శుక్రవారం, డిసెంబర్ 06, 2019
పంజాగుట్ట: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. అందుకు ఇంజినీర్లు కఠినమైన చట్టాలు తెచ్చేందుకు ప్రభుత్వానికి సూచనలు, సలహాల నివేదికలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ‘ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ కీ ఛాలెంజ్-2 సస్టైనబుల్ డెవలప్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల మొక్కలను నాటించారన్నారు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం ఓ ఫ్యాషన్‌గా మారిందని భోజనం కూడా ప్లాస్టిక్ స్పూన్లతో తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటింటికి నీరందించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి 14 రోజులకు ఒకసారి నీరందేదని.. అలాంటిది రోజూ నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
నగరంలో 2500 చెరువులు, నాలాల కబ్జాకు గురైతే కేటీఆర్ పురపాలక మంత్రి అయ్యాక మిషన్ కాకతీయ పథకం ద్వారా ఎన్నో చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రజా అవసరాల కోసం ఎన్నో చెరువులు, కుంటలను పునరుద్ధరించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పూర్తిస్థాయిలో కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే పార్లమెంటులో ప్రధానిని కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాలు అమలు చేసేందుకు కృషి చేయాలని ఇంజినీర్లను కోరారు. ముఖ్యమంత్రి పర్యావరణ వేత్త.. రైతు అని ఆయన కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన వాతావరణం కోసం 350 ఎకరాల్లో పెద్ద పార్కును ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం జలమండలి ఎండీ దాన కిశోర్ మాట్లాడుతూ.. నేడు మానవాళికి పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యాల్యూమ్ను ఆవిష్కరించారు. గతంలో 70 శాతం నీరు సముద్రంలో వృథాగా పోయేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో రిజర్వాయర్లు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఐ(ఇండియా) మాజీ ఛైర్మన్ సిసీర్ కుమార్ బెనర్జీ, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ కార్యదర్శి డా. రామేశ్వరరావు, కార్యదర్శి అంజయ్య, వాటర్ బోర్డు స్టేటజీ డివిజన్ ఎన్‌జేఎస్ టోక్యో జపాన్ లిమిటెడ్ ప్రతినిధి ఠాఖా యుకీసవాయి, ఐఈఐ మాజీ ఛైర్మన్ హన్మంతాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఛైర్మన్ రామేశ్వరరావు జ్ఞాపికతో సత్కరించారు. ఈ సదస్సు మరో రెండు రోజులపాటు కొనసాగనుందని తెలిపారు. ఈ అంశాలపై నిపుణులు అందించిన పవర్‌పాయింట్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, సంబంధిత శాఖలకు నివేదికలను అందజేస్తామని రామేశ్వరరావు తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు