నోటా.. వచ్చిందిలా

ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు.

Updated : 09 May 2024 07:03 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. కొందరు లేఖలు రాసి, మరికొందరు పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేసి, ఇంకొందరు బ్యాలెట్‌ పత్రంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా ఖాళీగా ఉంచి నిరసన వ్యక్తం చేసేవారు. నచ్చని అభ్యర్థులు రంగంలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం ఓటరుకు ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీన్ని అనుసరించి ఎన్నికల సంఘం నోటా (నన్‌ అఫ్‌ ది ఎబోవ్‌)తో ఆ అవకాశాన్ని కల్పించింది. ఈ పద్ధతి 2013 నుంచి అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం ఎన్నికలు రావడంతో మొదటిసారి దిల్లీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాను అమలు చేశారు. ఇలాంటి నోటా విధానం ప్రస్తుతం 13 దేశాల్లో అమలులో ఉంది.

చెల్లని ఓట్లకు చెల్లు చీటీ..

ఓటింగ్‌ ప్రక్రియలో ఈవీఎంలను ప్రవేశపెట్టడంతో చెల్లని ఓట్లకు కాలం చెల్లింది. ఓటరు అభ్యర్థి గుర్తు పక్కనున్న మీటాను నొక్కాలి. ఎవరూ నచ్చకపోతే నోటా మీటా నొక్కే సౌకర్యం ఉంది. గతంలో బ్యాలెట్‌ పేపరుపై స్వస్తిక్‌ ముద్ర వేసే పద్ధతి ఉండేది. ఈ క్రమంలో ముద్ర సరిగ్గా పడకపోవడం, ఇద్దరి గుర్తులపై ముద్ర వేయడం, ముద్ర వేయకుండానే బ్యాలెట్‌ పేపరును బాక్స్‌లో వేయడం వల్ల వాటిని చెల్లని ఓట్లుగా గుర్తించేవారు. ప్రస్తుతం ఈవీఎంలు రావడం వల్ల చెల్లని ఓట్లు అనే సమస్య లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని