close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

అనిశా అస్త్రం

ఎర వేసి పట్టిస్తున్న బాధితులు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఖమ్మం నేరవిభాగం, పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

* కేసుల నమోదులో హైదరాబాద్‌ రేంజ్‌ తర్వాత స్థానం ఖమ్మందే.

* మూడేళ్లలో చిక్కిన కేసుల్లో అత్యధికం రెవెన్యూ శాఖలోనివే.

పథకం మంజూరుకు లంచం.. పనిజరగాలంటే లంచం.. చేసిన పనికి బిల్లులు రావాలన్నా లంచం.. పైసా లేనిదే దస్త్రం కదలదు.. ప్రభుత్వ శాఖల్లో ఇంతలా పెనవేసుకుపోయిన అవినీతి ఊడలను నేను సైతం అంటూ పెరికివేస్తున్నారు. సామాన్యుడి నుంచి బాధితుల వరకు లంచావతారులను అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు పట్టిస్తూ ఆటకట్టిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తూ ఆపన్నులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. జనచైతన్యం వెల్లివిరుస్తుండటంతో ఏటేటా కేసుల నమోదు పెరుగుతోంది.

* గత అక్టోబర్‌ 10న కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల సీఈ ఆనందం గుత్తేదారు నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డాడు. అప్పటి వరకు ఆధ్యాత్మిక కార్యాలను చేపట్టడం, వాటిలో పాల్గొనడం చేసిన సీఈ.. ఒక్కసారిగా పట్టుబడ్డారన్న వార్త, విద్యుత్‌సౌధ అధికారులతో పాటు కార్మికులను ఉలిక్కిపడేలా చేసింది.

ఈనెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అనిశాను ఆశ్రయించిన బాధితులు, పట్టుకున్న కేసుల వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.

ఉమ్మడి జిల్లాలో వొెలుగు చూసిన సంఘటనలు ఇలా..

2017  4

2018  11

2019  17

అవినీతికి తావు లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఆగడంలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంఘటనలు నిరూపిస్తున్నాయి. అక్రమ సంపాదనకు వెంపర్లాడే వారు కొందరుంటే.. అక్రమ మార్గంలో తమ పనులు కానిచ్చేందుకు లంచం ఎర చూపుతున్న వ్యక్తులు మరి కొందరు.. ఏదేమైనా లంచాలు ఇచ్చినా పుచ్చుకున్నా నేరంగానే పరిగణిస్తుంది అవినీతి నిరోధకశాఖ. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ఆ శాఖ బాధ్యత కీలకం. లంచావతారాలను నయాన భయాన కట్టడి చేసేందుకు ఆ శాఖ కసరత్తులు చేస్తోంది. ప్రజలు తమ హక్కుల కోసం చేసే ప్రయత్నాల్లో ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అవగాహన కల్పిస్తుంది. అవినీతికి పాల్పడే వారి వివరాలను తమకు తెలియజేయాలని ఆ విభాగం అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్‌లో ప్రతి ఏడాది వారోత్సవాల పేరుతో ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు.

పెరిగిన చైతన్యం.. గత మూడేళ్లలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అవినీతిని ప్రతిఘటించే చైతన్యం పెరిగింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. మూడేళ్లలో 32 మంది అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. లంచాల పేరుతో వేధింపులకు గురైన అనేక మంది ధైర్యంగా తాము పడుతున్న ఇబ్బందులను ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పక్కా వ్యూహంతో రంగంలోకి దిగి అవినీతి పరుల ఆటకట్టించారు. రాష్ట్రంలో పాత జిల్లాల పేరుతో అవినీతి నిరోధక శాఖ రేంజ్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ తర్వాత ఖమ్మం రేంజ్‌లో కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది రెవెన్యూశాఖ 7, పంచాయతీరాజ్‌శాఖలో 2, అటవీశాఖ, మహిళా సమాఖ్య, విద్యుత్తుశాఖ, రిజిస్ట్రేషన్లశాఖ, కేటీపీఎస్‌, మున్సిపాలిటీ, వైద్యారోగ్యశాఖ, నీటి పారుదలశాఖల్లో లంచావతారులు ఏసీబీకి చిక్కారు. వీరిలో సాధారణ ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఉండటం విశేషం.

మచ్చుకు కొన్ని..

* నవంబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాందాస్‌కుమార్‌ కంటి వెలుగుకు సంబంధించిన నిధులను ఓ పీహెచ్‌సీకి విడుదల చేసేందుకు లంచం డిమాండ్‌ చేశాడు. దిక్కుతోచక పీహెచ్‌సీ సిబ్బంది అనిశాను ఆశ్రయించారు. రూ.20వేలు లంచం తీసుకుంటు పట్టుబడిన ఘటన యావత్తు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందిని విస్మయానికి గురి చేసింది.

* నవంబర్‌ 28: భద్రాచలం తహసీల్దారు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నర్సింహరావు ఓ బైక్‌ మెకానిక్‌కు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.వెయ్యి లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు.

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. లంచాల పేరుతో వేధింపులకు గురై తమ పనులు సకాలంలో కావడంలేదని అనిశాను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అధికారులకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ విభాగం బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ అవినీతిపరుల పనిపడుతున్నారు. బాధితులు ఇచ్చే సమాచారం ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అక్రమార్కుల గుట్టును రట్టుచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో సాంకేతిక పరంగా సాక్ష్యాధారాలు రూపొందించి నిందితులను పట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిర్యాదుదారుల సమాచారంలో గోప్యత పాటిస్తున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భరోసా కల్పిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉండటంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని అనేక మంది ఖమ్మం రేంజ్‌లో ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.

అవినీతిని ఊపేక్షించకండి

రమణమూర్తి, ఖమ్మం రేంజ్‌ అధికారి

అవినీతిని ఊపేక్షించకండి. బాధితులు అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు రండి. జిల్లాలో కొందరు చేసిన ధైర్యం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఫలితంగా ఖమ్మం రేంజ్‌ పరిథిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఫిర్యాదుదారుల సహకరిస్తే లంచావతారుల ఆట కట్టించే అవకాశం ఉంటుంది.

ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు

టోల్‌ఫ్రీ: 1064

రేంజ్‌ కార్యాలయం: 94404 46147

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.