close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

చట్టం.. తెరమరుగు!

ప్రాణాల మీదకు తెస్తున్న ప్రచార ఫ్లెక్సీలు
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని బల్దియా

పుట్టినా, గిట్టినా.. కూడలిలో కట్టాల్సిందే ఓ ప్రచార తెర.. ఈ ధోరణి పెరిగిపోవడంతో రోడ్లకు ఇరువైపులా కాస్త సందు దొరికినా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అవే గాల్లో వేలాడుతూ.. పౌరుల ప్రాణాలూ గాల్లో కలిపేస్తున్నాయి. తొలగించాల్సిన జీహెచ్‌ఎంసీ.. వ్యక్తులు, సంస్థలు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్న భారీ తెరల విషయంలో చోద్యం చూస్తోంది. జరిమానా విధించి, కేసులు పెట్టాలని డీఫేస్‌మెంట్‌ చట్టం చెబుతున్నా అధికారులు అమలు చేయడం లేదు.. ఎవరూ ఖాతరు చేయడం లేదు.

ఈనాడు, హైదరాబాద్‌

మహానగరంలో అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నికలు, పండగలు, వేడుకలు, రకరకాల దినోత్సవాలకు ప్రజాప్రతినిధులు బోర్డులు తయారు చేయించి ఇష్టానుసారం రోడ్లపై ప్రదర్శిస్తున్నారు. రహదారుల విభాగినులపై ఉండే విద్యుత్‌ స్తంభాలకు, రోడ్డు పొడవునా ఉండే చెట్లకు ఫ్లెక్సీ బోర్డులు కడుతున్నారు. వాళ్లను చూసి స్థానిక నేతలు, సామాన్య ప్రజలు సైతం రెచ్చిపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం తెచ్చిపెడుతోన్న ఫ్లెక్సీ బోర్డులను రోడ్లపై, పార్కుల్లో, స్టేడియాల వద్ద, వేడుకలు జరిగే ప్రాంతాల్లో, దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల చుట్టూ ఏర్పాటు చేస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది: డీఫేస్‌మెంట్‌ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తులపై బోర్డులపై ఏర్పాటు చేయడం నేరం. ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం, కేసు నమోదు చేసే అధికారం జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులకు ఉంటుంది.

ఎందుకు పాటించడం లేదు: ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల మన్ననల కోసం పనిచేస్తున్న అధికార యంత్రాంగం చట్టాన్ని విస్మరిస్తోంది. చిన్నపాటి దుకాణదారులు, చిరువ్యాపారులు, సామాన్యులు ఏర్పాటు చేసుకునే బోర్డులపై చర్యలు తీసుకుంటూ ప్రాణసంకటంగా మారుతున్న వాటిని వదిలేస్తోంది. ఇటీవల అమీర్‌పేటలో మూడు రోజులపాటు హడావుడి చేసి తొలగించిన ఫ్లెక్సీ ఉదంతమే అందుకు నిదర్శనం.

అక్కడ తొలగించి.. అంతటా వదిలేశారు.. మైత్రివనం నుంచి సత్యం థియేటర్‌ వరకు రోడ్డుకు రెండు వైపులా ఉన్న బోర్డులను తొలగించిన అధికారులు అదే మైత్రీవనం నుంచి పంజాగుట్ట వరకు ఉన్న ప్రచార తెరల వైపు కన్నెత్తి చూడలేదు. పంజాగుట్ట, లక్డీకాపుల్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఆర్టీసీ క్రాసు రోడ్డుల్లోని అధ్వాన పరిస్థితులను పట్టించుకోలేదు.

హెచ్చరిస్తోన్న ప్రమాదాలు.. దక్షిణ చెన్నై పరిధిలోని పల్లికరనైలో వివాహ వేడుక సందర్భంగా అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలు రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గురువారం ఓ యువ ఐటీ ఉద్యోగిని ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్లెక్సీబోర్డు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న శుభశ్రీ (23) కిందపడింది. వెనుక నుంచి వచ్చిన ట్యాంకరు ఆమెను ఢీకొట్టింది. గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి బోర్డు ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. ఈ ఘటనతో తమిళనాడు రాజధానిలో రాజకీయ దుమారానికి తెరలేపింది. శుభశ్రీ మృతికి అధికార పార్టీదే బాధ్యత అని విపక్షాలు ఆందోళన చేశాయి. రహదారులపై, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై అనధికారికంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని మద్రాసు హైకోర్టు గతంలో తీర్పు చెప్పినప్పటికీ పోలీసులు, నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.ః 2019 ఏప్రిల్‌ 22న ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో పెను ప్రమాదం తప్పింది. గాలివాన దాటికి రోడ్లపై అడ్డదిడ్డంగా కట్టిన ఫ్లెక్సీ బోర్డులు ప్రేక్షకులపై పడ్డాయి. ః నగరంలోని అనధికార ఫ్లెక్సీ బోర్డులు ఇప్పటికే నాలుగుసార్లు మెట్రోరైలు మార్గంపై పడి రాకపోకలకు అంతరాయం కలిగించాయి. ః బంజారాహిల్స్‌లో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ః కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్ల బోర్డులు అగ్నిప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.