దృష్టి సారిద్దాం... లోపం అధిగమిద్దాం!
eenadu telugu news
Updated : 14/10/2021 12:40 IST

దృష్టి సారిద్దాం... లోపం అధిగమిద్దాం!

చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు

జ్ఞానేంద్రియాల్లో కంటికి ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. కంటి చూపును కోల్పోతే జీవితం అంధకారమే! చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ దృష్టిలోపం బారిన పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్‌ తరగతులు గంటల కొద్దీ కొనసాగటంతో పిల్లల్లో కంటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు దృష్టి దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.  

- రాజాం, గుజరాతీపేట(శ్రీకాకుళం)

జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. వేలాది మంది విద్యార్థులు వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా పాఠశాలల విద్యార్థులకు, 60 ఏళ్లు, ఆపైబడిన వృద్ధులకు దృష్టి సమస్య నివారణకు నిర్వహించిన ‘సమగ్ర కంటి పరీక్షలు’ కార్యక్రమంలో రుగ్మతలు వెలుగు చూశాయి. కంటి వెలుగులో భాగంగా ‘చిన్నారి చూపు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా 3.27 శాతం మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. వీరందరికీ కంటి అద్దాలు అందజేశారు. 14 మందికి కంటి శుక్లాలు, మరో 10 మందికి మెల్లకన్ను శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.

ఆహారపు అలవాట్లు కీలకం..

బలవర్థక ఆహారం తీసుకోక పోవటం కంటి సమస్యలను పెంచుతోంది. ప్రధానంగా ఆకుకూరలు నిత్యం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. బీన్స్‌, పాలు, నట్స్‌, క్యారెట్‌, గుడ్లు వంటివి విద్యార్థులకు ఇవ్వాలి. నారింజ సహా సిట్రస్‌ అధికంగా పండ్లు, రసాలు తాగించాలి. చేపలు మంచివే. ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో విద్యార్థులు చరవాణిలు వినియోగించటం అనివార్యమవుతోంది. ఇలాంటి వారు కళ్లసమస్యల బారిన పడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లతో సమస్యలు...

స్మార్ట్‌ ఫోన్‌ను గంటల తరబడి చూస్తూ కూర్చుంటే డ్రై ఐ, ఎర్రబారడం, కళ్లలో మంట, చూపు మందగించటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీ గ్రేర్‌, యాంటీ రిఫ్లెక్టివ్‌ అద్దాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఎక్కువ సమయం కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లను చూసే వారు వీటిని వినియోగిస్తే రక్షణ ఉంటుంది. అధిక కాంతి కళ్లపై పడకుండా మధ్యలో ఈ కళ్లద్దాలు నిలువరిస్తాయి. చాలా మందికి కళ్లు మంటలు వస్తున్నా ఇంకా స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. చూపు పోయేందుకూ ఆస్కారం ఏర్పడుతుంది.

ఇలా చేయాలి...

* టీవీని అతి దగ్గరగా చూడకూడదు

* తగిన వెలుతురులోనే చదవాలి

* విటమిన్‌ ఎ లోపం లేకుండా జాగ్రత్త పడాలి

* పౌష్టికాహార లోపాలు తలెత్తకుండా చూసుకోవాలి

* పిల్లలకు చిన్నప్పటి నుంచి సరైన ఆహారాన్ని ఇవ్వాలి

* దుమ్మూధూళి బారిన పడకుండా చూసుకోవటం, కలుషిత గాలిలో తిరగకుండా ఉండటం కీలకం

* మొబైల్‌ ఫోన్‌ నుంచి వచ్చే కాంతి కూడా కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

మొత్తం మండలాలు : 38 కంటి పరీక్షలు

నిర్వహించిన పాఠశాలలు : 3,831

చేయించుకున్న విద్యార్థులు : 3,69,371

కళ్లద్దాలు అవసరం ఉన్నవారు : 12,089

జాగ్రత్తలు తీసుకోవాలి... 

వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమంతో జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు పూర్తి చేశాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేశాం. విద్యార్థులు, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు మంటలు పుట్టడం, నీరు కారడం జరిగితే..కాసేపు విరామం ఇవ్వాలి. చల్లటి నీటితో కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే సమయంలో కాసేపు కళ్లపై తడిగుడ్డ ఉంచుకుంటే మంచిది. పిల్లల్లో కంటి సంబంధిత సమస్యల్ని తల్లిదండ్రులు ముందుగానే గుర్తిస్తే మేలు జరుగుతుంది. బలవర్ధకమైన ఆహారం అందించాలి.

- డా.జీవీ రమణకుమార్‌, ప్రొగ్రాం మేనేజర్‌, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శ్రీకాకుళం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని