ఫలితాలకు వేళాయె..!
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

ఫలితాలకు వేళాయె..!

నేడే పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఓటరు దేవుడు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. గెలిచి పీఠాలెక్కేదెవరో తేలిపోనుంది.. అనేక ఉఠ్కంఠ పరిణామాల మధ్య ఆగుతూ... ఎట్టకేలకు ఫలితాల వరకూ వచ్చింది. గురువారం తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం లెక్కింపు నిర్వహణకు అన్ని చర్యలు వేగవంతంగా తీసుకుంది. జిల్లా నుంచి మండల స్థాయి వరకూ సిబ్బంది సమాయత్తం చేసి పటిష్ట ఏర్పాట్లు చేసింది.

పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా మొత్తం పదిచోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 627 టేబుళ్లపై మండలాల వారీగా బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి రెండురోజుల పాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉదయం పది గంటల నుంచే ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడనున్నాయి. 2020 మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ఈ ఏడాది గత ఏప్రిల్‌ 8న నిర్వహించారు. జట్పీటీసీ స్థానాలకు 37 చోట్ల, 590 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఫలితాల వెల్లడికి కోర్టు తీర్పు అడ్డంకి కావడంతో ఇంతకాలం అభ్యర్థులు వేచి చూడాల్సి వచ్చింది. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు అధికారులు భద్రతను పటిష్ఠం చేశారు. 144 సెక్షన్‌ విధించారు. ఎక్కడా ఐదుగురు మించి గుమిగూడకూడదని షరతులు విధించారు. హైకోర్టు తీర్పు రావడం, లెక్కింపు గడువు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులంతా తమ ఏజెంట్లను వెతుక్కునేందుకు ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి వరకూ కొంతమందికి ఏజెంట్‌ పాసులు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది.

పాలకొండలో విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న సీఐ శంకరరావు

లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది : 4,349

పోలీసు సిబ్బంది: 863


విజయంపై ధీమా..

ప్రక్రియ సజావుగా నిర్వహించడం లేదనే కారణంతో అప్పట్లో తెదేపా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది. పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదు. చాలాచోట్ల అభ్యర్థులను పోటీలోకి దింపలేదు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడక్కడ అభ్యర్థులు బరిలోకి దిగారు. పెద్దగా పోటీతత్వం కనిపించలేదు. అయినా పోటీ ఉన్నచోట తమ గెలుపు తథ్యమని తెదేపా అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు ఏకపక్షంగానే తమకే ఉంటాయని వైకాపా పేర్కొంటోంది. అన్ని స్థానాలూ కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క ఎంపీపీ పీఠం ఎవరిదనే విషయంపైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఒకవేళ ఎక్కడైనా స్థానాలు పోటాపోటీగా వస్తే గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


వీడని జడ్పీ పీఠముడి..!

డ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానానికి కేబినెట్‌ హోదాకు సమానంగా ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పీఠాన్ని ఈసారి ప్రభుత్వం మహిళలకే రిజర్వు చేసింది. దీంతో ముఖ్యనేతల కుటుంబ సభ్యులైన మహిళలు రంగంలో నిలిచారు. రాష్ట్రంలో చాలాచోట్ల జీడ్పీ పీఠం ఎవరికనేది వైకాపా అధిష్ఠానం తేల్చేసింది. కానీ జిల్లాలో మాత్రం ఇంకా నిర్ణయం తేలలేదు. గెలిచిన వారిలో ఎవరికి వరిస్తుందనేది ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పదవికి తొలుత హేమామాలిని రెడ్డి పేరు ప్రచారంలో ఉండేది. అయితే ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్‌ పదవుల్లో ఆమెకు ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. నియోజవర్గాల వారీగా చూస్తే ఇచ్ఛాపురంలో వైకాపా తరఫున చెప్పుకోదగిన ప్రజాప్రతినిధులు లేరు. మొన్నటి వరకూ టెక్కలిలోనూ ఇదే పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అక్కడ లోటు భర్తీ అయినట్లయింది. మరోవైపు పాలవలస రాజశేఖరం కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు బరిలో నిలిచారు. రాజశేఖరరెడ్డి హయాంలో రాజశేఖరం జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు విక్రాంత్‌ మొన్నటివరకూ డీసీసీబీ ఛైర్మన్‌గా చేశారు. మరోసారి జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశతో ఇద్దరు కుటుంబ సభ్యులను బరిలో నిలిపారు. ఈనేపథ్యంలో అధిష్ఠానం ఎవరి పేరు సూచిస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ జిల్లా నాయకుల్లో నెలకొంది. ఛైర్‌పర్సన్‌ పేరును పార్టీ అధిష్ఠానమే ప్రకటిస్తుందని, తమ ప్రమేయం ఏమీ ఉండదని స్థానిక నేతలు పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని