close

బుధవారం, జూన్ 19, 2019

ప్రధానాంశాలు

గట్టి బందోబస్తు

900 మంది పోలీసులతో విధులు
ఐదు చోట్ల చెక్‌పోస్టులు
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ, డిచ్‌పల్లి

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పోలీసులు గట్టి బందోబస్తు చేపడుతున్నారు. డిచ్‌పల్లిలోని సీఎంసీ కేంద్రం వద్ద 23న ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం భారీస్థాయిలో సిబ్బందిని బందోబస్తులో ఉంచటంతో పాటు అన్ని ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద ఇప్పటికే మూడంచెల భద్రత ఉండగా.. పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేందుకు రెండ్రోజుల సమయం పడుతుందని తొలుత అధికారులు వెల్లడించారు. అయితే 36 టేబుళ్ల ఏర్పాటుకై ఈసీ అనుమతివ్వటంతో తక్కువ సమయంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు మాత్రం 23తోపాటు 24వ తేదీనాడు కూడా భద్రత చర్యలు చేపట్టనున్నారు. పగలు, రాత్రుళ్లు సిబ్బందికి విధులు కేటాయించి ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా జరిగేలా చూడనున్నారు.

ప్రత్యేకంగా పికెట్లు
లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాలతో పాటు కమిషనరేట్‌లోని సమస్యాత్మక చోట్ల పికెట్ల ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకొంటున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

గట్టి నిఘా..
లెక్కింపు కేంద్రానికి చుట్టూర ఆంక్షలు అమలు చేసి ప్రైవేటు వ్యక్తులెవరూ రాకుండా గట్టి నిఘా ఉంచారు. సీఎంసీని ఆనుకొని ఉన్న ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో కేవలం పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతించేలా పక్కా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.

సంబరాలపై ఆంక్షలు
గెలుపు అనంతరం జరిపే సంబరాలపై ఆంక్షలు విధించారు. అనుమతిలేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడాన్ని నిషేధించారు.

ఐదు చోట్ల చెక్‌ పోస్టులు
నడ్‌పల్లిలో సీఎంసీ ఎక్స్‌ రోడ్డు వద్ద, డిచ్‌పల్లి స్టేషన్‌ మార్కెట్‌ రోడ్డు, దేవుపల్లి గాంధీ విగ్రహం వద్ద, సుద్దపల్లి కంచెట్టి దాబా, దేవునగర్‌ వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. నడ్‌పల్లిలోని సీఎంసీ ఎక్స్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో ఓట్ల లెక్కింపు కోసం వెళ్తున్న అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు, మీడియా వారి గుర్తింపు కార్డులు చూసి పంపిస్తారు. నడ్‌పల్లి, డిచ్‌పల్లి స్టేషన్‌ మార్కెట్‌ రోడ్డు మీదుగా వచ్చిపోయే వాహనాలను పోలీసులు నియంత్రిస్తారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే లోనికి పంపిస్తారు. మిగతా ప్రయాణికుల్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించరు. గురువారం పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నారు. జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ వైపు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు తెలంగాణ విశ్వవిద్యాలయ పక్కన ఉన్న మామిడి తోట బాగ్‌ ఆనుకుని ఎడమ వైపు ఉన్న రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నిజామాబాద్‌ నుంచి జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ వైపు వెళ్లే వాహనదారులు డిచ్‌పల్లిలోని కృష్ణప్రియ దాబా పక్కన ఉన్న రోడ్డు మీదుగా జాతీయ రహదారి ఎక్కాల్సి ఉంటుంది.

మూడు చోట్ల వాహనాల పార్కింగ్‌
ఓట్ల లెక్కింపు రోజు సీఎంసీ కేంద్రానికి వచ్చే వాహనాల కోసం డిచ్‌పల్లిలో మూడు చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. దేవుపల్లిలోని జీబీ వైన్సు పక్కన, ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌(డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల) వాహనాలు నిలపాలి. దేవునగర్‌ పక్కన నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌(నిజామాబాద్‌, మోపాల్‌ మండలాల) వాహనాలు. అలాగే లెక్కింపు చేపట్టే సీఎంసీ భవనం ఆవరణలో ప్రత్యేక అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా వారి వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు.

వైన్సులు బంద్‌
గురువారం సీఎంసీలో ఓట్ల లెక్కింపు ఉన్నందున డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, జక్రాన్‌పల్లిలోని వైన్సులు బందు నిర్వహించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకోనుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా వైన్సులు మూసివేస్తున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది.

సుమారు 900 మందితో భద్రత
గురువారం ఓట్ల లెక్కింపు రోజున సీపీ కార్తికేయ పర్యవేక్షణలో సుమారు 900 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రెండు షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.