పరిహారం ఇవ్వకుండా ఆలయాల తొలగింపు అన్యాయం
eenadu telugu news
Published : 26/10/2021 04:27 IST

పరిహారం ఇవ్వకుండా ఆలయాల తొలగింపు అన్యాయం

పాతపట్నం: రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా దేవాలయానికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించకుండా తొలగించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. పరిహారం 2020 అక్టోబరు మాసంలో చెల్లించడం జరిగిందని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సోమవారం పాతపట్నం తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ను మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తితో పాటు పలువురు తెదేపా నాయకులు కలిశారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ గతేడాది ప్రభుత్వ ఖాతా నుంచి ఎల్‌.ఎ.ఒ. ఖాతా (వంశధార ఎస్‌.డి.సి.) ఖాతాకు పంపించారని, లబ్ధిదారుల ఎంపిక జరిగిన వెంటనే లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులు చేపట్టడం జరుగుతుందన్నారు. నీలమణిదుర్గ అమ్మవారి ఆలయానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి జరిగిన నష్టాలను అంచనాలు వేయడం జరిగిందని త్వరలో వారి ఖాతాలకు పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.

ఆర్డీవో పరిశీలన: పాతపట్నంలో శ్రీనీలమణిదుర్గ అమ్మవారి ఆలయాన్ని సోమవారం పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్‌.జి.కుమార్‌ పరిశీలించారు. ఇటీవల ఆలయ ప్రాంతం తొలగించిన నేపథ్యంలో ఆయా పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ పరిసరాలు పరిశీలించారు.

పునర్నిర్మించాలి: కొత్తూరు: పాతపట్నంలో కూల్చిన దేవాలయాన్ని తక్షణం పునర్‌నిర్మించాలని హిందూధర్మ పరిరక్షణ సమితి సభ్యులు పెద్దిన కులశేఖర్‌ ఆళ్వార్‌, పొగిరి రవిలు డిమాండు చేశారు. పాతపట్నంలో దేవాలయాన్ని కూల్చినందుకు నిరసనగా స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి వెంకటేశ్వర ఆలయం వరకూ సోమవారం సాయంత్రం ర్యాలీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల కూల్చివేత మానుకోకుంటే బుద్ధి చెబుతామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని