విమర్శల దండయాత్ర
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

విమర్శల దండయాత్ర


సిందగి ప్రచార సభలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : రాష్ట్ర రాజకీయాల్లో ఆరోపణల పర్వం రోజు రోజుకీ పదునెక్కుతోంది. విధాన పరమైన విమర్శలను దాటి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నేతలు జాతీయ స్థాయిలో చర్చకు తావిస్తున్నారు. మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసుకున్న పరస్పర ఆరోపణలు పార్టీల అధిష్ఠానాలనూ ఆలోచనలో పడేస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య వాగ్వాదాలు తీవ్రరూపం దాల్చాయి.

ప్రధానిని విమర్శించిన కాంగ్రెస్‌కు బదులిచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఏకంగా రాహుల్‌గాంధీని మాదక ద్రవ్యాల బానిసగా ఆరోపించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆపై ఊరుకోని ఆయన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కనుమరుగై భాజపా స్వతంత్రంగా సర్కారు ఏర్పాటు చేస్తుందన్నారు. రాహుల్‌గాంధీపై నళిన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు విరుచుపడ్డారు. నళిన్‌ కుమార్‌ కటీల్‌ మానసిక రోగిగా అభివర్ణించిన విపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు.. ఆయనను నిమ్హాన్స్‌లో చేర్పించాలని ఏద్దేవా చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పై నిప్పులు

ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరితే సంఘ్‌ చేసే పనులేమిటో తెలుస్తాయని తనకు సలహా ఇచ్చిన నళిన్‌ కుమార్‌పై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చే శిక్షణ ఏమిటో ఆ పార్టీ నేతలు శాసనసభలో ప్రవర్తించిన తీరుతోనే తెలుస్తుందన్నారు. 2012లో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు విధానసభలోనే నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారని కుమారస్వామి గుర్తు చేశారు. వీరి నుంచి నేను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు.

ఉప ఎన్నికల ప్రచారం కోసం నేతల ఆయా క్షేత్రాల్లో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి, యడియూరప్ప బుధవారం సిందగి క్షేత్రంలో ప్రచారం చేయనున్నారు. మంగళవారం కలబురగి విమానాశ్రయంలో దిగిన ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ.. సిద్ధరామయ్య తనపై చేసిన వ్యాఖ్యలను స్పందించాల్సిన పని లేదన్నారు. బొమ్మై సిందగిలో ప్రచారం సాగించారు. భాజపా 10శాతం కమిషన్‌ను ప్రారంభిస్తే కాంగ్రెస్‌ ఆ ప్రమాణాన్ని 20 శాతానికి పెంచినట్లు ఆ పార్టీ వర్గాలే బహిరంగపరచినట్లు గుర్తు చేశారు. బుధవారం మూడు పార్టీల కీలక నేతలు సిందగిలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసే సమయంలో ఎలాంటి మాటలు సంధిస్తారో వేచిచూడాలి.

కాంగ్రెస్‌కే పట్టం: సిద్ధు

విజయపుర, న్యూస్‌టుడే : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పవనాలు వీస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన సిందగిలో కాంగ్రెస్‌ ఎస్సీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సిద్ధు తమ ప్రసంగంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఆయన ఎప్పుడైనా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ సంస్థపై ఎందుకంత ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయని ఎద్దేవా చేశారు. గతంలో ఈ ముఖ్యమంత్రి జనతాదళ్‌లో కొనసాగిన విషయాన్ని విస్మరించారా అని నిలదీశారు. భాజపాలోకి ఇటీవల వెళ్లిన వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ధ్వజమెత్తారు. తానొక కుటుంబం చెప్పుచేతల్లో ఉన్నానంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. తాను సర్వస్వతంత్రుడినని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని