close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

కదం తొక్కుతున్న కార్మికలోకం

ప్రదర్శనలు, వంటావార్పులతో నిరసనలు

 12వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె 

మహబూబాబాద్‌లో దీక్ష చేస్తున్న కార్మికులు

మహబూబాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే : ఆర్టీసీ కార్మికులు కదం తొక్కుతున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకు వినూత్న రీతుల్లో నిరసనలను తెలియజేస్తున్నారు. పట్టు విడవకుండా 12 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు. బుధవారం వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల వద్ద అర్ధనగ్న ప్రదర్శనలు, వంటావార్పులతో నిరసనలు తెలిపారు. కార్మికలోకానికి అఖిలపక్షం నాయకులు, కుల, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆందోళన ఉద్ధృతంగా కొనసాగుతోంది. హన్మకొండలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలతో హోరెత్తించారు. రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. అధికారులు ప్రజారవాణాకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. టిమ్‌ యంత్రాలు, ముద్రిత టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీటెక్‌ చదివిన విద్యార్థులతో తాత్కాలిక కండక్టర్ల టిమ్‌ యంత్రాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు.

* బుధవారం రీజియన్‌ పరిధిలోని 9 డిపోల నుంచి 680 బస్సులు నడిశాయి. ఇందులో 486 ఆర్టీసీ, 194 అద్దె బస్సులు. 78 శాతం బస్సులు నడిచినా సరిపడా ఆదాయం సమకూరలేదు. గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సులను నడిపించారు. రాజధాని ఏసీ బస్సులు సైతం రోడ్డెక్కాయి. అనుభవం కలిగిన డ్రైవర్లను రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఏసీ బస్సులను అప్పగించారు. మొత్తంగా 486 మంది డ్రైవర్లు, 680 మంది కండక్టర్లు విధులు నిర్వహించారు. 262 బస్సులలో ముద్రిత టికెట్లు అందజేశారు. 114 బస్సుల్లో టిమ్‌ యంత్రాలను ఉపయోగించారు. 115 రూట్లలో సర్వీసులను నడిపించారు. బస్టాండుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్లాట్‌ ఫారాల వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంగనర్‌, జగిత్యాల తదితర రూట్లలో ప్రయాణికులు ఎక్కువగా కనిపించారు. ఇప్పట్లో సమ్మె ముగిసే పరిస్థితి లేకపోవడంతో డిపోల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రీజియన్‌లో రోజుకు రూ.1.10 కోట్ల ఆదాయం సమకూరుతుంది. సమ్మె కారణంగా గత 12 రోజులుగా ఆదాయం రోజుకు రూ. 20 లక్షలకు మించడం లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.