Punjab Vs Bengaluru: మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్

కీలకమైన ఆటగాళ్ల క్యాచ్‌లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్‌ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లను చేజార్చారు.

Updated : 10 May 2024 15:26 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో పంజాబ్‌కు 8వ ఓటమి ఎదురైంది. దీంతో ఈ ఎడిషన్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రెండో జట్టుగా మారింది. భారీ లక్ష్యాలను ఛేదించి ఊపు మీదున్న ఆ జట్టుకు ఫీల్డింగ్‌లో ఘోర వైఫల్యంతో ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరుతో మ్యాచ్‌లోనూ ఆరు క్యాచ్‌లను పంజాబ్‌ ఫీల్డర్లు నేలపాలు చేశారు. అందులోనూ కీలక ఇన్నింగ్స్‌  ఆడిన విరాట్ కోహ్లీ (92)వే రెండు ఉన్నాయి. పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లీ (Virat Kohli) మళ్లీ 10 రన్స్‌ ఉన్నప్పుడు కూడా బతికిపోయాడు. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన రజత్‌ పటీదార్‌ కూడా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. తమ జట్టు ఫీల్డింగ్‌ వైఫల్యంపై పంజాబ్ సహాయక కోచ్‌ బ్రాడ్ హడిన్‌ స్పందించాడు.

‘‘వందశాతం మేం ఓడిపోవడానికి ప్రధాన కారణం క్యాచ్‌లను వదిలేయడమే. ఇద్దరు కీలక బ్యాటర్లను డకౌట్‌ చేసే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాం. లేకపోతే మ్యాచ్‌లో మాదే పైచేయిగా నిలిచేది. వారిద్దరూ దూకుడుగా ఆడటంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. ఇరు జట్ల బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో పెద్ద వ్యత్యాసం లేదు. కేవలం ఫీల్డింగ్‌లోనే వైఫల్యం చెందడంతో భారీ మూల్యం చెల్లించాం. ఇలా ఓడిపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం. మా కుర్రాళ్లలో ఉత్సాహం నింపడం పెద్ద కష్టమేం కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌ల్లో ఇదొకటి. మన నైపుణ్యాలను ప్రదర్శించేందుకు చక్కటి వేదిక. శశాంక్‌, అశుతోష్ ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు. వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. చివరి రెండు మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన చేస్తారనే నమ్మకం ఉంది. సీజన్‌ను ఇంకాస్త బెటర్‌గా ముగించేందుకు ప్రయత్నిస్తాం. సీనియర్‌ బౌలర్ కగిసో రబాడకు ఆరోగ్యం బాగోలేదు. అందుకే అతడికి విశ్రాంతినిచ్చాం’’ అని బ్రాడ్ తెలిపాడు. 

ప్రతి ఓటమి నుంచి నేర్చుకుంటాం: సామ్ కరన్

‘‘ఇప్పటివరకు సీజన్‌లో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. అయితే, విజయం సాధించడానికి అవి సరిపోలేదు. ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగాం. ప్రతీ మ్యాచ్‌ నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. మున్ముందు అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాం. దానికి తీవ్రంగా శ్రమిస్తాం’’ అని పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని