close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

నగరం నలుమూలలా గోదావరి నీరు!

3000 ఎంఎం డయా మీటరుతో భారీ పైపులైన్‌
అవుటర్‌లో మరో 23 కి.మీ. మేర రింగ్‌మెయిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరమంతా గోదావరి జలాలు అందించడానికి జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రధాన నగరంలో పలు ప్రాంతాలకు ఇప్పటికీ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నీళ్లే దిక్కు. కొన్ని ప్రాంతాలకు కృష్ణా నీటిని అందిస్తున్నారు. జంట జలాశయాలు ఇంకిపోవడంతోపాటు సాగర్‌లో నీటి మట్టాలు తగ్గిన ప్రతిసారీ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు కృష్ణా ఒక్కటే కాకుండా గోదావరి జలాలనూ మళ్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

గోదావరి నీరు అంతటా ఇవ్వడానికి అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెంట మరో 23 కిలోమీటర్ల మేర రింగ్‌మెయిన్‌ నిర్మించాలి. ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తొలుత ఘన్‌పూర్‌ నుంచి వెలిమల వరకు 7.5 కిలోమీటర్ల మేర రింగ్‌మెయిన్‌ నిర్మించాలనేది యోచన. దీనివల్ల ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని పలు కీలక ప్రాంతాలకు పుష్కలంగా గోదావరి నీళ్లు అందనున్నాయి. నల్లగండ్ల, వట్టినాగులపల్లి, తెల్లాపూర్‌, గోపన్నపల్లి, ఇంద్రానగర్‌, ఉస్మాన్‌నగర్‌ తదితర ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు లింగంపల్లి రిజర్వాయర్‌ నుంచి రివర్స్‌ పంపింగ్‌లో నీటిని అందిస్తున్నారు. దీంతో సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. ఆయా ప్రాంతాల వరకు రింగ్‌మెయిన్‌ నిర్మించడం వల్ల గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు. నగరం చుట్టూ 158 కిలో మీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరించింది. ఈ రహదారి చుట్టూ భారీ పైపులైన్లు(రింగ్‌మెయిన్లు) నిర్మించడం వల్ల నగరానికి ఏ వైపు నుంచైనా నీటిని సరఫరా చేసే వీలుంటుంది. ప్రత్యేక ప్రాజెక్టుకు జలమండలి ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పటికే ఘన్‌పూర్‌ నుంచి పటాన్‌చెరువు వరకు 45 కిలోమీటర్ల మేర 1800ఎంఎం డయా సామర్థ్యంతో భారీ పైపులు వేశారు. తద్వారా నిత్యం 40 మిలియన్‌ గ్యాలన్లు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఘన్‌పూర్‌ నుంచి రాజేంద్రనగర్‌ వైపు మరో కొంత రింగ్‌మెయిన్‌ నిర్మించడం వల్ల ప్రధాన నగరంలోని చాలా ప్రాంతాలకు గోదావరి నీటిని సరఫరా చేయాలనేది ప్రణాళిక.

అన్ని వైపులా సరఫరా అయ్యేలా...
ప్రస్తుతం గోదావరి నీటిని 200 కిలోమీటర్ల నుంచి తరలిస్తున్నారు. ఘన్‌పూర్‌ వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి రెండు భారీ లైన్ల ద్వారా నగరానికి అందిస్తున్నారు. పైపులైన్లు అనుసంధానించక ఈ నీరు కేవలం కొన్ని ప్రాంతాలకే సరఫరా అవుతోంది. అవుటర్‌ చుట్టూ రింగ్‌మెయిన్‌ వేయడం వల్ల అన్ని ప్రాంతాలకు నీటిని తరలించొచ్చు. భవిష్యత్తులో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ అందుబాటులోకి రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చి ఈ రిజర్వాయర్‌లో నింపుతారు. అక్కడ నుంచి నగరానికి రోజుకు మరో 172 ఎంజీడీలు(ఏటా 10 టీఎంసీలు) తరలించడానికి వీలుంది. రింగ్‌మెయిన్‌తో నగరంలో ఎటైనా జలాలు తరలించవచ్చు. అప్పుడు నాగార్జునసాగర్‌లో నీటి మట్టం తగ్గినా ఇబ్బంది ఉండదు. రాజేంద్రనగర్‌ వరకు కొత్తగా రింగ్‌మెయిన్‌ నిర్మించనుండటం వల్ల అత్తాపూర్‌, షేక్‌పేట, ఆసిఫ్‌నగర్‌, జహానుమా వరకు గోదావరి నీళ్లు అందించవచ్చు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.