close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

బాలలూ..భావి భారతం మీదే

చాచా నెహ్రూ అభిమతమిదే

న్యూస్‌టుడే, అచ్చంపేట

నేటి బాలలే రేపటి పౌరులన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. బాలల జీవితం బంగారుమయమైతేనే

దేశాభ్యున్నతికి పాటుపడే పౌరులను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. మారుతున్న

సమాజంలో బాలలు వివిధ రకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఆత్మన్యూనతతో కుంగిపోతున్నారు.

బంగారు బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

దురలవాట్లకు లోనై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా

వాటికి ముగింపు పలకాలి. చాచా కలను సాకారం చేయడానికి మంచి మార్గాలను అనుసరించాలి.

ఆత్మహత్యలు వద్ధు. : పిల్లలు చిన్నప్పట్నుంచే ఒత్తిడికి గురవుతున్నారు. మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు. చదువు పేరుతో వారిపై ఒత్తిడిని పెంచతున్నారు. తల్లి ఒడిలో పెరగాల్సిన పిల్లలను వసతిగృహాల్లో బందీలుగా మారుస్తున్నారు. మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. కేవలం చదువుకు తప్ప ఇతర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించడం లేదు. ఒత్తిడి కారణంగానే పిల్లలు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షలు తప్పినా తట్టుకోలేకపోతున్నారు. అపజయం నుంచే విజయాలు సాధించవచ్చన్న నగ్నసత్యాన్ని గుర్తించలేక తనువు చాలిస్తున్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పుతోపాటు ఒత్తిడి లేని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించినప్పుడే ఆత్మహత్యలు ఆగిపోతాయి. బాలలు అర్ధంతరంగా తనువు చాలించకుండా దేశం గర్వించే స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలి.

మత్తుకు బానిసలు కావొద్ధు. : బాలలు వివిధ కారణాలతో దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పాశ్చాత్య నాగరికతపై ఆసక్తిని చూపుతున్నారు. మానవ సంబంధాలకు దూరమై మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. మద్యం, పొగ తాగడం తదితర చెడు వ్యసనాల వలలో చిక్కుకొని మధురమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే జీవితం అంధకారం అవుతుందన్న విషయాన్ని గుర్తించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగృతం చేయాలి.

సమయ పాలన పాటించాలి.. : బాలలు సమయపాలన పాటించడం లేదు. క్రమశిక్షణ లేకపోవడంతో అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడంతో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమరితనం పెరిగితే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడం కష్టం. నిద్రలేమి సమసస్యతో చిన్నతనంలోనే రోగాలబారిన పడుతున్నారు. సమయపాలన లేకపోవడంతో చదువులో వెనుకబాటుకు గురవుతున్నారు. ప్రణాళిక ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడే ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించేలా ప్రోత్సహించాలి.

ఆరోగ్యంపై ఆహారపు అలవాట్ల ప్రభావం.. : మారుతున్న జీవన విధానంలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే కలుషిత ఆహారంపై ఆసక్తి చూపుతున్నారు. పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంక్‌ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. వయసుకు మించిన బరువుతో ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలి.

కష్టం విలువ తెలుసుకోవాలి.. : పిల్లలు అడిగినవన్నీ సమకూర్చడం సరికాదన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలకు కష్టం విలువ తెలిసేలా చేయాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా కాదనకుండా ఇప్పిస్తుంటారు. దీంతో కష్టం విలువ తెలియక ఏ చిన్న సమస్య ఎదురైనా తట్టుకునే శక్తి ఉండదు. సమస్యలను ఎదుర్కొనేలా పిల్లలను పెంచితే జీవితంలో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

స్నేహితుల ప్రభావం.. : పిల్లలపై స్నేహితుల ప్రభావం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో స్నేహితులపై అధికంగా ఆధారపడుతుంటారు. స్నేహితుల ఎంపిక విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకొని మంచిని పంచే స్నేహితులు ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారు.

పాఠ్యేతర అంశాలపై దృష్టి వద్ధు. : పిల్లలను చదువుకునే యంత్రాలుగా మార్చడం సరికాదు. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు కేవలం చదువుకే ప్రాధాన్యం ఇస్తూ ఒత్తిడికి గురి చేయరాదు. ఒత్తిడితో మానసికంగా కుంగిపోతారు. చిన్న సమస్య ఎదురైనా తట్టుకునే శక్తి ఉండదు. బాలల్లో సంపూర్ణ వికాసం ఉండాలంటే చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలి.

ఫ్యాషన్‌ ట్రెండ్‌తో ఇబ్బందులు.. : ఆధునిక పోకడలతో ఫ్యాషన్‌ ట్రెండ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తూనే హుందాతనాన్ని మరవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఫ్యాషన్‌ పేరుతో ముప్పును కొనితెచ్చుకునేలా వ్యవహరించడం సరికాదు.

ప్రతి సమస్యకూ పరిష్కారం.. : ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. అపజయం ఎదురైతే కుంగిపోరాదు. ఎదుటివాళ్లు చిన్నచూపు చూస్తారన్న ఆలోచన రానివ్వొద్ధు ఒత్తిడి ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా మంచి స్నేహితులతో పంచుకునే అలవాటును పెంపొందించుకోవాలి. సమస్యలను ఇతరులతో పంచుకోవడంతో మనసు తేలిక పడి లక్ష్య సాధనపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది.

జల్సాల కోసం చోరీలు.. : విద్యార్థి దశలో చోరీలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. చిన్నతనం నుంచి విలాసాలకు అలవాటుపడినవారు తప్పులు చేసే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు విలాసాలకు అలవాటుపడిన వారు కొన్ని సందర్భాల్లో అవసరమైన డబ్బు అందుబాటులో లేకుంటే తప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. విలాసాలను కట్టడి చేసుకోలేక చోరీలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఇతరులతో పోల్చుకోవడంలో జాగ్రత్తలు.. : బాలలు ఇతరులతో పోల్చుకోవడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విలాసాలు, మత్తు పానీయాలకు అలవాటుపడిన వారు, ఖరీదైన వస్తువులను ఉపయోగించే వారితో పోల్చుకొని ఒత్తిళ్లకు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జాతీయ నాయకులు, ఉన్నత స్థాయికి ఎదిగిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఖరీదైన చరవాణులు.. : పిల్లలు చరవాణికి బానిసలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో అత్యంత ఖరీదైన చరవాణులు ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఎక్కువ సమయం చరవాణితో కాలయాపన చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రేమ వ్యవహారాలు.. : తెలిసీతెలియని వయసులోనే ఆకర్షణకులోనై ప్రేమగా భావిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యుక్త వయసులో లైంగిక విద్యపై సరైన అవగాహన కల్పించకపోవడంతో తప్పటడుగులు వేస్తున్నారు. మైనార్టీ తీరకముందే తప్పులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. పిల్లల వ్యవహార శైలిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అతి స్వేచ్ఛ పనికిరాదు.. : బాలలకు అతి స్వేచ్ఛ కల్పించడం జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం వారిపై పర్యవేక్షణ లేకపోవడంతో తప్పటడుగులు వేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో బాల్యాన్ని గడిపేలా శ్రద్ధ తీసుకోవాలి. అతి స్వేచ్ఛతో ఎవరినీ లెక్కచేయనితనం అలవడుతుంది.

బాధ్యతలను విస్మరించొద్ధు. : ప్రతి వ్యక్తి బాధ్యతలను గుర్తించినప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు. బాధ్యతలను విస్మరించిన వారు అపజయం పాలై జీవితంపై విరక్తిని పెంచుకుంటారు. ఆత్మన్యూనతకు గురై జీవితాలను నాశనం చేసుకుంటారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే జీవితంలో లక్ష్య సాధనకు చేరువవుతారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.