close

ప్ర‌త్యేక క‌థ‌నం

మొండిఘటంగా స్వైన్‌ఫ్లూ 

రూపాంతరం చెందిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ 
రెండేళ్లకోసారి రూపం మార్చుకుంటున్న మహమ్మారి 
గత 44 రోజుల్లోనే 489 కేసులు నమోదు 
వైరస్‌ సోకి ఆరుగురు మృత్యువాత 
ప్రజల్లో అవగాహన పెంపునకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు

హమ్మారి వైరస్‌ తన రూపాన్ని అతి వేగంగా మార్చుకుంటోంది. రెండేళ్లకోసారి రూపాంతరం చెందే స్వభావమున్న స్వైన్‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఈ దఫా మరీ మొండిఘటంగా మారింది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్‌’గా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రెండేళ్ల కిందట ‘మిషిగాన్‌ స్ట్రెయిన్‌’గా కొత్త అవతారమెత్తింది. గతేడాది కొంత సంయమనం పాటించిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఈ ఏడాది ఆరంభం నుంచే విజృంభిస్తోంది. వైరస్‌ తన మూల రూపును మార్చుకోవడంతోనే కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే పుణెలోని వైరాలజీ ప్రయోగశాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా జరుగుతున్న పరిణామాలను బట్టి వైరస్‌ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లుగా అర్థమవుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు(గత 44 రోజుల్లో) 489 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో హైదరాబాద్‌లో 264, మేడ్చల్‌లో 87, రంగారెడ్డిలో 59 కేసులు నమోదవగా మిగిలిన జిల్లాల్లో కలుపుకొని 79 కేసులు నమోదయ్యాయి. ప్రజల్లో వైరస్‌ వ్యాప్తిపై విస్తృత ప్రచారాన్ని చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితారాణా బుధవారం ఆమోదముద్ర వేశారు. 
రెండేళ్లకోసారి విజృంభణ 
2009లో మొదటిసారిగా ‘హెచ్‌1ఎన్‌1’ అనే ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ వైరస్‌ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ ఏడాది, మరుసటి ఏడాది పెద్ద సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏడాది నిశ్శబ్దంగా ఉన్న వైరస్‌ మళ్లీ 2012లో ప్రతాపం చూపించింది. 2013, 2014లో అంతగా ప్రభావం చూపని హెచ్‌1ఎన్‌1 మరోసారి 2015లో ఉద్ధృతంగా విరుచుకుపడింది. ఆ ఏడాది దాదాపు 3193 కేసులు నమోదవగా 110 మంది మహమ్మారికి బలయ్యారు. 2016లో నెమ్మదించిన స్వైన్‌ఫ్లూ 2017లో విరుచుకుపడింది. ఆ ఏడాదిలో 2166 కేసులు నమోదవగా.. 21 మంది మృతిచెందారు. 2018లో తొలి 8 నెలలు స్తబ్ధుగా ఉన్న హెచ్‌1ఎన్‌1 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ విజృంభణ కొనసాగిస్తోంది. గతేడాది ఆగస్టులో 42 కేసులు నమోదై ఐదుగురు చనిపోగా, అక్టోబరులో 319 కేసులు-10 మంది మృతి, నవంబరులో 352 కేసులు-ఆరుగురు మృతి, డిసెంబరులో 273 కేసులు నమోదై ఆరుగురు మృతిచెందారు. గత ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా మహిళలు(538) ఈ మహమ్మారి బారిన పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. చలి వాతావరణంలో వైరస్‌ ఎక్కువ కాలం జీవించే అవకాశాలుండడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్యశాఖ అంచనా వేస్తోంది.

వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం

జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధి లక్షణాలున్నవారు సాధ్యమైనంత వరకు ఇంటిపట్టునే ఉండాలి. వీరు ఉపయోగించిన రుమాలు, టవల్‌ వంటివి ఇతరులు వాడవద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా వస్త్రం పెట్టుకోవాలి. కనీసం చేతులనైనా అడ్డుగా ఉంచుకోవాలి. తర్వాత వెంటనే ఆ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారితో కరచాలనాలు, ఆలింగనాలు చేయొద్దు. నమస్కారాలతో సరిపెట్టండి. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని అనుమానించి వైద్యున్ని సంప్రదించాలి.

- డాక్టర్‌ విక్రమ్‌ సంయుక్త సంచాలకులు, ప్రజారోగ్య విభాగం

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.