close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

ప్రధానాంశాలు

‘జీపీఎస్‌’ దొంగలు.. కొట్టేస్తారు కార్లు

నాడు అమ్మేసిన వాహనాల తస్కరణ
నేడు అద్దెకు తీసుకెళ్లి అపహరణ
సైబరాబాద్‌లో ఘరానా  ముఠాల లీలలు

ఫైనాన్స్‌లో తీసుకున్న కారుకు సంబంధించి వాయిదాలు బకాయి పడ్డారంటూ పట్టుకెళతారు.. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనే డీలర్‌కు ఆ కారును విక్రయిస్తారు.. అంతకుముందే ఆ వాహనంలో జీపీఎస్‌ పరికరాన్ని అమర్చుతారు.. కొద్ది రోజులకే ఆ కారు కదలికలను గుర్తించి దొంగతనం చేస్తారు.. అనంతరం సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మేస్తారు.

- ఇది గతంలో వెలుగు చూసిన మోసం.

అద్దెకు కావాలంటూ కారును తీసుకెళ్తారు.. వెళ్లేటప్పుడు డబ్బును డిపాజిట్‌గా ఉంచుతారు. ఆధార్‌ నకలు ప్రతిని సమర్పిస్తారు.. కానీ అది నకిలీదే.. ఆ తర్వాత కారును పట్టుకెళ్లి ఇక తిరిగిరారు. గుర్తించకుండా ఉండేందుకు దానికి ఉన్న జీపీఎస్‌ పరికరాన్ని తొలగిస్తారు.. వాహనం ఆకృతిని మార్చేసి అమ్మేస్తారు.

- ఇది తాజాగా దొంగలు  అనుసరించిన వ్యూహం.

దొంగలు ఖరీదైన కార్లనే ఎంచుకుంటున్నారు. విక్రయిస్తే కనీసం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా గిట్టుబాటు అవుతుందన్నది వారి నమ్మకం. కార్లను అద్దెకిచ్చే ఏజెన్సీలను కొల్లగొట్టే ముఠా హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెల్లడైంది.

ఈనాడు, హైదరాబాద్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఈ రెండు కేసుల్లోనూ దొంగలు అనుసరించిన వ్యూహాలు ఆయా కార్ల జీపీఎస్‌ పరికరాలను తొలగించడం. కార్లను కొట్టేసి వాటి నామఫలకాల్ని మార్చి అమ్మేందుకు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పుణెకు చెందిన ఉద్యోగి నిదీష్‌ వినాయక్‌ కళంకార్‌(38) ముఠా బాగోతాన్ని రాయదుర్గం పోలీసులు ఆ మధ్య రట్టుచేశారు. బోగస్‌ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అద్దెకు తీసుకెళ్లి అమ్మేసే ఈ ముఠా నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొన్నారు. అద్దెకు తీసుకునే సమయంలో ముందస్తు డిపాజిట్‌, చెక్కు, ఆధార్‌ నకలు ప్రతి సమర్పించే నిబంధన ఉండటంతో డబ్బు అసలుది ఇచ్చేవారు. చెక్కు, ఆధార్‌ ప్రతి బోగస్‌వే.
మోసం ఇలా.. మాదాపూర్‌ నవభారత్‌నగర్‌కు చెందిన మహేందర్‌సింగ్‌ అనే సెకండ్‌ హ్యాండ్‌ కార్ల డీలర్‌కు మహ్మద్‌ ఇబ్రహీంఖాన్‌ అనే వ్యక్తి రెండు కార్లను విక్రయించాడు. ఒక్కోదానికి రూ.2లక్షల చొప్పున తీసుకున్న ఇబ్రహీంఖాన్‌.. తర్వాత కారు పత్రాల్ని ఇస్తానంటూ కనిపించకుండా పోయాడు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల తర్వాత ఆ రెండు కార్లు అపహరణకు గురయ్యాయి. అసాధారణంగా కనిపించిన ఈ కేసు దర్యాప్తు బాధ్యతను మాదాపూర్‌ ఎస్‌ఓటీ బృందం చేపట్టింది. ఇబ్రహీంఖాన్‌ను పట్టుకొని విచారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. గోల్కొండ కోట ప్రాంతంలోని చోటా బజార్‌కు చెందిన మహ్మద్‌ ఆజమ్‌(32), ఆసిఫ్‌నగర్‌ న్యూమల్లేపల్లికి చెందిన మహ్మద్‌ ఇబ్రహీంఖాన్‌(22) కార్ల క్రయవిక్రయాల వ్యాపారంతోపాటు ఫైనాన్స్‌ల్లో వాయిదాలు చెల్లించని కార్లను సీజ్‌ చేసే ఏజెంట్లుగా పనిచేసేవారు. వీరిద్దరు మైనా, నరేశ్‌ ఫైనాన్స్‌ సంస్థలను సంప్రదించి ఈఎంఐ బకాయిలున్న కార్ల వివరాలు ఇవ్వాలని కోరారు. అనంతరం బకాయిదారుల వద్దకెళ్లి బకాయిల్ని క్లియర్‌ చేసేందుకు సహకరిస్తామంటూ నమ్మించారు.  పలువురు బకాయిదారులు కార్లను వీరికి అప్పగించారు. వాటిని విక్రయించిన అనంతరం మిగిలిన డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చి పది కార్లను బకాయిదారుల నుంచి తీసుకున్నారు. వాటిని సెకండ్‌హ్యాండ్‌ వాహనాలను కొనే డీలర్లకు విక్రయించేవారు. అప్పుడే విక్రయ ధరలో 75శాతం వరకు తీసుకునేవారు. కొద్దిరోజుల తర్వాత పత్రాల్ని ఇచ్చి మిగిలిన డబ్బు తీసుకుంటామని చెప్పేవారు. ఇక్కడే ఈ ముఠా సరికొత్త పంథాలో మోసాలకు తెర తీసింది. డీలర్లకు ఇచ్చేటప్పుడే కార్లలో జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాల్ని అమర్చేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ పరికరం ఆధారంగా వాహనం ఎక్కడుందో కనిపెట్టేవారు. ఎలాగూ తమ వద్ద నకిలీ తాళం ఉంటుంది కాబట్టి ఆ కారును దొంగిలించి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి మరోసారి అమ్మేసేవారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.