ఆదివారం, డిసెంబర్ 08, 2019
హైదరాబాద్: పాలకులకు మన్నించే గుణం ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీలో 70శాతం మంది నిరుపేదలున్నారని చెప్పారు. మన్నించే గుణంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే కార్మికులంతా రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే కార్మికులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వస్తే అందరికీ విద్య లభిస్తుందని భావించారని కానీ, ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. భూ ప్రక్షాళనతో రెవెన్యూ శాఖ, రైతుల మధ్య దూరం పెరుగుతోందని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెట్రోల్ చల్లుతున్నారని చాడ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన చెందారు. వాస్తవ ప్రక్షాళన చేస్తే భూ దొంగలు బయట పడతారని ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే అఖిలపక్షాన్ని పిలిపించి రెవెన్యూ వ్యవస్థపై చర్చ జరపాలని చాడ డిమాండ్ చేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు