నల్లబజారులో ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల విక్రయం
logo
Published : 18/06/2021 02:58 IST

నల్లబజారులో ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల విక్రయం

రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మంది అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘బ్లాక్‌ ఫంగ స్‌’ చికిత్సలో ఉపయోగించే ‘ఆంఫోటెరిసిన్‌-బి’ ఇంజెక్షన్లు సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన తొమ్మిది మందిని హైదరాబాద్‌ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 వాయిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేశ్‌లతో కలిసి నగర సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. రెండు ముఠాలు ఇంజక్షన్లను దొడ్డిదారిన సేకరించి, అధిక మొత్తానికి అమ్ముతున్నారని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేలకు విక్రయిస్తుండగా మాటు వేసిన పోలీసులు తొమ్మిది మందిని పట్టుకున్నారు. కర్నూల్‌, అనంతపురం, కడప, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలకు చెంది నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ వివిధ వృత్తులో ఉన్న జి.శ్రీకాంత్‌(39), కె.శశికుమార్‌(33), బి.వెంకట సురేశ్‌(33), ఆర్‌.నిరంజన్‌(36), మహ్మద్‌ అలీముద్ధీన్‌(38)లను ఎస్‌ఆర్‌నగర్‌ ఠాణా పరిధిలో అరెస్టు చేశారు. అలాగే మరో ముఠాలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన బాలస్వామి(31), బి.రంజిత్‌(39), ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్‌లలో నివసించే మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌(33), బి.అన్వేష్‌కుమార్‌రెడ్డి(33)లను బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో అరెస్టు చేశారు. మరో నిందితుడు వినోద్‌ పరారీలో ఉన్నాడని కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అభినందన... ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, అలాగే బ్లాక్‌ ఫంగస్‌కు ఉపయోగించే సూది మందులను బ్లాక్‌ చేస్తూ.., అధిక ధరలకు అమ్ముతున్న ముఠాల ఆటకట్టిస్తున్నందుకు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఫోన్‌ చేసి అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని