close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

చెరువులు నిండేదెన్నడు?

నత్తనడకన తూముల నిర్మాణం
సారంగాపూర్‌, న్యూస్‌టుడే

ఎస్సారెస్పీ కాలువ నీటి ద్వారా చెరువులు, కుంటలు నింపే అనుసంధాన కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 137 తూముల నిర్మాణాలు చేపట్టగా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 69 తూముల పనులను చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడంతో ప్రభుత్వం పనులు ప్రారంభించింది. నియోజక వర్గ పరిధిలోని సారంగాపూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల మండలంలోని పలు తూము పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. సారంగాపూర్‌ మండలంలో పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభించగా బీర్‌పూర్‌ మండలంలో మాత్రం ప్రారంభించలేదు. తూము నిర్మాణాల ద్వారా ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే నీటిని చెరువుకు అనుసంధానిస్తే  దాని కింద ఉన్న చెరువులు, కుంటలు నిండనున్నాయి. ఎస్సారెస్పీ నీటితోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నిరంతరంగా నీరు సరఫరా చేస్తుండడంతో చెరువుల అను సంధానం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన పథకం ముందుకు సాగడం లేదు. నియోజకవర్గ పరిధిలోని సారంగాపూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల మండలాల్లోని తూము పనుల జాప్యంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

పనులు పూర్తయితే ప్రయోజనం
జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 137 తూములు నిర్మిస్తున్నారు. ఒక్కో తూము పనులకు రూ.1.20 లక్షల నిధులు కేటాయించగా ధర్మపురి సబ్‌ డివిజన్‌ పరిధిలోని 69 తూములకు రూ.82.80 లక్షలు మంజూరు చేశారు. వీటిలో ధర్మపురి పరిధిలో 35, గొల్లపల్లిలో ఒకటి, బుగ్గారంలో 13, వెల్గటూర్‌లో ఒకటి, జగిత్యాలలో ఐదు, బీర్‌పూర్‌లో ఏడు, సారంగాపూర్‌లో మూడు తూములు నిర్మిస్తున్నారు.. జగిత్యాల నియోజక వర్గ పరిధిలోని సారంగాపూర్‌ మండలంలో అర్పపల్లి మునిశ్వరుల చెరువు, లక్ష్మీదేవిపల్లె ఊరకుంట, పెంబట్ల ఊరకుంట, బీర్‌పూర్‌ మండలంలో తుంగూర్‌ ఎర్ర చెరువు, తాళ్లధర్మారం మోతులకుంట, కమ్మునూర్‌ రావి చెరువు, చర్లపల్లి ఊరచెరువు, రంగసాగర్‌ మిరప చెరవు, కొల్వాయి శనిగకుంట, కొల్వాయి కుమ్మరికుంట ఉన్నాయి. జగిత్యాల మండలంలో కల్లెడ ఎర్రకుంట, కల్లెడ పోచమ్మకుంట, కల్లెడ చెరువు, సోమన్‌పల్లి ఊరచెరువు, హబ్సీపూర్‌ ఊర చెరువులు ఉన్నాయి. ఆయా చెరువులకు అనుసంధానం చేసే తూము పనులు
సాగుతున్నాయి.

చెరువుల్లోకి నీరు
కాలువలపై తూములు నిర్మించినప్పుడే చెరువులు, కుంటలు నిండే అవకాశముంటుంది. ప్రస్తుతం కాళేశ్వరంతోపాటు ఎస్సారెస్పీ నీరు నిండుగా ఉండడంతో నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు కాలువల అనుసంధానం ఎంతగానో ఉపయోగపడనుంది. ఇప్పటికీ పనులు కొనసాగుతుండడంతో చెరువుల్లోకి నీరు చేరే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీరు ఉంది కాబట్టి యాసంగి పంటకు నీరందించే సమయం వరకు పూర్తి చేస్తే రైతులకు సాగునీటి అవస్థలు తప్పనున్నాయి. అధికారులు నీరందించే దిశగా చర్యలు చేపట్టినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనుల్లో జాప్యం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

డిసెంబరు 15లోగా పూర్తి చేస్తాం
                  - చక్రునాయక్‌, డీఈఈ, ఎస్సారెస్పీ
తూముల పనులు కొనసాగుతున్నాయి. డిసెంబరు 15లోగా పూర్తి చేసి కాలువల ద్వారా చెరువుల్లోకి నీటిని మళ్లిస్తాం. ఒకవేళ పనులు పూర్తి కానప్పటికీ నేరుగా చెరువులోకి నీటిని నింపేలా ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సాగు నీరు అందించేందుకు చర్యలు చేపడుతాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.