70 శాతం సిలబస్‌లోనే ప్రశ్నలు
eenadu telugu news
Updated : 24/10/2021 05:30 IST

70 శాతం సిలబస్‌లోనే ప్రశ్నలు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి

‘ఈనాడు’తో ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌సలాం

ప్రణాళికతోనే సత్ఫలితాలు సాధ్యమని ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌సలాం పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఆయనతో ఫోన్‌ఇన్‌ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు ఫోన్‌ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పరీక్షల విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

- ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

థియరీలో 50 శాతం ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ విధానం ఎలా ఉండబోతోంది ?

- స్రవంతి, సింధూజ(కామారెడ్డి)

* థియరీ పరీక్షల్లో 50 శాతం ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. అధిక మార్కులున్న ప్రశ్నలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సరళ ప్రశ్నలకు ఐచ్ఛికాలు ఉండవు. విద్యార్థులు అన్ని అంశాలను పకడ్బందీగా చదవాలి.

థియరీలో 4, 8 మార్కుల ప్రశ్నలకు ఐచ్ఛికాలు ఇవ్వనున్నారా..? భౌతికశాస్త్రంలో గతంలో తొలగించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారా ?

- వీరాచారి(చిన్నమల్లారెడ్డి), ప్రదీప్‌కుమార్‌(కామారెడ్డి)

* మొత్తం ప్రశ్నపత్రంలో 50 శాతం ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. అన్నింటికి ఇది వర్తిస్తుంది. భౌతికశాస్త్రంలో గతంలో తొలగించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు రావు.

పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తారా. కేంద్రాలకు వెళ్లడానికి వీలుగా ఏమైనా సూచికలు ఏర్పాటు చేస్తారా..?

- వినోద్‌(కామారెడ్డి), మాధురి(రాజంపేట), శివ(భిక్కనూరు), సాయి(మాచారెడ్డి)

* పరీక్షలకు వెళ్లడానికి వీలుగా అన్ని గ్రామాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశాం. ఈసారి పరీక్షలకు వెళ్లేందుకు వీలుగా కేంద్రాల చిరునామాలు బస్టాండ్లలో అందుబాటులో ఉంచుతాం. ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం.

ప్రథమ సంవత్సరంలో ఆన్‌లైన్‌ తరగతులు విన్నాం. అవి సరిగా అర్థం కాలేదు. ప్రస్తుతం రెండో ఏడాది ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నాం. ప్రథమ సంవత్సర పరీక్షలెలా రాసేది..?

- రవి(కామారెడ్డి), అక్షయ్‌(దేవునిపల్లి), నవీన్‌(బాన్సువాడ)

* మళ్లీ ఏవైనా ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రస్తుతం నిర్వహించే పరీక్షల ఫలితాలు పరిగణనలోకి తీసుకుంటాం. అందుకే కొవిడ్‌ కేసులు తగ్గాక నిర్వహిస్తున్నాం. ప్రతిఒక్కరు పరీక్షలు రాయాలి. పాఠ్యాంశాల్లో ఏ సందేహం ఉన్నా అధ్యాపకుల వద్ద నివృత్తి చేసుకోవాలి. వాట్సప్‌ ఆధారంగా అప్పటికప్పుడు సమస్యలు తెలపాలి.

అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయా..?

- వినయ్‌(నాగిరెడ్డిపేట్‌), ఎండీ ఫైజల్‌(కామారెడ్డి), హరి(గాంధారి), చక్రపాణి(దోమకొండ), రమ్య(ఘన్‌పూర్‌), శ్రీలాల్‌(పోచారం)

* ఈసారి పాఠ్య ప్రణాళికను 30శాతం కుదించారు. మిగతా 70శాతం నుంచే ప్రశ్నలు వస్తాయి.

ఇన్విజిలేటర్లు పరీక్ష సమయం ముగియడానికి 10 నిమిషాల ముందే జవాబుపత్రాలు తీసేసుకుంటున్నారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.

-చంద్రకాంత్‌(కామారెడ్డి), రాము(బీబీపేట)

* పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులకు పూర్తి సమయమివ్వాలి. ఇన్విజిలేటర్లు నిబంధనలు పాటించాలి. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత కళాశాలలపై చర్యలు చేపడతాం.

మా బాబు బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. రుసుం చెల్లించకపోవడంతో హాల్‌టికెట్‌ ఇవ్వడం లేదు. పరీక్షలు ఎలా రాయాలి ?

- సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌, బాన్సువాడ

* కళాశాలతో సంబంధం లేకుండా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరవ్వచ్ఛు

జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. బోధకులు లేని చోట చదువులెలా సాగించాలి. పరీక్షల్లో ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి ?

- బాలు(విద్యార్థి సంఘం నేత), కామారెడ్డి, గణేష్‌(తాడ్వాయి), రాజు(భిక్కనూరు)

* ఖాళీలున్న చోట ఒప్పంద అధ్యాపకులను నియమించాం. పాఠ్యాంశాల బోధనకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్తున్నాం. అతిథి అధ్యాపకుల నియామకాలకు త్వరలోనే చర్యలు చేపడతాం. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయడంపై దృష్టి పెట్టాలి.

మొత్తం విద్యార్థులు 10,032

సాధారణ 8,891

వొకేషనల్‌ 1,141

పరీక్షా కేంద్రాలు 42


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని