close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

చినుకు కునుకేసింది 

బీళ్లుగానే లక్షలాది ఎకరాలు 

 ప్రత్యామ్నాయ పంటలే దిక్కు

 నివేదికలు పంపిన వ్యవసాయశాఖ

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర దాటినా ఆశించినస్థాయిలో వర్షాలు పడలేదు. మరోవైపు గత నెలలో కురిసిన అరకొర వర్షాలకు విత్తనాలు విత్తుకున్న పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది జూన్‌, జులై నెలల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం జులై పూర్తవుతున్నా చినుకు జాడే కరవైంది. రైతులు పంటలపై ఆశలు వదిలేసుకున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, కర్నూలు పాతనగరం

జిల్లాలో సాధారణ సాగు 6,27,796 హెక్టార్లు కాగా ఇప్పటివరకు కేవలం 1,16,731 హెక్టార్లలో (19 శాతం) మాత్రమే పంటలు సాగయ్యాయి. పలు ప్రాంతాల్లో రైతులు పత్తి, వేరుసెనగ, కంది, వరి, మినుము, ఉల్లి తదితరాలు వేశారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొలకలు సైతం ఎండిపోతున్నాయి. వాస్తవంగా ఈ మాసానికి 2 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షాలకు విత్తనాలు వేసేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ సగానికిపైగా పూర్తవడంతో ఇక పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి, వేరుసెనగ సాగుకు సైతం అదును దాటిపోయిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

కన్నీళ్లే మిగిలాయి

వర్షాలు ఆరంభంలోనే అంతంతమాత్రంగా పడ్డాయి. విత్తనాలు విత్తుకునే సమయంలో ఆశించిన పరిస్థితి లేకపోయినా.. లోటు వర్షపాతం ఉన్నప్పటికీ అదును దాటుతుందన్న ఉద్దేశంతో పలువురు రైతులు విత్తనాలు వేశారు. అడపాదడపా వర్షాలు కురిస్తే మొక్కలు పెరుగుతాయని ఆశించినా వారికి నిరాశే ఎదురైంది. ఈ నెలలో 77 శాతం లోటు వర్షపాతం ఉండటం.. పంటలన్నీ ఎండిపోతుండటంతో అన్నదాతలకు కన్నీళ్లు ఆగడం లేదు. చివరికి చాలామంది ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.

ప్రత్యామ్నాయమే శరణ్యం

ఖరీఫ్‌ సీజన్‌ 50 రోజులు ముగియడంతో ప్రధానమైన పంటల సాగు కష్టంగా మారింది. ఇక వర్షాలు పడినా ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పంటలు కొంత వరకు బెట్టకు తట్టుకున్నా ఎర్ర నేలల్లో సాగైన పంటలు పూర్తిగా ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ నివేదించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.