రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 15/09/2021 04:58 IST

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం


చప్పిడి ప్రసాద్‌

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తమ స్థలాన్ని వేరే వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హుజూర్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మాధవరాయినిగూడేనికి చెందిన చప్పిడి దుర్గయ్య ఇంటి పక్కన అనువంశికంగా వచ్చిన ఖాళీ స్థలం ఉంది. ఈ భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రసాద్‌ తనకు సంబంధించిందని .. వివాదంలో ఉందని ఎవరికీ రిజిస్ట్రేషన్‌ చేయొద్దని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా.. దానిని ఈ నెల తొమ్మిదో తేదీన వారి బంధువులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చెయ్యొద్దని తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని కార్యాలయ అధికారులను ప్రసాద్‌ ప్రశ్నించారు. కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తనకు అన్యాయం జరిగిందని వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి భర్త చప్పిడి ప్రసాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. తాను కూడా తాగేందుకు ప్రయత్నించగా సిబ్బంది ఆపారని భార్య సావిత్రి తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సబ్‌ రిజిస్టార్‌ పి.నగేశ్‌ను వివరణ కోరగా కొన్ని రోజుల క్రితం వచ్చి ఆ స్థలం తమకు చెందిందని చెప్పారన్నారు. కోర్టు నుంచి స్టే తెస్తే నిలుపుదల చేస్తామని చెప్పానన్నారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారమే చేశామన్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని