మాకు ప్రశ్నించే హక్కు లేదా
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

మాకు ప్రశ్నించే హక్కు లేదా

‘రైతు కోసం తెలుగుదేశం’లో అయ్యన్నపాత్రుడు

ప్రసంగిస్తున్న అయ్యన్నపాత్రుడు, పక్కన అనిత

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ‘మీకు ఓట్లు అడిగే హక్కుంది గానీ, ప్రశ్నించే హక్కు మాకు లేదా’ అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. అన్నదాతల సమస్యలపై జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట ఆందోళనలు నిర్వహించారు. నర్సీపట్నంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో అయ్యన్న ప్రసంగిస్తూ.. ‘పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ధరల స్థిరీకరణకు రూ. 4 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టును 72 శాతం మేం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశాం. మిగతా 28 శాతం పనులను వైకాపా ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రెండు పంటలకు నీరందేది. వ్యవసాయంలో ఓనమాలు తెలియని వ్యక్తికి ఆ శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. సుజల స్రవంతి ప్రాజెక్టు రూ. 2400 కోట్లతో మంజూరు చేశాం. దాన్ని రీటెండరు అంటూ ఆపేశారు. ఈ ప్రాజెక్టు వస్తే 1.25 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని’ అయ్యన్న పేర్కొన్నారు. ‘రైతు సమస్యలపై ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లాలో అన్నిచోట్లా పోలీసుల దౌర్జన్యమేంటి? ఆ వ్యవస్థ దిగజారిపోయింది. జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటిపై దాడి చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో నిన్ననే ప్రకటించారు. డీజీపీ అదే ప్రాంతంలో ఉన్నారు. ఎందుకు బందోబస్తు పెట్టలేదు. చంద్రబాబు నివాసంపై దాడి చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారని’ ప్రశ్నించారు. ‘మంత్రి కొడాలి నాని నోటికొచ్చినట్లు చంద్రబాబును తిట్టారు. ఆ రికార్డులు డీజీపీ దగ్గర లేవా? ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మమ్మల్ని గంజాయి డాన్‌ అంటున్నారు. గంజాయి వ్యాపారం చేసేదీ, ఇసుక దోపిడీ చేసేదీ, పేదల భూములు లాక్కునేదీ మీ వాళ్లే. పార్టీ పట్ల విశ్వసనీయత ఉండబట్టే తెదేపాలో ఉన్నాం. మీలా పార్టీలు మారలేదని’ అయ్యన్న దుయ్యబట్టారు.  
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మంత్రి పదవి కోసం సీఎం వద్ద మార్కులు కొట్టేయ్యడానికే జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని విమర్శించారు. జడ్పీటీసీ పూర్వ సభ్యుడు కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీ రమణమ్మ, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అబ్బారావు ప్రసంగించారు. సమావేశం అనంతరం చింతకాయల రాజేష్‌ ఆధ్వరంలో పలువురు ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరగా.. సీఐ స్వామినాయుడు అడ్డుకున్నారు. ఆర్డీఓ వద్దకు కొంతమంది వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. దీంతో రాజేష్‌, పలువురు నాయకులు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.


అనకాపల్లిలో అడ్డగింత

ప్రదర్శనగా వస్తున్న తెదేపా కార్యకర్తలు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో శుక్రవారం ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావులు ప్రధాన రహదారిలో ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందివ్వాలని భావించారు. ఈమేరకు ప్రదర్శనగా వస్తున్న వారిని నెహ్రూచౌక్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వీరంతా అక్కడే బైఠాయించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలని, బెల్లం రైతులను ఆదుకోవాలని, చెరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. చెరకు గెడలు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. పట్టణ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసులు పీలా, బుద్దతో సహా తెలుగురైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి, కశింకోట మండల పార్టీ అధ్యక్షులు కాయల మురళి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు బీఎస్‌ఎంôకే జోగినాయుడుతో సహా పలువురిని ఆరెస్టు చేసి వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా తెదేపా నాయకులు, పోలీసులకు మధ్య మరో సారి వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పీలా, బుద్ద మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఆందోళనలు ఆపలేరన్నారు. వైద్య కళాశాల పేరుతో 50 ఎకరాల భూమిని స్వాహా చేయడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించారని పేర్కొన్నారు. కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లి, పార్టీ నాయకులు సబ్బవరపు గణేష్‌, నడిపల్లి గణేష్‌, కొణతాల రత్నకుమారి, కొణతాల శ్రీనివాసరావు, వేగి వెంకటరావు, పచ్చకూరి రాము, మళ్ల గణేష్‌ పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం మండలం డి.అగ్రహారం నుంచి మండల కేంద్రం వరకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి చినరాజప్పతో కలిసి ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.
మునగపాకలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెదేపా నాయకులతో కలిపి భారీ ప్రదర్శన నిర్వహించారు. తెదేపా నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని తరవాత విడిచిపెట్టారు.
చోడవరం, మాడుగులలో మాజీ ఎమ్మెల్యేలు కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు ఈ ప్రదర్శనలను అడ్డగించడంతో వారితో వాగ్వాదానికి దిగారు.
అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, పాడేరులో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరిలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని