సేవలు అంతంతే..
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

సేవలు అంతంతే..

న్యూస్‌టుడే, పార్వతీపురం/గ్రామీణం, పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం గ్రామీణం

పాచిపెంట, గుమ్మలక్ష్మీపురంలో నిరుపయోగంగా టెలీమెడిసిన్‌ పరికరాలు

గిరిజన ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు వీలుగా ప్రారంభించిన టెలీమెడిసిన్‌ కార్యక్రమం లక్ష్యానికి దూరంగా సాగుతోంది. ఉప ప్రణాళిక ప్రాంతంలో 40 కేంద్రాల్లో వీటిని ప్రారంభించగా, చాలా చోట్ల మందుల అరలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైద్యుల సిఫార్సులు గానీ, మందులు గానీ కానరాని దుస్థితి. ఆరోగ్య కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి తీసుకొచ్చిన మందులతోనే మమ అనిపించేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..: l పాచిపెంటలోని మూడు ఉపకేంద్రాల పరిధిలో వీటిని ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరగా టెలీమెడిసిన్‌, ఏటీఎం పనిచేయడం లేదు. పీహెచ్‌సీల నుంచి తీసుకొచ్చిన మందులే ఇస్తున్నారు. అవి కూడా పూర్తిస్థాయిలో లేవు. గౌరమ్మపేటలో మాత్రమే కొంత మేరకు సేవలు అందిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. l కొమరాడ మండలం కోటిపాం, చినకేర్జిలలోని కేంద్రాలు సక్రమంగా పనిచేయడంలేదు. మందులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. l పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి, నర్సిపురం కేంద్రాల్లో ప్రజలు టెలీమెడిసిన్‌ను కొంతమేర వినియోగించుకుంటున్నారు. ఎమ్మార్‌నగర్‌లో పరాయిపంచన నిర్వహిస్తున్నారు. l గుమ్మలక్ష్మీపురం మండలంలో మూడుచోట్ల ప్రారంభించగా రెండుచోట్ల సేవలు మరుగున పడ్డాయి. l కురుపాం మండలం జరడ, ఆవిరి ఉపకేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.

పునరుద్ధరించే అవకాశం: టెలీమెడిసిన్‌ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెండుమూడు సంస్థలు పని చేస్తున్నాయి. ప్రస్తుతం వీటి పనితీరుపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేదు. దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. త్వరలోనే సేవలు పునరుద్ధరించే అవకాశం ఉంది.

- రవికుమార్‌, కార్యాలయ ప్రబంధకుడు, వైద్య విభాగం.

ఎలా పనిచేస్తుంది?: టెలీమెడిసిన్‌ విధానంలో సబ్‌సెంటరుకు వచ్చిన రోగులకు సంబంధించిన వివరాలు, వారి రుగ్మతలను అక్కడ పనిచేసే ఆరోగ్య సిబ్బంది రిజిస్టరులో నమోదు చేస్తారు. వాటిని ప్రత్యేక వైద్యులకు పంపించి, రోగులతో మాట్లాడిస్తారు. వారు రోగాన్ని నిర్ధారించి, ఏ మందులు వాడాలో సిఫార్సు చేసి అందజేస్తారు. టెలీమెడిసిన్‌ డెస్క్‌లో 32 రకాల మందులు అందుబాటులో ఉంచి, కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందేలా రూపొందించారు. దీని కోసం ప్రత్యేక ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పార్వతీపురం ఉప ప్రణాళిక ప్రాంతంలో ఏర్పాటైన 40 కేంద్రాల్లో ఈ సేవలు అంతంత మాత్రమే సాగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని