close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

ఉస్మానియాకు మోక్షం!

పాత భవనం నుంచి రోగుల తరలింపు
ఇప్పటికే 110 పడకల వరకు సర్దుబాటు
రూ.19 కోట్లతో మరమ్మతులకు మార్గం సుగమం
ఈనాడు, హైదరాబాద్‌

ట్టకేలకు ఉస్మానియా ఆసుపత్రికి మోక్షం లభించింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పాత భవనంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న రోగులు, వైద్య సిబ్బందికి ఊరట లభించింది. వార్డుల తరలింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే మెడికల్‌ వార్డుకు సంబంధించి వందకు పైగా పడకలను పక్కనే ఉన్న భవనంలో సర్దుబాటు చేశారు. మిగతా పడకలను కూడా క్రమంగా తరలించడానికి చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను ఎప్పటికప్పుడు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ పర్యవేక్షిస్తున్నారు. పక్కనే ఉన్న భవనంలో ఖాళీలను గుర్తించి వాటిని బట్టి అక్కడ మంచాలు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ భవనంలో రెండో అంతస్తు పూర్తిగా మూసివేశారు. అక్కడ ఉన్న వార్డులను గతంలో కింద అంతస్తుల్లో సర్దుబాటు చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు భవనం పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కూడా పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో ఓ వైద్యుని గదిలో ఫ్యాను ఊడి పడింది. సూపరింటెండ్‌ పాత ఛాంబర్‌లో కూడా మూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. గతంలో రోగులపై పడటంతో స్వల్పంగా గాయాలయ్యాయి. పాత భవనంలో చికిత్స పొందడానికి.. విధులు నిర్వహించడానికి అటు రోగులు ఇటు వైద్య సిబ్బంది బెంబెలెత్తుతున్నారు. మొత్తం 1100 పడకల్లో పాత భవనంలో దాదాపు 580 వరకు పడకలు ఉన్నాయి. రెండు ఆపరేషన్‌ థియేటర్లు, మహిళలు, పురుషులకు సంబంధించి మెడికల్‌, అత్యవసర, ఆర్థోపెడిక్‌ ఇతర వార్డులు ఇక్కడే ఉన్నాయి. దీంతో రోగుల తాకిడితో పాత భవనంలో రద్దీ కన్పిస్తుంటుంది. భవనం శిథిలావస్థకు చేరడం వల్ల ఎప్పుడు ఏం ముప్పు జరుగుతుందోనని రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడుపుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ సైతం పాత భవనాన్ని పరిశీలించి వెంటనే ఖాళీ చేసి కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై చాలా కాలం వరకు అడుగులు ముందుకు పడలేదు. దీనిపై ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖలో కదలిక వచ్చింది. పాత భవనం ఖాళీ చేయాలని నిర్ణయించారు.

60-100 పడకలు పేట్లబుర్జుకు..
పాత భవనంలోని పడకలన్నీ పక్కనే ఉన్న మరోచోట సర్దుబాటు చేసినప్పటికీ మరో 60-100 పడకలకు స్థలాభావం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే మీమాంసలో అధికారులు ఉన్నారు. గతంలో కూడా ఉస్మానియా పాత భవనం తరలింపు విషయం చర్చకు వచ్చింది. ఆ సమయంలో పేట్లబుర్జులో ఆసుపత్రిలోని నాలుగు అంతస్తుల్లో కొన్ని విభాగాలను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తర్వాత కొందరు వైద్యులు, సిబ్బంది వ్యతిరేకరించడంతో ఆ ప్రతిపాదనలు ఆగిపోయాయి. తాజాగా తరలింపు షురూ కావడంతో పేట్లబుర్జులో కూడా కొన్ని వార్డులను తాత్కాలికంగా పెట్టాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం కాని కొన్ని వార్డులను పేట్లబుర్జుకు తరలించే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు. అయితే దాదాపు పాత భవనం సమీపంలోని భవనంలో తొలుత కేటాయిస్తామన్నారు. అప్పటికీ వీలుకాకపోతే ప్రత్యామ్నాయంగా పేట్లబుర్జు ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరమ్మతులపై స్పష్టత ఏదీ?
పాత భవనంలో వార్డుల తరలింపు తర్వాత.. మరమ్మతులు చేస్తారా? లేదంటే ఆ భవనం అలానే మూసివేసి దోబీ ఘాట్‌ వద్ద ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత లోపిస్తోంది. పాత భవనం మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే రూ.19.2 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో పాత భవనం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు. పాత భవనం హెరిటేజ్‌ కేటగిరిలో ఉండటంతో అత్యంత జాగ్రత్తతో పనులు చేపట్టాలి. మరమ్మతులు చేపట్టే సందర్భంలో భవనం మూల నిర్మాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలి. ఇందుకు నిపుణులైన  సిబ్బంది అవసరమవుతారు. భవనంపై ఉన్న గుమ్మటాలు... ఇతర నిర్మాణ శైలి అంతా పురాతన కాలం నాటిది. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేసే శిల్పులు అవసరం ఉంది. దీంతో మరమ్మతులు చేయాలా? లేదంటే ఆ భవనాన్ని తాత్కాలికంగా మూసి వేసి.. పక్కనే కొత్త టవర్లు నిర్మించాలనే విషయంపై వారం పది రోజుల్లో ఒక స్పష్టత రానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.