3 పల్లెలు.. 3 వలయాలు
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

3 పల్లెలు.. 3 వలయాలు

ఎన్‌హెచ్‌-63తో బోధన్‌-సాలూర రోడ్డు అనుసంధానం

న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం

బోధన్‌-సాలూర రోడ్డును జాతీయ రహదారి-63కు అనుసంధానించే ప్రక్రియ మొదలైంది. విస్తరణకు భూసేకరణ ప్రక్రియే కీలకం కానుంది. ఇది కొలిక్కి వస్తే మధ్యలో ఉన్న మూడు పల్లెలకు బాహ్య వలయ రహదారులు నిర్మితమవుతాయి. దీంతో ప్రస్తుత మూలమలుపులు తొలగి ప్రయాణం ప్రమాదరహితంగా మారనుంది. దీనికితోడు మంజీర, హరిద్ర నదులపై విశాలమైన వంతెనలు అందుబాటులోకి వస్తాయి.

ఈ ప్రక్రియలో భూసేకరణకు బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఒకసారి సర్వేకు వెళ్లిన సిబ్బందికి రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తమను భూతల్లికి దూరం చేసి ‘రోడ్డు’ మీదకు తేవొద్దని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు కర్షకులతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలని.. లేదంటే పోలీసు బందోబస్తుతో సర్వే చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ నేపథ్యం....

కేంద్రం మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘భారత్‌ మాల’ పేరుతో అన్ని రాష్ట్రాల్లో ప్రధాన రహదారులను అనుసంధానిస్తోంది. అందులో మహారాష్ట్రలోని నర్సి - జగదల్‌పూర్‌ ఎన్‌హెచ్‌-63 ఒకటి. ఇప్పటికే కంఠేశ్వర్‌ నుంచి ఇది అందుబాటులో ఉంది. దీనికి సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారిని కలుపుతారు. మద్నూర్‌-పొతంగల్‌-బోధన్‌-నిజామాబాద్‌ వరకు ఈ మార్గం ఉండనుంది. ఇప్పటికే నాందేడ్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రోడ్డు సాలూర-బోధన్‌ మీదుగా సాగుతోంది. దీన్ని ఎన్‌హెచ్‌-63కు అనుసంధానిస్తే మరిన్ని పట్టణాలు, నగరాలకు రవాణా సదుపాయం సులభతరం కానుంది. ఇందుకోసమే సాలూర-బోధన్‌ మధ్య జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు.

వంతెనకు నిధులు..

మంజీరపై ఎస్గీ వద్ద (మనకు సాలూర) నాలుగు వరుసల పైవంతెనకు కేంద్ర రవాణా శాఖ రూ.180 కోట్లు మంజూరు చేసింది. ఈ వంతెన ముగిసే చోటు నుంచి బోధన్‌ వరకు రోడ్డును 10 మీటర్లకు విస్తరించడం, జనావాసాలు ఉండే పల్లెల్లో బైపాస్‌ వేస్తారు. ఇందుకు రూ.60 కోట్ల నిధులు కేటాయించారు.


రైతుల్లో ఆందోళన

నిజాంసాగర్‌ కాలువ.. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమ పొలం రోడ్డు కోసం ఇస్తే జీవనోపాధి కోల్పోతామన్నది రైతుల వాదన. పరిహారం విషయంలోనూ ఇతర ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. ఇలాంటి సందేహాలెన్నో వారి మదిని తొలుస్తుంటే.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సర్వే చేపడుతుండటంతో అడ్డు తగిలారు. రోడ్డు నిర్మాణానికి కావల్సిన స్థలం, ఎందరి నుంచి సేకరించాల్సి ఉంటుందనే విషయాలు సర్వే చేస్తేగాని అంచనాకు రాలేమని అధికారులు పేర్కొంటున్నారు. సర్కారు నిర్దేశించిన మేరకే పరిహారం లభిస్తుందని వెల్లడిస్తున్నారు.

భూసేకరణే కీలకం

సాలూర-బోధన్‌ మధ్య 8.380 కి.మీ. మేర రోడ్డు వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఏడు మీటర్ల వెడల్పును 10 మీటర్లకు విస్తరిస్తే భూసేకరణ అంతగా అవసరముండదు. కానీ, ఇప్పుడున్న మార్గంలో ఏడు మూల మలుపులున్నాయి. వీటిని తొలగించాల్సి ఉంటుంది. వీటికితోడు సాలూర, సాలూరక్యాంపు, నాగన్‌పల్లి ప్రాంతాల్లో 4.5 కి.మీ. మేర బైపాస్‌ నిర్మించాలి. ఇందుకోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. రైతులకు ముందస్తు అవగాహన కల్పించకుండా సర్వేకు వెళ్లడంతో వివాదం నెలకొంది.

ఇలా చేస్తేనే ప్రయోజనం

బోధన్‌-హైదరాబాద్‌ మధ్య దూరం గతంలో ఎంత ఉందో ఇప్పుడూ అంతే. ప్రయాణ సమయం మాత్రం 5 గంటల నుంచి 3-4 గంటలకు తగ్గింది. అందుకు కారణం ఎన్‌హెచ్‌-44. జాతీయ రహదారులతో ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. పైగా సరకు రవాణాకు మార్గం సుగమమవుతుంది. ఎన్‌హెచ్‌ పక్కన భూములకు ధరలు పెరుగుతాయి. వాహనాల రద్దీ పెరిగితే వ్యాపారం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇలాంటి సానుకూలతలను రైతులకు వివరించి అడుగు ముందుకేయాలి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని