మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం

ప్రజా సంగ్రామ యాత్రలో బండి విమర్శ


సభలో మాట్లాడుతున్న సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: న్యూస్‌టుడే, గంభీరావుపేట: రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి తనయుని నియోజకవర్గం సిరిసిల్లలో అభివృద్ధి అద్దంలా మెరుస్తుందని భావిస్తున్నారని.. ఇక్కడ ఉన్నంత అధ్వాన పరిస్థితి మరెక్కడా లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. ప్రజా సంగ్రామ పాద యాత్ర గురువారం కామారెడ్డి జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ప్రవేశించింది. నర్మాల క్యాంపు వద్దకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. జిల్లాలో తొలి రోజు లింగన్నపేట వరకు 13 కిలోమీటర్లు సాగింది. పాద యాత్ర చేస్తున్న దారిపొడవునా రైతులు, వృద్ధులు, కుల సంఘాలు వారు సమస్యలను ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ‘సిరిసిల్ల గడ్డ మాఫీయాకు అడ్డా’గా మారిందని విమర్శించారు. వాటిని అడ్డుకుంటున్న భాజపా కార్యకర్తలపై జిల్లా పోలీసులు అవలంబిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. తెరాస ప్రభుత్వం అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి గడీల పాలనకు చరమగీతం పాడుతామన్నారు. బడుగు బలహీన వర్గాలకు భాజపా అండగా నిలుస్తుందని అభయమిచ్చారు. ప్రశ్నించే వారిపై రాజద్రోహం కేసులు పెడతామంటున్నారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే తెరాస నాయకులకు బీపీ పెరిగి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెలిపారు.

భూములిప్పించాలని వినతి

నర్మాలలో పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన భూమిని తమకు తిరిగి ఇప్పించాలని లబ్ధిదారులు ఎంపీ బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. దారిలో పెద్దమ్మగుడి వద్ద కాసేపు సేదతీరారు. అక్కడి గ్రామపెద్దలతో మాట్లాడారు. గంభీరావుపేట శివారులో ముదిరాజ్‌లు, గంగపుత్ర సంఘ సభ్యులు స్వాగతం పలికారు. భోజనం తర్వాత మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు పార్టీలో చేరారు. అనంతరం గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు పాదయాత్రగా వెళ్లారు.


కార్యక్రమానికి హాజరైన జనం

కార్యకర్తలకు అండగా ఉంటాం

మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? ఇంకా నిజాం పాలనలో ఉన్నామో తెలియడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ భాజపా కార్యకర్తలపై కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేయడం సరైంది కాదని తెలిపారు. అక్టోబరులో సిరిసిల్ల అంబేడ్కర్‌ కూడలిలో నియోజకర్గంలోని దళితులతో దళితబంధుపై నిరసన కార్యక్రమం ఉందన్నారు. దమ్ముంటే తనపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుని సవాల్‌ విసిరారు. 2023లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాకు మైకు ఇస్తే రాష్ట్రంలో జరుగుతున్న భూ, ఇసుక, మద్యం మాఫీయాలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనని ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజ్‌సింగ్‌ మాట్లాడుతూ తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు డ్రగ్స్‌ కేసులో వైట్‌ ఛాలెంజ్‌ పేరుతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శోభ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను విమర్శించే నైతిక హక్కు బాల్క సుమన్‌కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంగ్రామ యాత్ర జిల్లా కన్వీనర్‌ కటకం శ్రీధర్‌ పంతులు, రెడ్డవేణ గోపి, మల్లికార్జున్‌, బర్కం లక్ష్మి, వెంకటేశ్‌, కృష్ణ, కృష్ణకాంత్‌, శ్రావణ్‌యాదవ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని