close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

మూగవాణి..!

పేరుకుపోయిన ‘ప్రజావాణి’, ఇతర ఫిర్యాదులు
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు
చోద్యం చూస్తున్న బల్దియా యంత్రాంగం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజావాణి మూగబోయింది. ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్లక్ష్యానికి గురైంది. పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తామంటోన్న అధికారులు, పాలకులు.. సామాన్య జనం నుంచి వచ్చే ఫిర్యాదులను పెడచెవిన పెడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ.. అందుకుంటున్న ఫిర్యాదులు సగానికిపైగా పరిష్కారానికి నోచుకోక పోవడమే అందుకు నిదర్శనం. మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందే సమస్యలనూ యంత్రాంగం ఖాతరు చేయట్లేదు. కాలంతోపాటు పరుగులు తీసే రాజధానిలో అధికారులు ప్రదర్శిస్తోన్న అలసత్వం తీవ్ర ఆందోళనకు తావిస్తోంది.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థకు ఎం.టి.కృష్ణబాబు కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. నేరుగా సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అలా ఇప్పటికీ బల్దియాలో ప్రజావాణి కొనసాగుతోంది. మధ్యలో రెండున్నరేళ్లపాటు అధికారులు ప్రజావాణి గదికి తాళాలు వేయగా, మునుపటి కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాక తిరిగి ప్రారంభించారు. ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పుడు తాను హాజరుకాలేనని, అలాంటప్పుడు అన్ని విభాగాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు ప్రజావాణిలో తప్పక పాల్గొనాలని స్పష్టం చేశారు. అనంతరం కొన్ని రోజులకు బల్దియాకు కొత్త కమిషనర్‌ నియమితులయ్యారు. ఉన్నతాధికారులు గత సంప్రదాయాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. అయితే నిబద్ధత కొరవడింది. ప్రజావాణిలో మొక్కుబడిగా కూర్చుంటున్నారు. జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ అదే తంతు నడుస్తోంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ఆస్తిపన్నును అసాధారణంగా పెంచడం, పారిశుద్ధ్యం, చెరువుల ఆక్రమణలు, ఇంటి నంబరు కేటాయింపు సమస్యలు, ఎన్వోసీలు, కాలిబాట ఆక్రమణలు, రోడ్లపై గుంతలు, దోమల సమస్య, పందులు, వీధికుక్కలు కాలనీల్లో తిరగడం, ఇతరత్రా సమస్యలపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను అటకెక్కిస్తున్నారు. ఫలితంగా సామాన్యులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

కాళ్లరిగేలా తిరుగుతోన్న జనం..
ప్రజావాణి వరకు ఫిర్యాదు వచ్చిందంటే.. అంతకుముందు ఫిర్యాదుదారు సంబంధిత అధికారి, కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి ఉంటారు. అక్కడ మొర వినేవారు లేకపోయినప్పుడే మెజార్టీ ప్రజావాణికి వస్తారు. ఇప్పుడు అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో జనం ఆగ్రహానికి గురవుతున్నారు. మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌యాప్‌లో పొందుపరుస్తోన్న ఫిర్యాదులనూ అధికారులు పట్టించుకోవట్లేదు.

అధ్వానమైన సర్కిళ్లు ఇవే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. అన్నింటి నుంచి ఏప్రిల్‌ 1, 2019 నుంచి సెప్టెంబర్‌ 10, 2019 వరకు 1.24 లక్షల ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించడంలో అధికారులు మభ్యపెట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండానే.. చేసినట్లు నివేదికల్లో రాసేస్తున్నారు. సమీక్ష జరిగినప్పుడు ఉన్నతాధికారుల నుంచి తప్పించుకునేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది అలా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా సర్కిల్‌ అధికారులు తమను మోసం చేస్తున్నారని, సమస్య ఇంకా అలాగే ఉందని పౌరులు ప్రతిసారీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో మొరపెట్టుకుంటున్నారు. బల్దియా గణాంకాల ప్రకారం ప్రజాసమస్యల పరిష్కారంలో ఫలక్‌నుమా, సరూర్‌నగర్‌, కార్వాన్‌, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మలక్‌పేట, సంతోష్‌నగర్‌, చార్మినార్‌ సర్కిళ్లు అధ్వానమైన పనితీరు కలిగిఉన్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.