గుర్తింపు వస్తే లాభాలెన్నో..!
eenadu telugu news
Published : 28/09/2021 04:47 IST

గుర్తింపు వస్తే లాభాలెన్నో..!

నేడు బీఆర్‌ఏయూకు నాక్‌ బృందం

మూడురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం నుంచి మూడురోజుల పాటు నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌) బృందం సందర్శించనుంది. అన్ని విద్యాసంస్థలకు నాక్‌ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని 2020లో యూజీసీ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఏడాదిన్నర కిందట ఇందుకోసం దరఖాస్తు చేసుకుంది. అనంతరం విద్యావిధానం, ప్రగతి, పరిశోధన, మౌలిక వసతులకు సంబంధించి వివరాలు పంపించింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు అయిదుగురు నిపుణుల బృందం మంగళవారం రానుంది.

తొలిరోజు పర్యటన ఇలా.. నాక్‌ బృందానికి తొలిరోజు ఉప కులపతి సెల్ఫ్‌ స్టడీ రిపోర్టును పూర్తిస్థాయిలో వివరిస్తారు. తర్వాత వివిధ విభాగాల బీవోఎస్‌ సభ్యులు, డీన్‌లు, విభాగాధిపతులతో పాలక మండలి సభ్యులు, ఐక్యూఏసీ సమన్వయకర్తలు, అనంతరం పలు విభాగాధిపతులు, ఆచార్యులు, బోధనా సిబ్బంది, పరీక్ష విభాగం ఇన్‌ఛార్జిలతో సమావేశమవుతారు. సాయంత్రం విద్యార్థులు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు.

ప్రయోజనాలివీ.. నాక్‌ గుర్తింపు లభిస్తే వర్సిటీకి రూ.20 కోట్ల రూసా నిధులు విడుదలవుతాయి. అలానే దూర విద్యాకోర్సులు నిర్వహణకు అర్హత లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టులను నేరుగా నిధులు పొందేందుకు, బోధనాభివృద్ధి కార్యక్రమాలు, పునశ్చరణ తరగతులకు నిధుల సహకారం, ప్రాజెక్టులు పొందేందుకు, యూజీసీ ద్వారా స్వల్పకాలిక కోర్సులు నిర్వహించేందుకు అవకాశం వస్తుంది. వర్సిటీ జారీ చేసిన డిగ్రీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది.

అంతా సిద్ధం..

ఉప కులపతి నిమ్మ వెంకటరావు ఆధ్వర్యంలో గత కొద్దిరోజుల నుంచి వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణంతో పాటు అన్ని విభాగాల పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం ఉండేలా చూశారు. ఆయా విభాగాలు తమ కోర్సుల్లో సాధించిన ప్రగతి, పరిశోధన అంశాలు, చేపట్టిన సామాజిక అనుసంధాన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్‌ రూపంలో ఉంచి బృంద సభ్యుల ముందు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు వర్సిటీ ఏర్పడ్డాక క్రీడా విభాగంలో కల్పించిన సౌకర్యాలు, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సాధించిన పతకాలు, నిర్వహించిన పోటీల వంటి వివరాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇటీవల నిర్వహించిన ఏపీ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణ, జాతీయ స్థాయిలో పచ్చదనంలో సాధించిన అవార్డులు, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలు, యోగా విభాగం నిర్వహించే కార్యక్రమాలను సైతం సిద్ధం చేశారు.


మెరుగైన గ్రేడు సాధిస్తాం... ఇప్పటికే 700 మార్కులకు సెల్ఫ్‌స్టడీ నివేదిక పంపించాం. మిగిలిన 300 మార్కులకు సంబంధించి నాక్‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందజేయనుంది. ఈ రెండింట్లోనూ మంచి మార్కులు సాధించి మెరుగైన గ్రేడు పొందుతాం. విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయి.

- నిమ్మ వెంకటరావు, ఉప కులపతి, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని