ఈ రోజే... పదవీయోగం!
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

ఈ రోజే... పదవీయోగం!

నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడి

అనకాపల్లి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థు.ల భవిత్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం 8గంటల నుంచి జిల్లాలోని 39 మండల కేంద్రాల్లో 80 హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలో 612 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 1,793 మంది పోటీ పడ్డారు. 39 జడ్పీటీసీ స్థానాలకు రోలుగుంట స్థానం ఏకగ్రీవమైంది. ఆనందపురం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. 37 జడ్పీటీసీ స్థానాలకు 172 మంది పోటీ పడ్డారు.

* ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, జేసీలు అరుణ్‌బాబు, వేణుగోపాల్‌రెడ్డిలతో పాటు పాడేరు ఐటీడీఏ పీఓ, ఆర్డీఓలు శనివారం జిల్లాలో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. 1,282 మంది పర్యవేక్షకులు, 3,573 మంది సహాయకులు వెరసి 4,855 మందిని ఓట్ల లెక్కింపునకు నియమించారు.

* మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, సాయంత్రానికి మొత్తం ప్రక్రియ పూర్తి కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. ● ప్రాదేశిక ఎన్నికల్లో పురుషులు 5,76,725, మహిళలు 5,96,872, ఇతరులు నలుగురు చొప్పున 11,73,601 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు

మద్యం దుకాణాలు బంద్‌: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు, క్యాంటీన్లలో దుకాణాలు, పర్యాటకశాఖ బార్లు మూసివేస్తున్నట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* ప్రాదేశిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జడ్పీ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగం, ఎన్నికల నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాల సరళి తెలుసుకొని ఎస్‌ఈసీ కార్యాలయానికి నివేదించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు 0891-2555529, 0981-2555527 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశామని జడ్పీ సీఈఓ వి.నాగార్జునసాగర్‌ తెలిపారు.

కొవిడ్‌ లేనివారితోనే లెక్కింపు: ప్రాదేశిక ఎన్నికల ఓట్లు లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టరు మల్లికార్జున స్పష్టం చేశారు. అనకాపల్లి, అచ్యుతాపురం, మునగపాకల్లో లెక్కింపు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని