close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

శిక్షణ ప్రేరణ 

మహిళా వర్సిటీలో నూతన విద్యార్థినులకు శిక్షణ

 జీవన నైపుణ్యాల పెంపునకు కృషి ●

 

 

తమ డ్రాయింగ్‌లను చూపుతూ కేరింతలు కొడుతున్న విద్యార్థినులు..

 

ఆధునిక సమాజంలో కాలంతో పరుగులు తీస్తూ, ప్రకృతిని శాసించే స్థాయిలో సాంకేతికంగా పురోగతి సాధించాం. ఎన్నో అవకాశాలు, వసతులు, సౌకర్యవంతమైన జీవన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఒత్తిడితో కూడిన చదువులు, ఉద్యోగాలు, ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనలు, విలాసవంతమైన జీవన విధానాలతో సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ సెంటర్ల అవసరాలు పెరుగుతున్నాయి. ఒత్తిడితో కూడిన విద్యావిధానం, క్రమశిక్షణ కొరవడటం, విచక్షణలేమి.. ఇవన్నీ కలిసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారు చేస్తున్నాయి. చిన్నపాటి సమస్యను కూడా తనకు తానుగా పరిష్కరించుకోలేని స్థితిలో నేడు విద్యార్థిలోకం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వర్సిటీలో చేరే విద్యార్థినులకు చదువు కంటే ముందు జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు.

- న్యూస్‌టుడే, తిరుపతి(మహిళా వర్సిటీ)

నూతనంగా పీజీతోపాటు పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందిన మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఈ నెల 17నుంచి 20వరకు జీవన నైపుణ్యాలపై శిక్షణ నిర్వహించారు. వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మొదటి సంవత్సరం విద్యార్థినులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థినులు ఎక్కువ సమయం కళాశాలలోనే గడుపుతారు. వీరికి జీవన నైపుణ్యాలు బోధిస్తే చెడు ఆలోచనలు తొలిగి మంచి ఆలోచనలు వారి మెదడులో మెలుగుతాయి. తద్వారా వారి జీవితం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుందంటున్నారు.. నిపుణులు. పది రకాల జీవన నైపుణ్యాలను పాటించడం ద్వారా విద్యార్థినులు తమ భవిష్యత్తును ఉత్తమంగా మలుచుకోవచ్ఛు వీటిపై విద్యార్థినులకు నాలుగురోజులపాటు వర్సిటీ అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు. జీవన నైపుణ్యాలు ఇలా..

1. స్వీయ అవగాహన: స్వీయ అవగాహన ద్వారా మనలో మనకు నచ్చే, నచ్చని అంశాలు, బలాలు, బలహీనతలపై అవగాహన పెంచుకోవచ్ఛు మనలో మనకు నచ్చనివి, నచ్చేవి, ఇతరుల్లో మనకు నచ్చనివి, నచ్చేవి ఎలా మదింపు చేసుకోవాలో స్వీయ అవగాహన ద్వారా తెలుసుకోవచ్ఛు

2. కరుణ, సానుభూతి: ప్రతి విషయాన్ని ఎదుటివారి వైపు నుంచి ఆలోచించడం, వారిని అర్థం చేసుకోవడం, ఇతరుల పట్ల సానుభూతి చూపడం, వారి బాధను, కష్టాలను మనవిగా భావించి వారికి సహాయం చేయడం వంటివి ఇందులో నేర్పించారు.

3. నిర్ణయాలు తీసుకోవడం: ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చు తగ్గులు, గెలుపు ఓటములనేవి సర్వ సాధారణం. అలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది అత్యంత ప్రధానమైన నైపుణ్యం. ఎలాంటి క్లిష్టమైన సమయంలోనైనా సరైన నిర్ణయం తీసుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఎలా ఆలోచించాలి.. వచ్చిన ఆలోచనలనుంచి సరైన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో నేర్పించారు.

4. సమస్య పరిష్కారం: ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. సరైన సమయంలో పరిష్కారాన్ని ఆలోచించే విధానాన్ని నేర్పించారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే పద్ధతులను పలు రకాల ఉదాహరణలతో తెలిపారు.

5. క్లిష్టమైన ఆలోచన: సమస్య ఏదైనా ఆలోచన అనేది మంచిగా ఉండాలి. బాగా ఆలోచించినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలం. కొన్ని సమస్యలను చాలా సులువుగా ఆలోచించి పరిష్కరించుకోగలం. మరికొన్ని సమస్యలు జటిలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కొన్ని రకాల ఫజిల్స్‌ ద్వారా విద్యార్థినులకు వివరించారు.

6. సృజనాత్మక ఆలోచన: మనిషిలో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది. దానిని ఎలా బయటకు తీయాలో సృజనాత్మకత నైపుణ్యం అంశం ద్వారా విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. కొన్ని రకాల ఆటల ద్వారా విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేశారు.

7. మానవ సంబంధాలు: ఆధునిక యుగంలో నేటి యువత సెల్‌ఫోన్‌ వలయంలో చిక్కుకుంటోంది. దీనినుంచి బయట పడి స్నేహితులు, పక్కవారితో ఎలా మాట్లాడాలి.. మంచి మిత్రులుగా ఎలా మెలగాలి.. మానవ సంబంధాలను కొనసాగించే విధానాలను తెలియజేశారు.

8. సమర్థ సమాచారం: ఎన్నో రకాలుగా సమాచారాన్ని పొందడం, ఇతరులకు చేరవేయడం చేస్తుంటాం. మనం చెప్పాలనుకున్న విషయం ఇతరులకు అర్థమైందో.. లేదో మనం పట్టించుకోకపోవడం వల్ల సమర్థ సమాచారం జరగదు. ఇతరులకు సమచారాన్ని చేరవేసే సమయంలో ఎలాంటి అంశాలను గుర్తుంచుకోవాలో ఈ నైపుణ్యం ద్వారా తెలుసుకోవచ్ఛు

9. భావోద్వేగాల నియంత్రణ: కోపం, దుఃఖం, ఆనందం, అసూయ, ద్వేషం, ఇవన్నీ మానసిక ఉద్వేగాలు. వీటిపట్ల నియంత్రణ కలిగి ఉండటం, అన్ని రకాల ఉద్వేగాలను సమస్థాయిలో చూడగలగడం.

10. ఒత్తిడిని ఎదుర్కోవడం: చదివేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు ఒత్తిడికి గురవుతాం. ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవుతాం. అంతేకాకుండా ఒత్తిడి అధికమైనప్పుడు సహనాన్ని కోల్పోతాం. ఇలాంటి సమయంలో ఒత్తిడిని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో తెలుపుతారు.

నైపుణ్యాలతో ఉత్తమ జీవితం

ప్రస్తుతం విద్యార్థినులు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదైనా జరిగితే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. చిన్నప్పటినుంచి సున్నితంగా పెరగడం, ఆలోచనా ధోరణి లేకపోవడంతో ఇలా జరుగుతోంది. అందుకే వర్సిటీలో నూతనంగా చేరే మొదటి సంవత్సరం విద్యార్థినులకు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ఉమ సూచించారు. ఆమె సూచన మేరకు నాలుగురోజులపాటు వర్సిటీ అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాం.

- ఆచార్య సువర్ణలతాదేవి, అడ్మిషన్స్‌,డైరెక్టర్‌, మహిళా వర్సిటీ

ఆత్మ పరిశీలన అవసరం

 

నేటితరం యువతలో ఆత్మ పరిశీలన లోపించింది. ఎలాంటి లక్ష్యం లేని జీవితాన్ని గడిపేస్తున్నారు.ఇలా ఉంటే దేశ భవిష్యత్తు సమస్యల్లో పడే అవకాశం ఉంది. అందుకే యువత జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థినులకు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించాం.

- ఆచార్య సావిత్రి, విద్యార్థి వ్యవహరాల డీన్‌

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.