టీకోత్సాహం..!
eenadu telugu news
Updated : 24/10/2021 06:11 IST

టీకోత్సాహం..!

తొలిదశలో వైద్యఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, అత్యవసర వర్గాలకు టీకా వేశారు. వారిలో మొదటి డోసు 2,85,471 మంది, రెండో డోసు 88,252 మంది వేయించుకున్నారు.

మహమ్మారిని మట్టుబెట్టేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఓ యజ్ఞంలా సాగుతోంది.. ఊరూరా, వాడవాడలా అర్హులందరికీ వేసేలా చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఈనెల 20వ తేదీ నాటికి వందకోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో సిక్కోలు జిల్లాలోనూ ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రజల వద్దకే టీకా అనే నినాదంతో జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ టీకా వేస్తున్నారు. శతకోటి మార్కుదాటిన నేపథ్యంలో సిక్కోలు జిల్లాలో ఎంతమందికి ఇప్పటివరకూ వేశారు. ఏ విధంగా సాగుతోంది తదితర వివరాలతో కథనం

 - ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

శ్రీకాకుళం నగరంలో టీకా వేస్తున్న సిబ్బంది

ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం టీకా ప్రక్రియ ప్రారంభించింది. తొలుత కొవిడ్‌ సేవలందిస్తున్న ఫ్రంట్లైన్‌ వారియర్స్‌కు మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. తర్వాత 60 ఏళ్లు పైన, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ఇచ్చారు. ఈ సమయంలో టీకా పనితీరుపై ఎన్నో అనుమానాలు ప్రజలను వెంటాడాయి. సామాజిక మాధ్యమాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏదో అయిపోతుందనే అసత్య ప్రచారాలు మిన్నంటాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రచారం కల్పించి, ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించి టీకా ప్రక్రియను పరుగులు పెట్టించారు.

తొమ్మిది నెలల్లోనే...

టీకా వేయడం ప్రారంభించి ఇప్పటికి తొమ్మిది నెలలు గడుస్తోంది. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారు దాదాపు 20 లక్షలు ఉన్నారని గ్రామ, వార్డు వాలంటీర్లతో చేయించిన సర్వేల ద్వారా అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 16 లక్షల మందికి తొలిడోసు పూర్తయింది. అంటే దాదాపు 80 శాతం మంది మొదటి డోసు టీకా వేయించుకున్నారు. వీరిలో 8 లక్షల మందికి రెండో డోసు వేశారు. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోనివారు ఇంకా దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు.  మరో రెండు నెలల్లో వారందరికీ మొదటిడోసు టీకా వేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రజల వద్దకే వెళ్లి...

ప్రారంభంలో ఎంపిక చేసిన కేంద్రాల్లోనే టీకా వేసేవారు. క్రమంగా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోనూ ఈ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దీనిలో రెవెన్యూ అధికారులనూ బాధ్యులను చేశారు. ప్రతి మండలంలోనూ ఏరోజుకారోజు పంపించిన టీకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీని ఫలితమే ఇప్పుడు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

గిరిజనుల్లో అపోహ తొలగించి..

ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు తొలుత వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ సిబ్బంది తమ గ్రామానికి వచ్చినా ఎవరూ వేసుకునేవారు కాదు. వారిలో అపోహలు పేరుకుపోయాయని గ్రహించిన ఐటీడీఏ అధికారులు అంతటా ప్రచారం చేశారు. ఒక్కో అధికారిని ఒక్కో గ్రామానికి పంపించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు చిన్నచిన్న గిరిజన పల్లెల్లోనూ టీకా ప్రక్రియ శతశాతం దిశగా పరుగులు పెడుతోంది.

కొరతను అధిగమించి ...

ఫ్రంట్లైన్‌ వారియర్స్‌, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు పూర్తయిన తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు అందరికీ అవకాశం కల్పిస్తూ వచ్చారు. వారందరికీ దాదాపు ఒక డోసు అయిన తర్వాత 45 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చారు. ఇదే ఎక్కువ కాలం కొనసాగింది. మధ్యలో కొన్ని సందర్భాల్లో టీకా కొరత వేధించింది. ఎక్కడా దొరకని పరిస్థితి తలెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కొరతను అధిగమించగలిగారు.  

రెండో డోసుకు ముందుకు రావాలి

మొదటి డోసు తీసుకున్నవారిలో చాలా మంది రెండో దానికి ముందుకు రావడం లేదు. ఎక్కడా టీకా కొరత లేదు. గడువు ముగిసినా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నాం. వ్యాక్సిన్‌తో ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. ప్రజలంతా అపోహలకు పోకుండా ముందుకొచ్చి టీకా తీసుకోవాలి. తర్వాత కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవాలి. - బగాది జగన్నాథరావు, కొవిడ్‌ నోడల్‌ అధికారి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని