close

ప్ర‌త్యేక క‌థ‌నం

బిగుస్తున్న బినామీ చట్రం 

కొత్త చట్టం అండగా అక్రమార్కుల ఆస్తులపై ఉక్కుపాదం 
జాబితా సిద్ధం చేస్తున్న ఏసీబీ 
తోడుగా ఆదాయపు పన్ను శాఖ 
ఈనాడు - హైదరాబాద్‌

ధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించడం.. అవినీతి నిరోధకశాఖకు పట్టుబడకుండా అక్రమ సంపద అంతా బినామీల పేర్లపై పెట్టడం.. ఒకవేళ దొరికినా తమ పేరు మీద ఆస్తులేవీ లేవని చేతులెత్తేసి తప్పించుకోవడం.. చాలాకాలంగా అక్రమార్కులు అనుసరిస్తున్న వక్రమార్గం ఇదే. ఇటువంటి అవినీతిపరుల ఆస్తులను గుర్తించి స్వాధీనపరచుకోవడమే కాదు వారికి బినామీలుగా ఉన్నవారినీ చట్టపరంగా శిక్షించేందుకు రంగం సిద్ధమవుతోంది. అవినీతి నిరోధకశాఖ ఇప్పటికే అవినీతి కేసుల్లో తమకు పట్టుబడ్డ నలుగురు నిందితులకు సంబంధించిన బినామీలు, వారిపై పెట్టిన ఆస్తులను గుర్తించి తదుపరి చర్యల కోసం ఆదాయపుపన్ను శాఖకు బినామీ ట్రాన్సాక్షన్‌ రిపోర్టు (బీటీఆర్‌)లు పంపింది. 
బినామీ ఆస్తుల నిషేధిత చట్టానికి సవరణ చేసిన తర్వాత పంపిన మొట్టమొదటి జాబితా ఇదే. ఇదే తరహాలో తమవద్ద ఉన్న మిగతా నిందితులకు సంబంధించిన బినామీ ఆస్తులను కూడా గుర్తించే పని మొదలుపెట్టింది. 
రంగంలోకి ఆదాయపు పన్నుశాఖ 
బినామీ ఆస్తుల నిషేధిత చట్టం 1988ను 2016లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం బినామీలుగా గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, బినామీ వ్యక్తులపై చట్టపరంగా చర్య తీసుకోవడం సులభమైంది. చట్టసవరణ తర్వాత ఆదాయపు పన్ను శాఖలో దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా బినామీ ఆస్తుల స్వాధీన విభాగాలను ఏర్పాటు చేశాయి. అవినీతి నిరోధకశాఖ వంటి రాష్ట్ర విభాగాలు కూడా తాము గుర్తించిన బినామీ ఆస్తుల వివరాలను వీటికి పంపుతున్నాయి. బినామీ ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసిన 90 రోజుల వ్యవధిలో వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న తర్వాతనే వాదోపవాదాలు కొనసాగుతాయి. బినామీదారుగా గుర్తించిన వ్యక్తికి కూడా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష విధించవచ్చు. 
ఎలా గుర్తిస్తారు? 
దర్యాప్తులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానిత బినామీదారులకు నోటీసులు జారీ చేస్తారు. వారి ఆదాయ వ్యయ వివరాలు ఆరా తీస్తారు. వాస్తవానికి చాలామంది బినామీదారులకు పెద్దగా ఆదాయ వనరులుండవు. కానీ వారిపైర్ల మీద పెద్దపెద్ద ఆస్తులు ఉంటాయి. ఇవి ఎలా సమకూర్చుకున్నారో వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అక్రమంగా ఆర్జించిన అధికారికి, తన బినామీగా పెట్టుకున్న వ్యక్తికి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తారు. వాటన్నింటి ద్వారా బినామీదారులను, బినామీ ఆస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 
ఇక కష్టమే 
గతంలోనూ బినామీ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టినప్పటికీ అప్పట్లో ఆ విభాగం ప్రధానంగా అవినీతిపైనే ఎక్కువగా దృష్టి సారించేది. అవినీతి నిరోధక చట్టం కింద మాత్రమే చర్యలు తీసుకునేవారు. బినామీ ఆస్తులు, బినామీదారులపై దృష్టిపెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు కొత్త చట్టం వల్ల తమ దర్యాప్తులో బయటపడ్డ బినామీ ఆస్తులు, నిందితుల వివరాలను ఏసీబీ అధికారులు ఐటీ శాఖకు పంపుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు చేపడతారు. కాబట్టి బినామీ ఆస్తులు కూడబెట్టుకున్నా ఇకమీదట అక్రమార్కులకు ఎలాంటి ప్రయోజనం ఉండనట్లే!

*నిందితుడి పేరు: యూసుఫ్‌, సబ్‌రిజిస్ట్రార్‌  
బినామీలు: ఇద్దరు  నీ  ఆస్తులు: 6 
విలువ: రూ.3.5 కోట్లు (అధికారిక లెక్కల ప్రకారం), మార్కెట్‌ విలువ ప్రకారం కనీసం రూ.30 కోట్లు. 
ఇవి కాకుండా మరో ఇద్దరు బినామీల పేర్ల మీద ఐదు బ్యాంకు ఖాతాలు తెరిచి భారీగా నగదు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో రెండుసార్లు రూ.25 లక్షల చొప్పున జమ చేసినట్లు తేలింది. 

*     *      * 

నిందితుడు: గాంధీ, కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి 
బినామీ: ఒక్కరు  నీ  ఆస్తులు: ఆరు  
విలువ: సుమారు రూ.1.5 కోట్లు (అధికారిక లెక్కల ప్రకారం) నీ  మార్కెట్‌ విలువ: సుమారు రూ.10 కోట్లు

బినామీ ఆస్తి అంటే 
సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం.. ‘ఒక వ్యక్తి తన సొంత డబ్బుతో మరో వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం కలగకుండా అతని పేరుమీద కొనుగోలు చేసిన ఆస్తి ఏదైనా బినామీ ఆస్తే. దీన్ని బినామీ లావాదేవీగా పరిగణించాలి. తనపేరు మీద ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తికి మేలు చేయడమే సదరు బినామీ ఉద్దేశం.’

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.