close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

చుక్కేశారు..లెక్కల్లోకెక్కారు

తొమ్మిది నెలల్లో 20వేల డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు
రూ.10వేల జరిమానాతో జంకుతున్న మందుబాబులు
ఈనాడు, హైదరాబాద్‌

వారాంతాలు.. ఉత్సవాలు.. వేడుకల్లో మోతాదుకు మించి మద్యం తాగడం.. మత్తులో వాహనాలు నడుపుతున్న మందుబాబులకు ట్రాఫిక్‌ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ‘నిషా’చరులుగా మారి ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం వారంతాలతో పాటు ఇతర రోజుల్లో రాత్రివేళల్లో వాహనాలపై వెళ్తున్న మందుబాబులను ఆపి శ్వాసపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకు 80 మంది నుంచి 90 మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరక్కండా వేర్వేరు మార్గాల్లో తప్పించుకునేవారిని గుర్తించేందుకు తనిఖీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. టాఫిక్‌ పోలీసులు మందుబాబులపై దృష్టి కేంద్రీకరించడంతో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో 20,414 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు నుంచి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తుండటంతో కొందరు మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపేందుకు జంకుతున్నారు. 


అతిగా మద్యం తాగి..

కొంతమంది యువతీ, యువకులు పీకలదాకా మద్యం తాగి కార్లు, బైకుల్లో రహదారులపైకి వస్తున్నారు. శ్వాస పరీక్షలో వీరు తాగిన మద్యం మోతాదును చూసి ట్రాఫిక్‌ పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. బీఏసీ(బ్లడ్‌ ఆల్కహాల్‌ కన్సంట్రేషన్‌) ప్రమాణాల మేరకు ప్రతి వంద మిల్లీలీటర్ల రక్తంలో (100మి.లీ) మద్యం మోతాదు(ఆల్కహాల్‌ కంటెంట్‌) 30 మిల్లీగ్రాములకు మించకూడదు. బ్రీత్‌అనలైజర్ల పరీక్షలో వీరిలో కొందరి ఆల్కాహాల్‌ శాతం 100మిల్లీగ్రాములు దాటుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న యువతిని బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా.. 100మిల్లీలీటర్ల రక్తంలో 121మిల్లీగ్రాముల మద్యం మోతాదు కనిపించింది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బీఏసీ 105మి.గ్రా నమోదు కాగా.. వ్యాపారం నిర్వహిస్తున్న మరో యువతి బీఏసీ 102మి.గ్రా నమోదయింది. వీరిపై కేసులు నమోదు చేసిన అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేటప్పుడు అయోమయం, ఆందోళనకు గురై ప్రమాదాలు చేసే అవకాశాలున్నాయి. చాలామంది నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదాలు నమోదవుతున్నాయని పోలీసులు వారికి వివరించారు.


జరిమానాలు.. జైలు శిక్షలు

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మోతాదుకు మించి మద్యం తాగి పట్టుబడిన ప్రతి ఒక్కరి వివరాలను కంప్యూటరీకస్తున్నారు. పదేపదే పట్టుబడేవారిని గుర్తించేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను స్కాన్‌ చేస్తున్నారు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించినప్పుడు గతంలో పట్టుబడిన వారు చిరునామా తప్పు చెప్పినా, వివరాలు సగం, సగం చెప్పినా.. డ్రైవింగ్‌ లెసెన్స్‌ ద్వారా తెలిసిపోతుంది. డ్రంకెన్‌ డ్రైవ్‌లో వివాదాలు, విమర్శలు రానివ్వకుండా తనిఖీల నిర్వహణంతా వీడియో చిత్రీకరిస్తున్నారు. మందుబాబుల ఆధార్‌ కార్డునూ అనుసంధానం చేస్తున్నారు. పదేపదే పట్టుబడిన వారిని గుర్తించి వారికి జైలుశిక్ష పడేలా నివేదికలను రూపొందించి న్యాయస్థానాల్లో సమర్పిస్తున్నారు.


ప్రమాదాలు తగ్గించేందుకే
- అనిల్‌ కుమార్‌, అదనపు సీపీ(ట్రాఫిక్‌)

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకే డ్రంకెన్‌డ్రైవ్‌పై దృష్టి కేంద్రీకరించాం. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్‌ ఠాణాల పరిధిలో పగలు కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారి వాహనాలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పాటు కౌన్సెలింగ్‌కు వచ్చాకే వారిని వదిలేస్తున్నాం. డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో పట్టుబడి జైలుకు వెళితే భవిష్యత్తులో వారికి పాస్‌పోర్టు, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సందర్భాల్లో ఈ కేసులు ప్రభావం చూపిస్తాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.