close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఐఎండీది వాతావరణమే 

అంచనాల్లో కచ్చితత్వం ఇప్పటికీ కరవే!

మనదేశాన్ని 5 రీజియన్లుగా విభజించి ఐఎండీ హెచ్చరికలు చేస్తోంది. 29 రాష్ట్రాలు, వివిధ వాతావరణ జోన్లు కలిగిన దేశమంతటికీ ఒకే హెచ్చరిక ఎంతమాత్రం నప్పదనేది వాతావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి స్థితిని సకాలంలో అంచనావేయలేని పరిస్థితి.

వాతావరణాన్ని విస్పష్టంగా అంచనా వేయడంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కొన్నేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించట్లేదు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నా.. అంతర్జాతీయ సంస్థల అంచనాలతో పోల్చుకుంటే మాత్రం అది ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రియల్‌టైం గవర్నెర్స్‌తో పాటు, దేశంలోని కొన్ని ప్రైవేటు సంస్థల అంచనాలు ఐఎండీ కన్నా ఎంతో మెరుగ్గా ఉంటున్నాయి. అత్యంత పురాతనమైన గణాంక పద్ధతుల్ని(స్టాటిస్టికల్‌ మోడల్‌) వినియోగించ[డం వల్ల- తుపాన్లపై తాజా హెచ్చరికలు చేయడంలో ఐఎండీ కొన్నేళ్లుగా విఫలమవుతూ వస్తోంది. వాతావరణ ఉపగ్రహాల సమాచారం మరింతగా చేరువవడం, అత్యధిక పౌనఃపుణ్యం కలిగిన గ్లోబల్‌ డెటర్మినిస్టిక్‌ వెదర్‌ ప్రిడిక్షన్‌ మోడల్‌ను ఐఎండీ తాజాగా వినియోగంలోకి తేవడం వల్ల ఇప్పుడిప్పుడే కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

కొంప కూలుస్తున్న వాతావరణ మార్పులు 

వాతావరణం, వర్షపాతం తీరుతెన్నులు ఎప్పటికప్పుడు గణనీయంగా మారుతుండడం వల్ల వాతావరణ అంచనాలు ఐఎండీకి కత్తిమీద సాము అవుతున్నాయి. ఎండాకాలంలో ఏర్పడే రుతుపవనాల వల్ల మన దేశంలో దాదాపు 80 శాతం మేర వర్షం కురిసేది. రానురానూ ఈ పరిస్థితి మారి.. జులై-ఆగస్టు నెలల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. డిసెంబరు నెలలో తుపాన్లు రావడం గత 126 ఏళ్లలో ఇది నాలుగోసారి.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులు పెను తుపాన్ల(హరికేన్ల)కు మరింతగా కారణమవుతున్నాయి. 2017లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 పెను తుపాన్లు వచ్చాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగడం దీనికో ప్రధాన కారణం. గత వందేళ్లలో భూతలం, సముద్ర ఉష్ణోగ్రతలు దాదాపు 1 డిగ్రీ సెంటీగ్రేడు పెరిగాయి. దీనివల్ల హరికేన్లు ఎక్కువయ్యాయి. వాటి సీజనూ మారుతోంది. ఎల్‌నినో, లానినోలు సంభవిస్తున్నాయి. భారత్‌లో సహజంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించే తుపాన్లు డిసెంబరు నెలలో కూడా రావడం మారుతున్న వాతావరణ పరిస్థితులకు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైఫల్యం ఎందుకంటే... 

‘‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వాతావరణం, అంతకుముందు ఏడాది వాతావరణ సమాచారం సగటు(స్టాటిస్టికల్‌ మోడల్‌) ఆధారంగా అంచనాలుకట్టే విధానాన్ని ఐఎండీ పాటిస్తోంది. తీవ్రంగా, హఠాత్తుగా సంభవించే వాతావరణ మార్పుల్ని ఇది పసిగట్టలేదు. అదే అమెరికా, బ్రిటన్‌ వాతావరణ సంస్థలు గ్లోబల్‌ సర్కులేషన్‌ మోడల్‌(జీసీఎం)ను వినియోగిస్తున్నాయి. ఏ రోజుకు ఆ రోజు మారే వాతావరణ పరిస్థితుల్ని సైతం గుర్తించి అంచనాలు కట్టే క్రియాశీలత జీసీఎంకు ఉంది. అందువల్ల దాని అంచనాలు చాలా దగ్గరగా ఉంటాయి.’’

- పి.వి. జోసెఫ్‌, ఐఎండీ మాజీ డైరెక్టర్‌
 

 


బ్రిటన్‌ సహకారంతో కొత్త దారుల్లోకి.. 

వాతావరణ అంచనాల్లో వైఫల్యాల్ని అధిగమించడం కోసం ఐఎండీ తాజాగా బ్రిటన్‌తో జట్టుకట్టింది. బంగాళాఖాతంలో సముద్ర వాతావరణ తీరుతెన్నుల్ని రెండు దేశాల శాస్త్రవేత్తలు అంచనావేస్తారు. రుతుపవనాల సమయంలో సముద్రంలో పరిస్థితులు, తీవ్రత ఎలా ఉంటాయనే దానిని అంచనావేయడానికి యూనివర్సిటీ ఆఫ్‌ ఆంగ్లియా(యూఈఏ) శాస్త్రవేత్తలు బంగాళాఖాతం సముద్ర గర్భంలోకి ఏడు రోబోలను పంపుతారు. యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌, సౌత్‌ఆంప్టన్‌లోని నేషనల్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఓసీ), ఐఎండీ శాస్త్రవేత్తలు దీనికి సహకరిస్తారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లోని దాదాపు 250 మైళ్ల పరిధిలో డేటాను సేకరించి.. దానిని మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా రెండు నెలల పాటు రోజూ బ్రిటన్‌కు పంపి విశ్లేషిస్తారు. అదే డేటాను యూఈఏ, ఎన్‌ఓసీలు కూడా విశ్లేషిస్తాయి. భారత భాగస్వాములు సైతం అత్యంత అధునాతన విమానాన్ని(ఫెసిలిటీ ఫర్‌ ఎయిర్‌బోర్న్‌ అట్మాస్ఫియరిక్‌ మెజర్‌మెంట్స్‌(ఎఫ్‌ఏఏఎం) వినియోగించి వాతావరణ అంచనాలు కడతారు. ఈ ప్రక్రియ మున్ముందు వాతావరణంపై కచ్చితమైన లెక్కలు కట్టడానికి ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.73 కోట్లు వెచ్చిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.