close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

మత్తు వదిలిస్తున్న పోలీసులు

ఎప్పటికప్పుడు డ్రంకన్‌డ్రైవ్‌ స్థలాల మార్పు
కంట్రోల్‌ రూంలో మందుబాబుల జాబితా
ఈనాడు, హైదరాబాద్‌

వారాంతాల్లో విందులు..వినోదాల్లో పాల్గొంటూ..మోతాదుకు మించి మద్యంతాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను ట్రాఫిక్‌ పోలీసులు నీడలా వెంటాడుతున్నారు.. నగరం శివారు ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారిని ప్రత్యేకంగా చూసి మరీ పట్టుకుంటున్నారు. చిత్తుగా మద్యంతాగి ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తున్న వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాత్రివేళల్లో వాహనాలపై వెళ్తున్న మందుబాబులను పట్టుకుని తనిఖీలు చేస్తున్నారు. నెలకు సగటున 2300 కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు దొరక్కండా వేర్వేరు మార్గాల్లో ఇళ్లకు వెళ్లే వారిని గుర్తించేందుకు డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.

ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబులపై దృష్టి సారించడంతో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకూ 15,133 కేసులు నమోదు చేశారు. ఇందులో 1056 మంది జైలుకు వెళ్లారు. పదే పదే మద్యం తాగి పోలీసులకు దొరికిపోయిన 572 మంది వాహనచోదక అనుమతి పత్రాలు తాత్కాలికంగా రద్దయ్యాయి.

తప్పుచెబితే ముప్పే...
మోతాదుకు మించి మద్యం తాగి పట్టుబడిన ప్రతి ఒక్కరి వివరాలను ట్రాఫిక్‌ పోలీసులు కంప్యూటరీకరిస్తున్నారు. పదేపదే పట్టుబడేవారిని గుర్తించేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను స్కాన్‌ చేస్తున్నారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌రూంలోని డ్రంకన్‌ డ్రైవర్స్‌ జాబితాలో పొందుపరుస్తున్నారు. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారు పట్టుబడితే.. వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్‌లో నమోదు చేయగానే డ్రైవర్‌ అంతకుముందు ఎన్నిసార్లు పట్టుబడ్డారో తెరపై ప్రత్యక్షమవుతుంది. ఇంతేకాదు... డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారు వారి చిరునామా తప్పు చెప్పినా, వివరాలు అరకొరగా చెప్పినా డ్రైవింగ్‌ లెసెన్స్‌ ద్వారా తెలిసిపోతుంది. డ్రంకన్‌ డ్రైవ్‌లో వివాదాలు, విమర్శలు రాకూడదన్న భావనతో ఈ ట్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ట్యాబ్‌లో ఆధార్‌ కార్డునూ అనుసంధానం చేస్తున్నారు. రెండోసారి పట్టుబడిన వారిని గుర్తించి  జైలుశిక్ష పడేలా నివేదికలను రూపొందించి న్యాయస్థానాల్లో సమర్పిస్తున్నారు. 


 

ప్రమాదాలను నియంత్రించేందుకే..
- అనిల్‌ కుమార్‌, అదనపు సీపీ(ట్రాఫిక్‌)

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకే డ్రంకన్‌ డ్రైవ్‌పై దృష్టి కేంద్రీకరించాం. కొన్ని ప్రాంతాల్లో పగలు కూడా డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహస్తున్నాం. వారాంతాల్లో వందల సంఖ్యలో యువకులు మద్యంమత్తులో వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించాం. పట్టుబడిన వారి వాహనాలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పాటు కౌన్సెలింగ్‌కు వచ్చాకే వారిని వదిలేస్తున్నాం. డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడి ఒక్క రోజు జైలుకు వెళ్లినా... భవిష్యత్తులో వారికి పాస్‌పోర్టు, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సందర్భాల్లో ఈ కేసులు ప్రభావం చూపించనున్నాయి.


 

జైలంటే భయం లేదా!

మద్యంతాగి వాహనాలు నడిపితే పోలీసులు పట్టుకుంటారని తెలిసినా కొందరు పద్ధతి మార్చుకోవడంలేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిసినా మందుబాబులు చిత్తుగా మద్యంతాగి వాహనాలను నడుపుకొంటూ వెళ్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీస్‌ ఠాణాల పరిధుల్లోనే ఎక్కువమంది మందుబాబులు తాము నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్నారని వివరిస్తున్నారు. ఇక బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నప్పుడు యువతులు పట్టుబడుతున్నారని, కేసు నమోదుతో పాటు జైలుకు వెళ్తారన్న విషయాలు తెలీదా? అంటూ వారిని ప్రశ్నిస్తే.. మీ డ్యూటీ మీరు చేయండి అంటున్నారని వివరిస్తున్నారు. మరికొందరు యువకులు మద్యం తాగి వాహనాలు నడిపితే మజా వస్తుందంటూ విందు, వినోదాలు పూర్తయ్యాక ఇంటికి వెళ్లేప్పుడు మార్గమధ్యంలో ఆగి తాము తెచ్చుకున్న మద్యాన్ని తాగి వాహనాలు నడుపుతున్నారని చెబుతున్నారు. కోర్టులో వీరిపై అభియోగపత్రాలను నమోదు చేస్తే...జైలు శిక్షతో పాటు వాహనచోదక అనుమతి పత్రాలు తాత్కాలికంగా రద్దవుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.