close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రతిభామూర్తులకు పద్మాభిషేకం
విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రీకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలాగే హైదరాబాద్‌లో చదివి, అమెరికాలో స్థిరపడిన టెక్‌ దిగ్గజం శంతను నారాయణ్‌కు ప్రవాస భారతీయుల కోటాలో పద్మశ్రీ లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 94 మందికి కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటించింది.

అక్షరానికి ‘పద్మా’లంకారం

అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి, పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి, తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. సరసం, శృంగారం, వేదన, ఆర్ద్రత, ఆలోచన... ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమైన’ ప్రయాణం ఆయనది. ‘అమృతగానమది అధరముదా, అమితానందపు యదసడిదా’ అని ఆశ్చర్యపరిచిన గీత రచన ఆయనది. ఆయన పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం... అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు.

చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జన్మించారు సీతారామశాస్త్రి. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్‌.బి.బి.ఎస్‌ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్‌.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తొలి చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

సినిమా గేయ రచనే నాకు ఊపిరి. తెలుగు సినీ పరిశ్రమ మరో జన్మనిచ్చింది. పద్మ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. ఇది తెలుగు సినీరంగానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. హృదయం స్పందించేలా రాస్తే పసిపాప మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆస్వాదిస్తారు.

-‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.

 

చదరంగ రాణి

ద్రోణవల్లి హారిక.. చెస్‌ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. పసి ప్రాయంలోనే చెస్‌ ఆడటం మొదలుపెట్టిన హారిక.. అండర్‌-9 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసింది. 20 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ అయిన హారిక.. ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్యాలు (2012, 15, 17) సాధించింది. 2016లో మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీ విజేతగా నిలిచింది.

ఫుట్‌బాల్‌ఆటలో మేటి

భారత ఫుట్‌బాల్‌లో మరే క్రీడాకారుడికీ సాధ్యం కాని ఘనతలందుకున్న ఆటగాడు సునీల్‌ ఛెత్రి. వంద అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడు ఛెత్రినే. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే కాదు.. ఏకంగా 67 గోల్స్‌ కూడా సాధించాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో (85 గోల్‌్్స) తర్వాతి స్థానం అతడిదే. ఇటీవలే మెస్సి (65)ను అతను అధిగమించాడు. కెప్టెన్‌గా, జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో ఏళ్లుగా భారత ఫుట్‌బాల్‌కు పర్యాయ పదంలా నిలుస్తున్న ఛెత్రి.. దేశానికి ఎన్నో విజయాలందించాడు.

రైతునేస్తాన్ని వరించిన పురస్కారం

రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తోన్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.

యడ్లపల్లి ‘రైతునేస్తం వెంకటేశ్వరరావు’గా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సుపరిచితులు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడులో 1968లో జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టి, వ్యవసాయం చేస్తూ పెరిగిన వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రైతునేస్తం ఫౌండేషన్‌ స్థాపించి, 12 ఏళ్లుగా ఆదే పేరుతో వ్యవసాయ మాసపత్రిక నడుపుతున్నారు. ఈ క్రమంలో పశునేస్తం, ప్రకృతినేస్తం పత్రికలు ప్రారంభించి రైతులకు చేరువయ్యారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా.ఐవీ సుబ్బారావు పేరుతో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, వ్యవసాయ పాత్రికేయులను ఏటా రైతునేస్తం పురస్కారాలతో గౌరవిస్తున్నారు.

వారం వారం శిక్షణ తరగతులు..
కొంత కాలంగా రైతునేస్తం ఫౌండేషన్‌ ద్వారా ప్రతి ఆదివారం కొర్నేపాడులో రసాయన రహిత సేద్యం, మిద్దెతోట, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, సేంద్రియ ఉత్పత్తుల అవసరం.. తదితర అనేక అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీటికి తోడు పలు గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఈ అవార్డు రైతాంగానికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. రసాయనిక సాగు నుంచి సేంద్రియ సాగు వైపునకు రైతులు మరలేందుకు మరింతగా కృషి చేస్తా.

- యడ్లపల్లి వెంకటేశ్వరరావు

- న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌, గుంటూరు, వట్టిచెరుకూరు

ఆణిముత్యాలు.. ఆత్మబంధువులు

భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన వారిలో తెర వెనుక కథానాయకులెందరో ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజాసేవే పరమార్థంగా వివిధ రంగాల్లో తమ జీవితాలను ధారపోస్తున్న ఆణిముత్యాల్లాంటి వ్యక్తులున్నారు. అలాంటి కొందరి సంక్షిప్త విశేషాల సమాహారం.

సాలుమరద తిమ్మక్క  (కర్ణాటక)
వయసు: 106
రంగం: సామాజిక సేవ (పర్యావరణం)
ఒంటరిగానే వేలాది మొక్కలు నాటి వాటిని సొంత పిల్లల్లా పెంచారు
* గత 65 ఏళ్లుగా వేలాది చెట్లను సంరక్షించారు.
* నెలకు 8,000 కి.మీ. మేర దేశమంతటా ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కలిగించారు.

 

డాక్టర్‌ సెరింగ్‌ నోర్బూ (జమ్ము-కశ్మీర్‌)
వయసు: 74    రంగం: వైద్యం
* గత 50 ఏళ్లుగా జమ్ము-కశ్మీర్‌ రాష్ట్రంలోని లద్దాఖ్‌ ప్రాంతానికి చెందిన మారుమూల గ్రామాలు, కొండప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు
* గత 50 ఏళ్లుగా ఏటా 500 ఆపరేషన్లు చేస్తున్నారు.
* లద్దాఖ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్షన్‌ అనే సంస్థ వ్యవస్థాపక సభ్యునిగా, గౌరవ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
* కేంద్ర ప్రభుత్వంనుంచి ఉత్తమ గ్రామీణ సర్జన్‌ అవార్డు అందుకున్నారు.

 

తావో పోర్చోన్‌- లించ్‌ (అమెరికా)
వయసు: నూరేళ్లు
రంగం: యోగా- ఔషధం
* యోగా ద్వారా వయసుకు అతీతమైన దేహాన్ని, కాలమెరుగని మనసును సృష్టించిన మహిళ
* వందేళ్ల వయసున్న యోగా శిక్షకురాలు. రచయిత. మాజీ నటి.
* అమెరికాలో యోగా శిక్షకుల సంఘాన్ని; వెస్ట్‌చెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగాను స్థాపించారు.
* ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన యోగా ఉపాధ్యాయురాలిగా 2012లో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. అమెరికా, ఫ్రాన్స్‌  సహా ప్రపంచ వ్యాప్తంగా 43 ఏళ్లుగా యోగాను బోధిస్తున్నారు. 1,500 మంది యోగా శిక్షకులను తయారు చేశారు.88 ఏళ్ల వయసులో బాల్‌రూమ్‌ డాన్స్‌ నేర్చుకున్నారు.

 

ఫ్రెడిరైక్‌ ఇరినా బ్రునింగ్‌ (జర్మనీ)
వయసు: 59  రంగం: సామాజిక సేవ (పశు సంరక్షణ)
* 23 ఏళ్లుగా గోశాల నడుపుతూ 1,200 ఆవుల సంరక్షణ చూస్తున్నారు
* మధురలో సురభి గౌసేవ నికేతన్‌ను ప్రారంభించారు
* అనారోగ్యానికి గురయిన వేలాది ఆవులను ఆదుకున్నారు
* వీధుల్లో తిరిగే ఆవులను గోశాలకు తీసుకొస్తుంటారు
* నెలకు రూ.22 లక్షల వరకు వెచ్చిస్తున్నారు
ఆమెను సుదేవి మాతాజీ అని  పిలుస్తారు

 

దయితారి నాయక్‌ (ఒడిశా)
వయసు: 75 ఏళ్లు
రంగం: సమాజ సేవ
* కొండలపై నుంచి పారే నీటిని పొలాలకు మళ్లించేందుకు 3 కి.మీ. కాలువను ఆయన ఒక్కరే తవ్వారు.
* ఇందుకోసం పార, పలుగు ఉపయోగించి నాలుగేళ్లు శ్రమించారు.
* బైతరణీ గ్రామం చుట్టూ ఉన్న వంద ఎకరాలకు నీళ్లు చేరాయి. ఇప్పటికీ అక్కడ నీటి కొరత లేదు.

 

మహమ్మద్‌ హనీఫ్‌ ఖాన్‌ శాస్త్రి (దిల్లీ)
వయసు: 67
రంగం: సాహిత్యం, విద్య
* ప్రాచీన భారత శ్లోకాల ఆధారంగా తాను రాసిన పుస్తకాలు, పద్యాల ద్వారా హిందూ-ముస్లిం మత సామరస్యానికి ఎనలేని కృషి.
* సంస్కృత, హిందీ భాషావేత్త
* ప్రాచీన భారత శ్లోకాలపై 8 పుస్తకాలు, 700 పద్యాలు రాశారు.
* 2009లో జాతీయ మత సామరస్య అవార్డు గ్రహీత.

 

దేవరాపల్లి ప్రకాశ్‌రావు (ఒడిశా)
వయసు: 59
రంగం: ప్రజాసేవ
* టీ విక్రయంతో వచ్చిన సంపాదనతో మురికివాడల చిన్నారులకు ఆయన విద్య, ఆహారం అందిస్తున్నారు.
* ఆదాయంలో సగం మొత్తాన్ని వెచ్చించి కటక్‌లో ‘ఆశా ఓ ఆశ్వాసన’ అనే పాఠశాలను నిర్వహిస్తున్నారు.
* ఏడో సంవత్సరం నుంచే పనిచేస్తున్న ఆయన పక్షవాతం (లోయర్‌ టార్సో పెరాలసిస్‌)తో బాధపడుతున్నారు.
* 1978 నుంచి 200 సార్లుకు పైగా రక్తదానం చేశారు. ఏడుసార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేశారు.

శాంతికాముకుడు కులదీప్‌ నయ్యర్‌

మానవహక్కుల ఉల్లంఘనలపై విస్ఫులింగమై నిప్పులు చెరిగిన పాత్రికేయుడు కులదీప్‌ నయ్యర్‌ ....శాంతికాముకుడిగా కూడా అంతే ప్రసిద్ధుడు.  ఎమర్జెన్సీ సమయంలో ‘ది స్టేట్స్‌మన్‌’ పత్రిక సంపాదకుడిగా ఉన్న సమయంలో ఏకంగా నాటి ఇందిరాగాంధీ సర్కారుపై నిర్భయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన అరెస్టుకూ దారితీశాయి. ఉర్దూ దినపత్రికతో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన కులదీప్‌ నయ్యర్‌ తర్వాత ఆంగ్లపత్రికలకు మారారు. 1923లో సియాల్‌కోట్‌లో జన్మించిన ఆయన వర్తమాన రాజకీయాలపై నిష్కర్షగా వ్యాఖ్యానాలు రాసేవారు. అన్నాహజారే ఉద్యమాన్ని గట్టిగా సమర్థించారు. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో పాక్‌సైనిక అత్యాచారాలకు క్షమాపణ చెప్పనందుకు ఆయన పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు.  ఇటు భారత్‌లో...అటు పాకిస్థాన్‌లో అన్యాయాలపై విరుచుకుపడిన ఆయన ఉభయదేశాల్లోనూ శాంతిని ఆకాంక్షిస్తూ అంతే తీవ్రంగా ప్రయత్నించారు. రెండు దేశాలు చక్కని ఇరుగుపొరుగులా ఉండాలని తపించిపోయారు. 2018లో దిల్లీలో ఆయన మరణించారు.

సౌరభాల సినీ పద్మాలు

కేంద్రప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో పలువురు సినీ ప్రముఖులకు చోటు కల్పించింది. ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‌లాల్‌కు ‘పద్మ భూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా పాటను తన అక్షరాలతో సుసంపన్నం చేసిన ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు ప్రముఖ డ్యాన్సర్‌ ప్రభుదేవా, డ్రమ్స్‌ వాయిద్యకారుడు శివమణి, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, బాలీవుడ్‌ నటులు ఖాదర్‌ ఖాన్‌, మనోజ్‌ బాజ్‌పాయిలకు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్నారు.

వన్నె తరగని నటుడు
పాత్ర ఏదైనా సరే... అందులో జీవిస్తారు మోహన్‌లాల్‌. మాస్‌ కథానాయకుడిగా ఆయనకి కొండంత ఇమేజ్‌ ఉన్నా... తెరపై పాత్రలే కనిపిస్తాయి తప్ప మోహన్‌లాల్‌ ఏ కోశానా కనిపించరు. మలయాళ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ఆయన అక్కడికే పరిమితం కాలేదు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొన్నారు. అసమాన నటనా పటిమని ప్రదర్శించి నటుడిగా, నిర్మాతగా ఐదు జాతీయ పురస్కారాల్ని అందుకొన్న ఆయన, భారతప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ అందుకొన్నారు. ఇప్పుడు ఆయన కీర్తికిరీటంలో పద్మభూషణ్‌ కూడా చేరింది. 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఆయన అభిరుచిగల నిర్మాతగా, గాయకుడిగా కూడా పేరు తెచ్చుకొన్నారు.

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌
ప్రభుదేవా... ఈ పేరు వినిపిస్తే గుర్తుకొచ్చేది డ్యాన్సే. భారతీయ సినిమా డ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఒరవడిని తీసుకొచ్చిన నృత్య దర్శకుడు... ప్రభుదేవా. ‘చికు బుకు చికు బుకు రైలే...’ పాటలో ఆయన వేసిన డ్యాన్స్‌ చూసి ‘ఒంట్లో ఉన్నవి నరాలా లేక స్ప్రింగులా?’ అంటూ ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. ప్రేక్షకులు ఆయనకు ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ అని బిరుదునిచ్చారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆయనకి ‘పద్మశ్రీ’ గౌరవాన్ని ప్రకటించింది. 33 యేళ్లుగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న ప్రభుదేవా తాను డ్యాన్స్‌ వేయడమే కాదు... నృత్య దర్శకుడిగా కథానాయకులతోనూ నృత్యాలు వేయిస్తూ వారి అభిమానుల్ని మురిపించారు.

సంగీత సునామీ శివమణి!
వాయిద్యాలు ఆయనకు దాసోహం అంటాయి... శబ్దాలు ఆయన దగ్గర శివమెత్తి ఆడతాయి... ఆయన సంగీత ప్రయోగాలలో శాస్త్రవేత్త... స్వరాల సమ్మేళనంతో ఆడుకునే మంత్రవేత్త... సినిమా కార్యక్రమమైనా, అంతర్జాతీయ విభావరైనా ఆయన వేదిక మీద ఉంటే ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. ఆయనే శివమణి. అందరూ ఆయన్ని ‘డ్రమ్స్‌మణి’ అంటారు. ఇప్పుడు ఆయన ‘పద్మశ్రీ’ శివమణి. రకరకాల వాయిద్యాలతో వినూత్నమైన శబ్ద ప్రపంచంలోకి తీసుపోగలిగే సంగీత సునామీ ఆయన. మద్రాసులో 1959లో పుట్టిన శివమణి ఏడేళ్లకే డ్రమ్స్‌ను అలవోకగా వాయించేవాడు. పదకొండేళ్లకల్లా వేదికల మీద కచేరీల్లో మెరిశాడు.

సుమధుర గానానికి గౌరవం
ఐదేళ్ల వయసులోనే వీణ నేర్చుకుని, చిన్నతనంలోనే సంగీతాన్ని అభ్యసించిన కుర్రాడు స్వరాల బాటలోనే ఎదిగి గాయకుడిగా, స్వరకర్తగా శ్రోతలను ఉర్రూతలూగించాడు. అతడే శంకర్‌ మహదేవన్‌. బాలీవుడ్‌ సినిమాల్లో ఆయన అందించిన సినీ గీతాల శ్రావ్యత, ఇప్పుడు ‘పద్మశ్రీ’తో పరిమళం కూడా అద్దుకుంది. ముంబైలోని చెంబూర్‌లో తమిళ అయ్యర్ల కుటుంబంలో 1967లో పుట్టిన శంకర్‌ మహదేవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయినా స్వరాల ప్రయాణాన్నే కొనసాగించాడు. ఉత్తమ గాయకుడిగా, స్వరకర్తగా నాలుగు జాతీయ పురస్కారాలు సహా ఎన్నో అవార్డులు అతడి సొంతం.

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు
‘ప్రేమ కథ’, ‘హ్యాపీ’, ‘పులి’, ‘వేదం’ తదితర తెలుగు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించిన బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయి. ఆయన్ని ‘పద్మశ్రీ’ వరించింది. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన ‘సత్య’తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఈ చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.  బిహార్‌లోని సాధారణ రైతు కుటుంబంలో 1969లో జన్మించిన మనోజ్‌ బాజ్‌పాయ్‌ కాలేజీలోనే థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరారు. ‘ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే అతికొద్దిమంది బాలీవుడ్‌ నటుల్లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఒకరు’’అనే పేరు బాజ్‌పాయికు ఉంది.

ప్రతి సూపర్‌హిట్‌లోనూ ఖాదర్‌ ఖాన్‌!
హిందీ చిత్ర సీమలో వైవిధ్యమైన పాత్రలను రక్తి కట్టించడంలోనే కాదు మాటల రచయితగానూ సత్తా చాటారు ఖాదర్‌ ఖాన్‌. బాలీవుడ్‌ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఖాదర్‌ ఖాన్‌ ఈ మధ్యే అనారోగ్యంతో కన్నుమూశారు. మరణానంతరం ఆయనకు ‘పద్మశ్రీ’ ప్రకటించింది కేంద్రం. 1973లో రాజేష్‌ ఖన్నా నటించిన ‘దాగ్‌’తో వెండితెరపై అడుగుపెట్టారు ఖాదర్‌. ‘సుహాగ్‌’, ‘ముజ్‌ సే షాదీ కరోగీ’, ‘లక్కీ:నో టైమ్‌ ఫర్‌ లవ్‌’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 1980-90ల్లో బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ప్రతి చిత్రంలోనూ ఖాదర్‌ ఏదో ఒక పాత్రలో నటించారు.

కుట్రను ఛేదించి సగర్వంగా నిలిచి..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో కీలక శాస్త్రవేత్తగా ఉన్న నంబి నారాయణన్‌ కొన్ని శక్తులు పన్నిన దుష్ట పన్నాగం వల్ల తన కెరీర్‌ను, జీవితాన్ని కోల్పోయారు. గూఢచర్యం లాంటి దారుణమైన కేసులో ఇరుక్కొని నానా ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. అయినా ధైర్యంగా ఎదుర్కొని తన నిజాయితీని, నిబద్ధతను చాటుకొని దేశం ముందు సగర్వంగా నిలబడ్డారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను రూపొందించాలనుకున్న ఇస్రో.. అందులో అవసరమైన క్రయోజెనిక్‌ పరిజ్ఞానంపై దృష్టి పెట్టింది. 1990లో ఈ సాంకేతికతను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అమెరికా ఒత్తిడితో రష్యా వెనక్కి తగ్గింది. దీంతో ఈ పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేయాలని ఇస్రో నిర్ణయించింది. నంబి నారాయణన్‌ నేతృత్వంలో 1994 ఏప్రిల్‌లో ఒక ప్రాజెక్టును చేపట్టింది. అయితే అదే ఏడాది అక్టోబర్‌లో కేరళ పోలీసులు మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించినప్పుడు పాకిస్థాన్‌ కోసం క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞానాన్ని బదిలీ చేసేలా తాను కొందరు ఇస్రో శాస్త్రవేత్తలను సంప్రదించినట్లు ఆమె చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నంబి నారాయణన్‌, శశికుమారన్‌ అనే మరో శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. రహస్య పత్రాలను పాక్‌కు అందజేశారని ఆరోపించారు. 50 రోజుల పాటు వీరిని జైల్లో ఉంచి మానసికంగా, శారీరకంగా హింసించారు. 1996లో ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. గూఢచర్యం ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చింది. పోలీసుల ఆరోపణలన్నీ ఉత్తుత్తవేనని పేర్కొంది. ఆ తర్వాత కూడా కేసును తిరగతోడటానికి కేరళ సర్కారు మరోసారి ప్రయత్నించింది. దీనిని సుప్రీం కోర్టు అడ్డుకుంది. మరోవైపు తన జీవితాన్ని నాశనం చేసిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని కేరళ సర్కారు పట్టించుకోలేదు. చివరికి గత ఏడాది సుప్రీం కోర్టు ఆయన విజ్ఞప్తిని మన్నించింది. తప్పుడు పద్ధతుల్లో నారాయణన్‌ను ఇరికించిన అధికారులపై చర్యలకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నారాయణన్‌కు అనుభవించిన మానసిక క్షోభకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కేరళ సర్కారును ఆదేశించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.