తను వేరు చేయడం లేదు. గ్రామాల్లో ట్రాక్టరు ద్వారా సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తడి, పొడి చెత్తతో సెంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ప్టాస్టిక్‌, పేపర్లు వేరు చేయక పోవడంతో నిర్మించిన కంపోస్టుషెడ్లు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి.


హరితహారం మొక్కలకు..

ఇబ్రహీంపట్నం: మండలంలోని 17 గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణాలు జిల్లాలోనే మొదట పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను కంపోస్ట్‌ షెడ్లకు తరలించి, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఒకసారి సేంద్రియ ఎరువు తయారు కావడానికి సుమారు 3 నెలల సమయం పడుతుందని, ఇప్పటికి ఒకసారి అన్ని షెడ్లలో సేంద్రియ ఎరువు తయారు కాగా, దానిని హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలకు అందజేశామని, మరోమారు సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నట్లు ఎంపీడీవో కృపాకర్‌ తెలిపారు.


60 శాతం గ్రామాల్లో..

రాయికల్‌: మండలంలోని 32 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కంపోస్టు షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 60 శాతం గ్రామాల్లో మాత్రమే తడి, పొడి చెత్త వేరుగా సేకరించి కంపోస్టు షెడ్డు ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. సదరు ఎరువును హరితహారం మొక్కలకు వేస్తున్నారు. 40 శాతం గ్రామాల్లో చెత్తను వాహనాల ద్వారా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. పూర్తి స్థాయిలో కంపోస్టు షెడ్డులను వినియోగించుకోవాల్సి ఉంది.


సేకరిస్తున్నారు.. పడేస్తున్నారు

సారంగాపూర్‌: గ్రామాల్లో ఇంటింటా సేకరించిన చెత్తను వేరు చేసి షెడ్లలోని గదుల్లో వేయాల్సి ఉండగా అలాగే పడేస్తున్నారు. మండలంలో 18 గ్రామాల్లో 17 గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయగా, ధర్మనాయక్‌ తండాలో భూ వివాదం నెలకొనడంతో నిర్మాణం నిలిచిపోయింది. పూర్తయిన షెడ్లలో కేవలం అప్పుడప్పుడు సేంద్రియ ఎరువును తయారు చేస్తూ హరితహారం మొక్కలకు వేస్తున్నట్లు చూపుతున్నారు. మిగతా ప్లాస్టిక్‌, గాజు, తదితర వస్తువులు చెత్తనుంచి వేరు చేసి షెడ్లలో ఏర్పాటు చేసి కుండీలలో వేయాల్సి ఉండగా, అలాగే పడేయడంతో అలంకారప్రాయంగా మిగిలాయి. బీర్‌పూర్‌ మండలంలో 15 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ ఇదే పరిస్థితి నెలకుంది.


నిర్వహణ మరిచారు

వెల్గటూరు: గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహించడంతో పాటు సేంద్రియ ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారుతున్నాయి. వెల్గటూరు మండలంలో 30 గ్రామాలకు గాను గ్రామగ్రామాన కంపోస్టు షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఊరికి దూరంగా ఉండటం, ట్రాక్టర్‌ వెళ్లేందుకు దారి సరిగా లేకపోవడం వల్ల నిర్వహణకు దూరంగా ఉంటున్నాయి. గ్రామంలో పోగైన చెత్తాచెదారాన్ని ఊరి బయట వేసి తగులబెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 


లక్ష్యానికి దూరంగా..

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలో 23 పంచాయతీల్లో కంపోస్ట్‌ షెడ్లు నిర్మించారు. కంపోస్ట్‌ షెడ్లలో కేవలం సేంద్రియ ఎరువు తయారీకే పరిమితం చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ నర్సరీల్లో మొక్కలకు వినియోగిస్తున్నారు. మూడ్నాలుగు పంచాయతీలు తప్ప మిగతావి ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ప్లాస్టిక్‌, గాజు సీసాలు, అట్టలు వేరే చేసి వాటి అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి. చాలా పంచాయతీల్లో పొడి వ్యర్థాలు కంపోస్ట్‌ షెడ్లకు తరలించకపోవడంతో అరలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కంపోస్ట్‌ షెడ్లు ఊరికి దూరంగా నిర్మించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని