close

ప్ర‌త్యేక క‌థ‌నం

అవిశ్రాంత రహదారి

వాహనదారులకు విశ్రాంతి మందిరాలు ఎక్కడ?
ఐదేళ్ల కిందటే ప్రతిపాదించినా ఫలితం శూన్యం
మూడుచోట్ల ఏర్పాటు చేయలని నిర్ణయం
స్థలం సిద్ధంగా ఉన్నా అమలుకాని ప్రతిపాదన
రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 98 మంది మృతి
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికారుల నిర్లక్ష్యం వల్ల బాహ్యవలయ రహదారి (అవుటర్‌) ప్రమాదాలకు నిలయంగా మారింది. గత రెండేళ్లుగా 98 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 158 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుపై ఎక్కడా విశ్రాంతి మందిరాలు కానీ, మూత్రవిసర్జన కేంద్రాలు కాని లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అయినా ఇది నిజం! ఒకసారి రోడ్డెక్కితే మూత్రవిసర్జనకు ఎక్కడా అవకాశం కూడాలేదు. మళ్లీ రోడ్డు దిగేవరకు ఉగ్గబట్టుకోవలసిందే. పదేళ్ల కిందటే ఈ రోడ్డుపై మూడుచోట్ల విదేశీ తరహాలో అత్యాధునిక షాపింగ్‌ మాల్స్‌తో కూడిన విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు. ఫలితంగా అనేకమంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన వాహనాలను ఆపడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సుదూర మార్గాల్లో ప్రతి 60 కిలోమీటర్లకు ఒక విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమైన వాహనదారులు వాటిలో విశ్రాంతి తీసుకుని ముందుకు కదిలేలా ఏర్పాట్లు ఉండాలి.

 

స్థలం అందుబాటులో ఉన్నా..

మూడుచోట్ల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ వాహనదారుల కోసం విశ్రాంతి మందిరాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు, హోటల్స్‌, క్రీడా వినోద కేంద్రాలు, ఆటోమొబైల్‌, మల్టీపర్పస్‌ హాళ్లు.. ఇలా అక్కడ సకల సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని అనుకున్నారు. సాధ్యాసాధ్యాలపై పరిశీలన బాధ్యతను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించగా సానుకూలంగా నివేదిక ఇచ్చింది. ప్రయోగాత్మకంగా ఒకచోట తామే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన పైళ్లలోనే నానుతోంది. పీపీపీ కింద బొంగులూరులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా ఇప్పటి వరకు దీనిపై ఏర్పాట్లు మొదలుకావడం లేదు. ప్రతిపాదన పైళ్లలోనే నానుతోంది. పీపీపీ కింద బొంగులూరులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా కూడా ఇప్పటి వరకు దీనిపై పూర్తిస్థాయిలో అధికారులు ముందుకు కదలడం లేదు.

అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రారంభమై పదేళ్లు
రింగ్‌ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు
మొత్తం వరసలు 8
ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు రోజుకు లక్ష
ప్రయాణించే వారు దాదాపు 5 లక్షలు
ఇంటర్‌ ఛేంజ్‌లు 19

రక్తమోడుతున్న రోడ్డు

రోడ్డు పక్కగా వాహనాలు నిలపడానికి ఒక వరస ఉన్నా అక్కడ వాహనం ఆపి మూత్రవిసర్జన చేయడానికి ఏర్పాట్లు లేవు. తప్పనిసరై కొందరు రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా వాహనాలను ఆపుతున్నారు. అలాంటిచోటే ప్రమాదాలు జరుగుతున్నాయి. విశ్రాంతి మందిరాలు లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండడంలేదు. ఇది కూడా ప్రమాదాలకు ఓ కారణం.

ఆగి ఉన్న వాహనాలతో ముప్పు
గత రెండేళ్లలో రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకుపోయే వాహనాలు రోడ్డు పక్కన ఆపిన వాహనాలను ఢీకొనడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.
విశ్రాంతి లేక నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొనడం వల్ల మరికొంతమంది చనిపోయారు.
డ్రైవర్లకు విశాంత్రి లేకపోవడం, అతి వేగం ప్రమాదాలకు కారణమని పోలీసు విశ్లేషణలో తేలింది.

 

సొంతంగా చేపడితే బోలెడు ఆదాయం!
ఈ రోడ్డులో మూడుచోట్ల హెచ్‌ఎండీఏనే అన్ని వసతులతో విశ్రాంతి మందిరాలను నిర్మిస్తే ప్రయాణికులు సేద తీరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా వస్తుంది. బల్దియా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఒక్కచోటైనా ప్రయోగాత్మకంగా విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఐదేళ్ల కిందటే ప్రతిపాదనలు
విదేశాల్లోని అవుటర్‌ రింగ్‌రోడ్లను పరిశీలించిన హెచ్‌ఎండీఏ అధికారులు తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్‌పేట ప్రధాన జంక్షన్ల దగ్గర భారీ విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందటే ప్రతిపాదించారు.

 

పీపీపీ కింద ఏర్పాటుకు యత్నం
మూడుచోట్ల విశ్రాంతి మందిరాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి తుది అనుమతి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటిదశలో ఒకచోట ప్రైౖవేటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.

-బీఎల్‌ఎన్‌ రెడ్డి, సీఈ, హెచ్‌ఎండీఏ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.