రైలు తలుపు.. మృత్యు పిలుపు

కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ప్రయాణిస్తుంటాయి.

Updated : 09 May 2024 07:10 IST

ఫుట్‌బోర్డు ప్రయాణం నిషేధాన్ని పట్టించుకోని ప్రయాణికులు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

ఫుట్‌బోర్డుపై కూర్చుని చరవాణి చూస్తున్న యువకుడు  

  • ఏప్రిల్‌ 20వ తేదీన కాగజ్‌నగర్‌-వేంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని 30-35 సంవత్సరాల మధ్య ఉన్న ఓ వ్యక్తి రైలు నుంచి పడి తీవ్రగాయాలై మృతి చెందాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఏప్రిల్‌ 14న బిహార్‌కు చెందిన ఓ యువకుడు ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదవశాత్తు కాగజ్‌నగర్‌-వేంపల్లి స్టేషన్ల మధ్య కింద పడి పోగా.. తీవ్రగాయాలై మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు బల్లార్ష-కాజీపేట మధ్య రోజుకు ఒకటి చొప్పున ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు.

కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. బల్లార్ష నుంచి కాజీపేట వరకు 26 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగక పోవడంతో రద్దీ ఎక్కువవుతోంది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు అత్యవసరంగా రైళ్లలో ప్రయాణించాల్సి వస్తే తలుపుల వద్ద(ఫుట్‌బోర్డు) నిల్చొని, కూర్చుని ప్రయాణిస్తున్నారు. అలా కూర్చోవడం నిషేధం అయినప్పటికీ పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నారు. యువకులు ఎక్కువగా కూర్చోవడం, రైలు నడుస్తుండగా చరవాణులు చూడటం, సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. రైలు అప్పుడప్పుడు కుదుపులకు గురవడంతో ఒక్కసారిగా ఫుట్‌బోర్డుపై ఉన్న వారు కింద పడి తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్నారు.

ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరింత ప్రచారం చేపట్టి, ఫుట్‌బోర్డు వద్ద ఎవరూ నిల్చోకుండా, కూర్చోకుండా సిబ్బంది, రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్‌) చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆ ప్రమాదాలు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై కాగజ్‌నగర్‌ రైల్వే పోలీసులను సంప్రదించగా.. రైలు ఫుట్‌ఫాట్‌పై కూర్చోవడం, నిల్చోవడం చేయరాదని ప్రయాణికులకు నిత్యం అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అయినప్పటికీ, పలువురు యువకులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

రైలు తలుపు వద్ద నిల్చొని ప్రయాణిస్తున్న యువకులు


సాధారణ బోగీల సంఖ్య పెంచితేనే..

దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్‌ (సాధారణ) బోగీల సంఖ్యను ఇప్పుడున్న రెండు నుంచి అయిదుకు పెంచాలని ‘జనరల్‌ బోగీల సాధన సమితి, రైల్‌ సేవా సమితి ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో కేవలం రెండు, మూడు జనరల్‌ బోగీలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా రోజూ కోట్ల సంఖ్యలో ప్రజలు వివిధ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రిజర్వేషన్లు లేని వారు ప్రయాణిస్తుండగా వారికి సరిపడా జనరల్‌ బోగీలు లేక తొక్కిసలాటలు, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేయడం సర్వసాధారణంగా మారింది. కేంద్ర ప్రభుత్వం సత్వరమే జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు,  వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జనరల్‌ బోగీల అవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా రెండ్రోజుల కిందట వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ సంస్థ ఆధ్వర్యంలో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు