close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

వరదండి.. ఆయకట్టుకు గండి

వరద పోటెత్తినా వినియోగించుకోలేని వైనం
 సాగునీటి కాలువల పరిస్థితి దయనీయం
 నీటి విడుదలలోనూ నిర్లక్ష్యమే
 రైతులకు తప్పని కష్టాలు

గడివేముల మండలం పెసరవాయి వద్ద కేసీకి పడిన గండి

జిల్లాలో చినుకుజాడే కానరాలేదు. అయినప్పటికీ ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా, తుంగభద్ర జలాశయాలు ఉప్పొంగాయి. 2009 నాటి పరిస్థితులను తలపించాయి. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. చివరికి సాగర్‌కు భారీగా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. కాలువలు సరిగా లేకపోవడం.. సకాలంలో స్పందించి అవసరమైన నీటిని విడుదల చేయడంలో తాత్సారం చేయడంతో ఆయకట్టు రైతులకు కష్టాలే మిగిలాయి. కళ్ల ముందే నీరు వృథాగా పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నదులకు నీటి ప్రవాహం ఆగిపోయే సమయంలో పరిమితికి మించి నీటిని వదలడంతో పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడి పొలాలను ముంచెత్తాయి. - న్యూస్‌టుడే,కర్నూలు జలమండలి

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కింద 9.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 5.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం గగనంగా మారింది. కాలువలు అధ్వానంగా ఉండటంతోపాటు దశాబ్దాల కిందట నిర్మించడం.. నిర్వహణ కరవవడంతో చాలావరకు శిథిలావస్థకు చేరాయి. మరోవైపు జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాల్వల నిండా నీరు ప్రవహించే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. * మల్యాల ప్రాజెక్టులో 12 పంపులు ఉండగా.. మొదట్లో రెండు పంపుల ద్వారానే నీటిని వదిలారు. వరద ఆగిపోయే సమయంలోనూ ఆరు పంపుల ద్వారానే వదలాల్సిన పరిస్థితి. ఎక్కువ నీటిని వదిలే పరిస్థితి లేకపోవడంతో వరద నీటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొంది.

ప్రతిపాదనలతో సరి

కేసీ కాలువ కర్నూలు- కడప జిల్లాల్లో 306 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కుల ప్రవాహం వరకు ఉంది. కానీ 2,900 క్యూసెక్కులు దాటితే గండ్లు పడే పరిస్థితి ఉండటంతో 2,500 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు. * 2009లో వచ్చిన భారీ వరదలతో సుంకేసుల బ్యారేజీతో సహా 80 కి.మీ. వరకు కాల్వ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో కాల్వకు లైనింగ్‌తోపాటు బ్యారేజీ మరమ్మతులకు రూ.162 కోట్లతో ప్రతిపాదనలు పంపగా అది గత పదేళ్లుగా దస్త్రాలకే పరిమితమవడం గమనార్హం. 0-80 కి.మీ. వరకు లైనింగ్‌ చేయడం ద్వారా కనీసం 3,200 వరకు క్యూసెక్కుల నీటిని సులభంగా విడుదల చేసే అవకాశముంటుంది. కేసీ కాల్వకు ఏటా నిర్వహణ వ్యయం కింద రూ.28 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదిస్తుండగా కేవలం రూ.3 కోట్లు మాత్రమే మంజూరవుతుండడం గమనార్హం.

‘గంగ’కు ప్రవాహం గగనమే

జిల్లాలో 84 కిలోమీటర్ల వరకు విస్తరించిన తెలుగుగంగ కాల్వ ద్వారా 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ కాల్వ ద్వారా 5 వేల క్యూసెక్కులు వదలాల్సి ఉండగా 3,300 క్యూసెక్కులు పంపడం గగనమవుతోంది. మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో తెలుగుగంగ ఉప కాల్వ దెబ్బతినడంతో ఇటీవల పంట పొలాల్లోకి నీరు ప్రవేశించింది. ఈ ప్రాజెక్టుకు ఏటా విడుదల చేసే నిర్వహణ వ్యయం రూ.3 కోట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనికితోడు వెలుగోడు జలాశయం నుంచి 18 కి.మీ. వరకు కాల్వ లైనింగ్‌ పనుల నిమిత్తం గత ప్రభుత్వం రూ.275 కోట్లు విడుదల చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తై ఒప్పందం కుదిరినా పనులు రద్దయ్యాయి. తెలుగుగంగ కాల్వ ద్వారా పూర్తిస్థాయిలో నీటి విడుదలకు అవకాశం లేకపోవడంతో కడప జిల్లా బ్రహ్మసాగర్‌ జలాశయానికి నీరు పంపడం కష్టమవుతోంది.

అవకాశమున్నా ఉపయోగించుకోలేదు

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 848 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి 6 వేల క్యూసెక్కుల నుంచి 8 వేల క్యూసెక్కులు వదులుకునే అవకాశముంది. 854 అడుగులకు వచ్చినప్పుడు 16 నుంచి 20 వేల క్యూసెక్కులను కాలువలకు వదలొచ్చు. కానీ 870 అడుగులు చేరేంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికారులు నీటిని విడుదల చేయలేకపోయారు. ఆ తర్వాత కొద్దికొద్దిగా వదులుతూ ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ఒక్కసారిగా 44 వేల క్యూసెక్కులు వదలడంతో నీటి ప్రవాహానికి కాలువలు తట్టుకోలేకపోయాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో గండ్లు పడడంతో చివరికి నీటి ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించేయాల్సి వచ్చింది. కాలువల వెంబడి నిరంతరం పర్యవేక్షణ లేకపోవడం.. ఏమాత్రం అంచనా వేయలేకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి.

* పాములపాడు మండలం మద్దూరు గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వ బలహీనంగా ఉండటంతో ఈనెల 16న నీటి ప్రవాహానికి గండిపడింది. దీంతో వరద నీరంతా పొలాల్లోకి చేరింది.

* మహానంది మండలం గోపవరం గ్రామం వద్ద తెలుగుగంగ ఉప కాల్వకు గండి పడడంతో అన్నదాతలు నష్టపోయారు. కాల్వకు పరిమితికి మించి నీటిని విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

వృథాగా వదిలేశారు

ఈనెల 3 నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. లక్ష క్యూసెక్కుల నుంచి ప్రారంభమైన వరద దాదాపు 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీనిని ముందస్తుగా గుర్తించి అవసరమైన నీటిని జలవనరులశాఖ కాలువలకు వదలాల్సి ఉంది. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తీరా వరద తగ్గే సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా.. ఏమాత్రం అంచనా వేయకుండా వదలడంతో పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర కాలువలకు గుండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.