close

ప్ర‌త్యేక క‌థ‌నం

కోడి కొంచెం.. మేలు ఘనం

పేదరిక నిర్మూలనకు, ఉపాధి కల్పనకు కోళ్ల పెంపకం చేయూత

చికెన్‌.. ఈ మాట వినగానే మాంసం ప్రియుల్లో సర్వేంద్రియాలు చైతన్యం పొందుతాయి. మసాలా దట్టించి వండిన చికెన్‌ కర్రీ, ఫ్రై చేసిన లెగ్‌పీస్‌లు చవులూరిస్తాయి. ఆదివారం వచ్చిందంటే.. చికెన్‌ ముక్క లేనిదే ముద్ద దిగని వారు కోకొల్లలు. ప్రపంచంలో కోటానుకోట్ల మందికి నేడు ఇదో ఇష్టమైన ఆహారం. మనిషికి అవసరమైన మాంసకృత్తుల్ని(ప్రొటీన్లు) అందిస్తున్న కోడిని నేడు ప్రపంచం కొత్తగా చూస్తోంది. ఆర్థిక పురోభివృద్ధికి, పోషకాహార లోపం పరిష్కారానికి, పేదరిక నిర్మూలనకు సాధనంగా ఇది ఉపయోగపడుతోంది. 1990 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోడికూర వినియోగం దాదాపు 70% పెరిగింది. కోడిని లోకం ఇంతగా ప్రేమించడానికి కారణాలేమిటి? పేదరిక నిర్మూలనలో ఇది ఏ రకంగా ఉపయోగపడుతోంది? ప్రపంచానికి ఆహారంగా ఎలా మారింది? కోళ్ల పరిశ్రమగా ఎలా అభివృద్ధి చెందింది? చికెన్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?.. ఇత్యాది విషయాలపై ప్రత్యేక కథనం..

పూర్వకాలంలో కేవలం పోటీల కోసమే పెంచిన కోడి- నేడు పేదరిక నిర్మూలన, పోషకాహార కల్పన సాధనం. ఆర్థిక పురోభివృద్ధికి ఇంధనం. ఉపాధి కల్పనకు, మహిళా సాధికారితకు ఇతోధికంగా తోడ్పడుతోంది. మిగతా మాంసాల కంటే కోడి మాంసంలో కొవ్వు తక్కువ. అందుకే ప్రపంచ మానవాళికి ఇది ఇష్టమైన ఆహారం. కోళ్ల పరిశ్రమ ఎంతోమంది జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరింపజేస్తోంది. పేద దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికాలో కోళ్ల పెంపకం, విక్రయాల ద్వారా జీవనభృతి పొందుతున్న వారు దాదాపు 25 కోట్ల మంది! ఆఫ్రికాలో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు కోడిగుడ్లు సమృద్ధిగా మాంసకృత్తులు, పోషకాల్ని అందిస్తున్నాయి. వీటి పెంపకం సులభతరం, తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.. ఇంటి ఆవరణలోనే పెంచుకోవచ్చు కాబట్టి కోళ్లను మహిళల పెంపుడు జంతువని అంటుంటారు. ఒక వ్యక్తి ఐదు కోళ్లతో పెంపకం ప్రారంభిస్తే.. మూడు నెలలకు వాటి ద్వారా 40 కోడి పిల్లలు తయారవుతాయి. పశ్చిమాఫ్రికాలాంటి పేద దేశాల్లో ఒక్కో కోడిపిల్లను 5 డాలర్ల వంతున విక్రయించినా.. ఏటా 1000 డాలర్లకు పైగా సంపాదించొచ్చని, దుర్భర దారిద్య్రం(ఏటా 700 డాలర్ల పరిమితి) నుంచి బయటపడొచ్చని బిల్‌గేట్స్‌ చెబుతారు. ఆఫ్రికా దేశాల్లో తాండవిస్తున్న పేదరికం, పోషకాహార లోపం.. రెండింటికీ పరిష్కారం కోళ్ల పెంపకంలో ఉందంటారు బిల్‌ గేట్స్‌! అందుకే ఆఫ్రికా దేశాల్లో కోళ్ల పెంపకం మీద గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. మొదటివిడత కింద దాదాపు లక్ష కోడిపిల్లల్ని ఆయన బహుమతిగా ఇచ్చారు. వేడిని, జబ్బులను తట్టుకునే మేలు రకం కోళ్ల ఉత్పత్తి కోసం ‘ఫీడ్‌ ద ఫ్యూచర్‌’ అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక పరిశోధనలను కూడా ప్రోత్సహిస్తోంది. మానవజాతి చరిత్రను తిరగరాయడంలో గుర్రాలు, ఎద్దుల పెంపకం ఎంతగా ఉపకరించిందో కోళ్లు, మరికొన్ని పెంపుడు జంతువుల పెంపకం కూడా అంతే తోడ్పడిందని ‘గన్స్‌ జెర్మ్స్‌ అండ్‌ స్టీల్‌’ అనే పుస్తకంలో జేర్డ్‌ డైమండ్‌ విశదీకరించారు.

తెలుగు రాష్ట్రాలు అనుకూలం

కోళ్ల పెంపకానికి తెలుగు రాష్ట్రాలతో పాటు,మహారాష్ట్ర ఎంతో అనుకూలం. అందుకే ఇక్కడ కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ్నుంచి భారీగా గుడ్ల ఉత్పత్తి జరిగి వేరే ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.

ఇంతింతై.. కోడింతై

మాంసం అధికోత్పత్తి కోసం కోళ్ల బరువును పెంచడానికి, దీన్నో పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి ప్రపంచంలో పెద్దఎత్తున కృషి జరిగింది. వీటికి విపరీతంగా ఆహారం పెట్టడం మొదలయింది. దీనివల్ల కోడి బరువు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కోళ్ల పెంపకం చాలా చౌక. ఒక కేజీ కోడిని పెంచడానికి 1.3 కేజీల ధాన్యం సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1985లో 2.5 కేజీల ధాన్యం కావాల్సి వచ్చేది. ఒక పౌండు పెద్దకూరను ఉత్పత్తిచేయడానికి ఏడు పౌండ్లు, ఒక పౌండు పందిమాంసం తయారీకి మూడు పౌండ్లు ఆహారం అవసరం.

కుక్కుటం చరిత్ర సుదీర్ఘం

నేడు మనం ఎంతో ఇష్టమైన ఆహారంగా భుజిస్తున్న కోడికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వాటి పుట్టుకపై కచ్చితమైన ఆధారాల్లేనప్పటికీ.. ఇళ్ల వద్ద కోళ్ల పెంపకం 7 వేల నుంచి 10 వేల ఏళ్ల కిందటే మొదలయిందని చరిత్ర చెబుతోంది. ఈశాన్య చైనాలోని అటవీ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 5400 ఏళ్ల నాటి కోడి ఎముకల ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు. ఈ కోళ్లను ఆగ్నేయాసియా నుంచి చైనాకు తెచ్చి ఉండొచ్చని, ‘గల్లూ గల్లూ’గా పిలిచే.. అడవిజాతి కోడి వీటికి పూర్వీకులై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. గల్లూగల్లూలు చైనా వైపుగానీ, లేదా నైరుతి భారతదేశానికి గానీ ప్రయాణించి ఉండొచ్చని వారు నిర్ధారణకు వచ్చారు. చార్లెస్‌ డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం, ఇటీవలే వెలుగుచూసిన డీఎన్‌ఏ విశ్లేషణలూ దీనినే ధ్రువీకరిస్తున్నాయి. కోడిపుంజు తలపై కనిపించే తురాయి, గొంతుకింద వేలాడే లోలాకుల్లాంటి చŸర్మభాగాలు, పోట్లాటకు ఉపయోగపడే పాదాల తీరు, కోడిపెట్టల్ని ఆకర్షించడానికి గొంతెత్తి పిలిచే విధానం.. ఈ లక్షణాలన్నీ నేటి కోళ్లను పోలి ఉన్నట్లు గుర్తించారు. గల్లూ గల్లూలు ఈశాన్య భారతం నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు కనిపించేవి. ఆఫ్రికాలో గినియా ఫౌల్స్‌గా పిలిచే కోళ్లూ ఇలాంటి లక్షణాలే కలిగి ఉండేవి. గల్లూ గల్లూలు ఎర్రరంగు ఈకల్ని మాత్రమే కలిగి ఉండేవి. ఆ తర్వాత వచ్చిన కోళ్ల ఈకలు, చర్మం రంగు మారడాన్ని బట్టి నేటి కోళ్లకు గల్లూగల్లూలొక్కటే పూర్వీకులు కాదనే విషయం అర్థమవుతోందని హార్వర్డ్‌, ఎంఐటీల్లో కోళ్ల జన్యువులపై అధ్యయనం చేసిన బయాలజిస్టు మైఖేల్‌ జోడీ తేల్చారు.
ప్రపంచంలో దాదాపు 3000 కోట్ల జంతువుల్ని ఫారాలలో పెంచుతుంటే... అందులో 2300 కోట్లు కోళ్లే.

తొలి పెంపుడు జంతువు కోడే!

స్వీడన్‌ ఉప్పస్లా యూనివర్సిటీ నేతృత్వంలో జన్యుశాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా 2004లో కోళ్ల పూర్తి జన్యుక్రమాన్ని ఆవిష్కరించారు. మనిషి మొట్టమొదటి పెంపుడు జంతువు కోడే అని వారు తేల్చారు. ఎర్రటి తురాయి, పెద్ద తోక, ఈకలు కలిగిన మగకోడికి, గుడ్లు పెట్టే ఆడకోడికి మధ్య వ్యత్యాసాన్ని వారు గుర్తించారు. కోళ్ల జన్యువులోని ఉత్పరివర్తనల్ని అశక్తంచేస్తే ఏడాది పొడవునా అవి గుడ్లుపెడతాయని వారు నిగ్గుతేల్చారు.

20వ శతాబ్దంలో..
20వ శతాబ్దం ఆరంభంలో ఆహారం, ఆర్థిక వ్యవస్థల్లో కోడి పాత్ర అంత ఎక్కువగా ఉండేది కాదు. కోడిని గుడ్ల కోసమే ఎక్కువగా పెంచేవారు. యాంత్రిక జంతు వధశాలలు వచ్చి.. పెద్దఎత్తున మాంసం ఉత్పత్తి చేస్తున్న రోజుల్లో సైతం కోళ్ల పెంపకం ఒక చిన్న పరిశ్రమలాగానే కొనసాగింది. నేడు లక్షల కొద్దీ కోళ్ల ఫారాలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది మాత్రం యాంటిబయాటిక్స్‌, విటమిన్లతో కూడిన కోళ్ల దాణా ఉత్పత్తి విపరీతంగా పెరగడమే. నేడు కోళ్లను ఫారాలలో ఉంచి.. కృత్రిమ వెలుతురును అందిస్తూ.. అవి త్వరగా పెరగడానికి అసరమయ్యే నియంత్రిత ఆహారం ఇస్తున్నారు. దీనివల్ల కొద్దిరోజుల్లేనే అవి కేజీల కొద్దీ బరువు తూగుతున్నాయి.

కోళ్లు పరిశ్రమగా మారిందిలా..

ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహార అవసరాలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో మాంసకృత్తులు పుష్కలంగా అందిస్తున్న కోళ్ల పెంపకం వ్యాపారంగా వృద్ధిచెందడం ప్రారంభమైంది. 1990ల కన్నా ముందు నీరు, ఆహారం లాంటివి కోళ్లకు పరిమితంగా దొరికేవి. దానివల్ల వాటి వృద్ధీ, గుడ్ల ఉత్పత్తీ పరిమితంగానే ఉండేది. అప్పట్లో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కోడిమాంసం తినేవారు. గుడ్డు తినడాన్ని విలాసంగా పరిగణించేవారు. 1900వ సంవత్సరం ఆరంభంలో కోళ్లను ఎక్కువగా కుటుంబ ఫారాలలోనే పెంచేవారు. 400 కోళ్లు ఉంటే పెద్ద ఫారాల కింద లెక్క. ఒక కోడి ఏడాదికి 80 నుంచి 150 దాకా గుడ్లు పెట్టేది. కోళ్ల కోసం ప్రత్యేకంగా గదులు ఉండేవి కాదు. చలికాలం వచ్చిందంటే విటమిన్‌ డి లభించక.. కోళ్లకు జబ్బులొచ్చేవి. 1920ల ఆరంభంలో విటమిన్‌-డి గుర్తించిన తర్వాత- కోళ్ల ఉత్పత్తిలో నెమ్మదిగా విప్లవం ప్రారంభమైంది. విటమిన్‌-డి సప్లిమెంట్లతో చలికాలంలో సైతం అవి నిలదొక్కుకోగలుగుతున్నాయి.

* 1923లో అమెరికాలోని డెలావర్‌లో విల్మర్‌ స్టీల్‌ అనే మహిళ కేవలం మాంసం కోసమే 500 కోళ్లను పెంచారు. దీంతో ఆమె 1926 నాటికి 10 వేల కోళ్లతో బ్రాయిలర్‌ హౌస్‌ను అభివృద్ధి చేశారు. వాణిజ్య బ్రాయిలర్‌ పరిశ్రమకు ఆమెను ఆద్యురాలిగా చెబుతారు. షెడ్ల కింద బ్రాయిలర్‌లను ఉత్పత్తిచేసే ప్రక్రియ అప్పుడే మొదలైంది.

* 1970-90ల మధ్య పోషకాహారంలో పురోగతి, కోళ్లను జన్యుపరంగా అభివృద్ధిచేయడం, యాంత్రికీకరణ పెరగడం.. జబ్బుల నివారణ కార్యక్రమాలు ముమ్మరమవడం.. యాంటీబయాటిక్స్‌ సమ్మిళిత దాణా ఉత్పత్తి ఎక్కువవడంతో.. పౌల్ట్రీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది.

చికెన్‌ విలాస ఆహారం అనే మాట 195060ల మధ్యనాటికల్లా కనుమరుగైంది. చికెన్‌ అందరి ఆహారంగా మారింది.

కృత్రిమంగా పొదిగారు!

ఈజిప్టులో కోళ్ల పెంపకం ప్రాచుర్యం పొందడానికి దాదాపు వెయ్యేళ్లు పట్టింది. కోళ్లు ఎక్కువ గుడ్లు పెట్టడం కోసం అప్పట్లోనే వారు కృత్రిమంగా పొదిగే పద్ధతుల్ని అవలంబించారు. సాధారణంగా కోళ్లు 99-105 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రత వద్ద మూడు వారాల్లో గుడ్లను పొదుగుతాయి. కానీ ఈజిప్షియన్లు వందల కొద్దీ కుంపట్లు కలిగిన భారీ ఇంక్యుబేషన్‌(పొదిగే) కాంప్లెక్సులను నిర్మించారు. గడ్డి, ఒంటె పేడను మండించడం ద్వారా ఉష్ణాన్ని కాంప్లెక్సు వైపు మళ్లిస్తూ.. గుడ్లను పొదిగే తీరును నియంత్రించసాగారు. వేగంగా గుడ్లు పొదిగేలా చేశారు. ఈ రహస్యాన్ని మాత్రం శతాబ్దాలైనా ఈజిప్షియన్లు ఎవరికీ చెప్పలేదు.

ఏయే దేశాల్లో దేన్ని ఇష్టపడతారు?

పాశ్చాత్య దేశాల్లో కోడి ఎదభాగాన్ని(బ్రెస్ట్‌) ఎక్కువగా ఇష్టపడతారు. ఆసియా, ఆఫ్రికాల్లో కోడి కాళ్లు, తొడల భాగానికి డిమాండు ఎక్కువ.


అమెరికాలో కోడి కాళ్ల కన్నా బ్రెస్ట్స్‌ ఖరీదు 88% ఎక్కువ. ఇండొనేషియాలో అవి 12% చౌక.


కోడి పాదాల్ని(ఫీనిక్స్‌) పాశ్చాత్య దేశాల్లో చాలా అరుదుగా తింటారు. కానీ చైనాలో వీటి వినియోగం చాలా ఎక్కువ. చైనా ఏటా 3 లక్షల టన్నుల ఫీనిక్స్‌ను దిగుమతి చేసుకుంటుంది.

కొన్నింటికి భలే గిరాకీ

కొన్ని రకాల కోళ్లకు, కోడిపిల్లలకు భలే గిరాకీ. ఉదాహరణకు అమెరికాలోని గ్రీన్‌ఫైర్‌ ఫారా తయారుచేసే కోడిపిల్లల ధర వింటే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇక్కడ ఒకరోజు కోడిపిల్ల ధర 400 డాలర్లు(రూ.28,534) పలుకుతుంది. మన దేశంలో కడక్‌నాథ్‌ కోడి ఇప్పుడు హాట్‌ టాపిక్‌. దీని ధర కొన్నిచోట్ల వేలల్లోనే పలుకుతోంది. పందేల కోసం పెంచే కోళ్లు తెలుగు రాష్ట్రాల్లో వేల ధరను పలుకుతుంటాయి.

రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న 100 కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏకైక పరిష్కారం ఉండకపోవచ్చు. కానీ చాలా పేద దేశాల్లో కోళ్లను పెంచుతున్న వారిని, వాళ్ల అనుభవాలను విన్న తర్వాత ఇది కూడా ఒక ఉత్తమ పరిష్కారమే అని అర్థమైంది. ఒకవేళ నేనే గనక వాళ్ల స్థానంలో ఉంటే కోళ్ల పెంపకం మొదలుపెట్టేంతలా స్ఫూర్తిపొందుతాను. ఎందుకంటే వీటి పెంపకం సులభం, లాభదాయకం. అంతే కాదు, పోషకాహార లోపంతో మగ్గుతున్న వారికి మాంసకృత్తులు దండిగా లభించే గుడ్లు మంచి బాసట కూడా అవుతాయి’’

- బిల్‌గేట్స్‌


 
ప్రస్తుతం కోళ్లు ఏటా 250 దాకా గుడ్లు పెడుతున్నాయి. రోగాలతో చనిపోవడం 5 శాతానికి పడిపోయింది.

చికెన్‌లో ఎలాంటి పోషక విలువలుంటాయి?

మిగతా మాంసాలతో పోలిస్తే చికెన్‌లో కొవ్వు తక్కువ. అందుకే దీన్ని వైట్‌ మీట్‌ అంటారు. ఎక్కువ మాంసకృత్తుల్ని అందిస్తుంది. రుచికరం కూడా. జబ్బులకు ఆస్కారం ఇవ్వదు. కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తుంది. అందుకే ఇది ఇంతగా ప్రాచుర్యం పొందింది. చికెన్‌లో సోడియం తక్కువ. థయమిన్‌, కాపర్‌, మెగ్నీషియం దండిగా దొరుకుతుంది. విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, రైబో ఫ్లావిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బీ6, బీ3, ఫోలేట్‌, విటమిన్‌ బీ 12, ఐరన్‌, ఫాస్పరస్‌, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. చికెన్‌లో ట్రిప్టోఫాన్‌ అనే అమినో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది మనసును కుదుటపరుస్తుంది. చికెన్‌ తినడం వల్ల మెదడులో సెరటోనిన్‌ స్థాయిలు పెరిగి మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. వంద గ్రాముల చికెన్‌లో 168 కేలరీలు, 21.8 గ్రాముల మాంసకృత్తులు, 9 గ్రాముల కొవ్వు ఉంటాయి.

కోడిలో ఏ భాగం మంచి ఆహారం?

కోడి కాళ్లయినా, ఎదభాగం అయినా మంచి మాంసకృత్తుల్ని కలిగి ఉంటుంది. దేన్ని తిన్నా నష్టం లేదు.


ఎలా వండుకుంటే మంచిది?

నూనె, మసాలాలు తక్కువగా వేసి వండుకోవడం మంచిది. చికెన్‌ను ఫ్రై చేయడం కన్నా కూడా ఉడికించడం, కడ్డీలకు గుచ్చి కాల్చడం, రోస్ట్‌ చేయడం, టోస్టర్‌లో బేక్‌ చేయడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరు నివారించాలి?

కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, రక్తంలో కొలెస్ట్రాలు ఎక్కువగా ఉన్నవారు చికెన్‌ను తక్కువగా తింటే మేలు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.