close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రంలోనే అద్వితీయం

● ఓటెత్తిన జనం.. రికార్డు ఆదర్శం

● స్ఫూర్తి చాటిన వనితా ఓటర్లు

యువతకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పిస్తున్న

జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ (పాత చిత్రం)

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. విజయం సాధించేందుకు అభ్యర్థులు ఎవరికివారు పెద్దఎత్తున ప్రచారం చేశారు. పలు వ్యూహాలను రూపొందించుకున్నారు. మరోవైపు జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. కొత్త ఓటర్లను నమోదు చేయించేందుకు అవగాహన సదస్సులు పెట్టారు. అన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరును వివరించారు. ఫలితంగా రాష్ట్రంలోనే పోలింగ్‌ శాతం పెరుగుదలలో రెండో స్థానం సాధించి ఆదర్శంగా నిలిచింది.- న్యూస్‌టుడే,

జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరిగాయి. జనం సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించినా.. ఏమాత్రం నిరాశ చెందకుండా రాత్రి వరకు క్యూలైన్లలో నిల్చున్నారు. ఇలా ఓటు హక్కును వినియోగించుకోవడంలో జిల్లా ప్రజలు ఆదర్శంగా నిలిచారు. పోలింగ్‌ పెరుగుదలలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో జిల్లా నిలవడం విశేషం. ఈ ఎన్నికల్లో 31,72,413 మంది మొత్తం ఓటర్లకుగాను 24,65,903 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని 77.73 శాతం సాధించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 3.87 శాతం పెరుగుదలతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం విశేషం.

మహిళామణులు.. స్ఫూర్తిప్రదాతలు

మహిళా ఓటర్లు ప్రజాస్వామ్య పండగలో పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. ఓటింగ్‌ నమోదులో 4.41 శాతం పెంచి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడం విశేషం. 2014 ఎన్నికల్లో 72.76 శాతం ఓటింగ్‌ నమోదు కాగా ప్రస్తుత ఎన్నికల్లో 77.17 శాతం ఓటింగ్‌ నమోదు చేసి 4.41 శాతం పెరుగుదలతో ముందంజలో నిలిచారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మహిళా ఓటింగ్‌ పెరిగిన మొదటి 10 నియోజకవర్గాల్లో ఆరు శాసనసభ నియోజకవర్గాలు మన జిల్లాకు చెందినవే కావడం విశేషం. రాష్ట్రస్థాయిలో నందికొట్కూరు 8.92 శాతంతో రెండో స్థానం, మంత్రాలయం 8.28 శాతంతో మూడు, ఆళ్లగడ్డ 6.63 శాతంతో ఆరు, కోడుమూరు 6.58 శాతంతో ఏడు, డోన్‌ 5.97 శాతంతో ఎనిమిది, పత్తికొండలో 5.92 శాతం పెరుగుదలతో 9వ స్థానంలో నిలిచాయి.

చైతన్యవంతులయ్యారు

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరిగి పలు రికార్డులు సాధించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సత్యనారయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమం కీలకంగా మారింది. దీని ద్వారా ప్రజలకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో మెప్మా పీడీ నాగరాజనాయుడు స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారిగా, యాగంటీశ్వరప్పను కలెక్టర్‌ నియమించారు. వారి ఆదేశాలు, సూచనలతో ఓటరు క్రమబద్ధమైన అవగాహన, ఎన్నికల ప్రక్రియలో ఓటరు భాగస్వామ్యం(స్వీప్‌) పేరుతో జిల్లా అంతటా విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. 18 ఏళ్ల వయస్సున్న యువతను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ ఓటింగ్‌లో పాల్గొనాలంటూ చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు, ప్రజలతో సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, కళాజాత బృందాలతో 53 మండలాలలో ఆట, పాట రూపంలో అవగాహన కల్పించారు. ర్యాలీలు, 2కె రన్‌, జిల్లా అంతటా ఫ్లెక్సీలు, పోస్టర్లతో ప్రచారం, లఘు చిత్రాలు, సినిమా, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

2 లక్షల మందికిపైగా కొత్త ఓటర్లు

అర్హులైనవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ పిలుపునివ్వడంతో జనవరి నుంచి మార్చి 25వ తేదీ మధ్యకాలంలో 2,81,529 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 99.442 మంది యువ ఓటర్లు ఉండడం విశేషం. జిల్లాలో 9.34 శాతం కొత్త ఓటర్ల పెరుగుదల కనిపించింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను వినియోగించి ఓటు వేయడంపై అన్ని ప్రాంతాల్లో అవగాహన పెంచడంతో జిల్లాలో 77.23 శాతం ఓటింగ్‌ నమోదైంది. జిల్లాలో 14 నియోజకవర్గాలల్లో ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో 2014లో 78.3 శాతం ఓటింగ్‌ జరుగగా ప్రస్తుతం 2019 ఎన్నికల్లో 86.98 శాతంతో ముందంజలో నిలిచింది. అత్యల్పంగా ఆదోని నియోజకవర్గంలో 0.03 శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. ఇలా జిల్లా పలు రికార్డులను సాధించి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.